Acne: మొటిమ వచ్చిందంటే దాన్ని మీద ఏదో ఒక ప్రయోగాన్ని చేస్తూనే ఉంటారు. అమ్మాయిలు మరికొందరు దాన్ని గిల్లుతూనే ఉంటారు. ఇలా మొటిమలను గిల్లడం వల్ల అవి పెద్దవిగా మారుతాయి. అలాగే పెద్ద మచ్చలు ఏర్పరుస్తాయి. మొటిమను పాప్ చేయడం వల్ల అది త్వరగా తగ్గదు. అది తగ్గడానికి నెలల సమయం తీసుకుంటుంది. అలాగే ఆ మొటిమ ద్వారా చర్మం లోపలికి బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు కారణం అవుతుంది. కాబట్టి మొటిమలను పాపింగ్ చేసే అలవాటు ఉంటే వెంటనే మానేయండి.
మొటిమలను గోళ్లతో గిచ్చి లోపల ఉన్న చీమను తీసేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తారు. దీని వల్ల శాశ్వతమైన నల్లటి మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే గుంటలు కూడా పడవచ్చు. అందుకే అలాంటి పనులు మానేయండి. దానంతట అదే పోయే వరకు ఓపికగా ఉండండి. మొటిమలు పగిలిన తర్వాత కూడా కొంతమంది ఆ ప్రదేశాన్ని అలాగే గిచ్చుతూనే ఉంటారు. అలా గుచ్చితే పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడతాయి.
మొటిమ పాప్ అయ్యాక క్లెన్సర్ తో ఆ ప్రాంతాన్ని సున్నితంగా శుభ్రం చేసుకోండి. రక్తం, చీము లాంటివి ఉంటే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి యాంటీసెప్టిక్ క్యాన్సర్‌ను వాడడం మంచిది. అలాగే విటమిన్ సి ఉన్న సీరంను లేదా ఎక్స్ ఫోలియంట్‌ను వాడడం వెంటనే మానేయండి. ఇది మొటిమ వచ్చిన ప్రదేశంలో చికాకును కలిగిస్తుంది. అలాగే ఆ మచ్చ మరింత లోతుగా పడేలా చేస్తుంది. సువాసన లేని తేలికపాటి మాయిశ్చరైజర్ ను మొటిమలు వచ్చే చోట ఉపయోగించండి. ఆ ప్రాంతంలో దురద, మంట రాకుండా ఈ మాయిశ్చరైజర్ కాపాడుతుంది.
మొటిమలు వచ్చాక మేకప్ వేయకుండా ఉండడమే మంచిది. మేకప్ వేయడం వల్ల ఆ మొటిమ మరింత ముదిరిపోయే అవకాశం ఉంది. అలాగే మొటిమ మీద దుమ్ము, ధూళి పడకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దుమ్ము ధూళి పడితే అక్కడ బ్యాక్టీరియా చేరి పుండులా మారిపోతుంది.
మొటిమలు వచ్చాక కొంతమందికి మచ్చలు, గుంటలు పడిపోతాయి. దానికి కారణం మీరు మొటిమలు గోళ్లతో గిల్లడమే. ఇలా గిల్లడం వల్ల అక్కడ కొలాజెన్ ఉత్పత్తి అసాధారణంగా మారిపోతుంది. అలాగే అక్కడ ఉన్న కణాల మరమ్మతుకు కూడా అంతరాయం కలుగుతుంది. దీనివల్ల అక్కడ మచ్చలు, ఎరుపు, దురద, గుంతలు పడడం వంటి సమస్యలు మొదలవుతాయి.
Also Read: ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు.. మీ ముఖం మెరిసిపోతుంది
ఇలా నివారించవచ్చు: మొటిమలు వచ్చినా అవి తగ్గే వరకు వాటి జోలికి వెళ్ళకండి. చేత్తో ముట్టకండి. వీలైనంత వరకు పరిశుభ్రంగా ఆ ప్రాంతాన్ని ఉంచేందుకు ప్రయత్నించండి. వ్యాయామం ద్వారా మొటిమలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఒత్తిడి ఎక్కువైనా కూడా మొటిమలు వస్తాయి. వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అలా మొటిమలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఇంట్లోనే యోగా, ధ్యానం, జాగింగ్, నడక, మెట్లెక్కడం వంటివి చేస్తూ ఉండండి. అయితే మొటిమల సమస్య తీవ్రంగా ఉన్నవారు మాత్రం వైద్యుల సహాయం తీసుకోవాలి. జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నా, నూనె పదార్థాలు అధికంగా తిన్నా కూడా మొటిమలు వస్తుంటాయి.