Afternoon sleeping effects: భోజనం చేసిన వెంటనే పడుకోవద్దు అనేది చాలాకాలంగా వింటున్న సలహా. మరోవైపు, ప్రత్యేకంగా మధ్యాహ్నం భోజనం తరువాత ఒక చిన్న కునుకు తీస్తే ఆరోగ్యానికి మంచిదని ఇప్పుడు చెబుతున్నారు. మరి ఈ రెండింటిలో ఏది నిజం? ఏది అబద్దం? దీనిపై పల్స్ హార్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ముఖర్జీ ఏమంటారో ఇప్పుడు చూద్దాం.
తినగానే నిద్ర రావడానికి కారణం అదే..
మనం తిన్న వెంటనే పడుకోవద్దని పెద్దలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఎందుకంటే అలా చేస్తే శరీరం అలసత్వానికి అలవాటు పడుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే పడుకుంటే శరీరంలో జరిగే మార్పులు ఆసక్తికరంగా ఉంటాయి. ఆహారం జీర్ణం కావడానికి కడుపు ఎక్కువ శక్తి వినియోగిస్తుంది. ఈ సమయంలో రక్త ప్రసరణలో పెద్ద భాగం కడుపు వైపు మళ్లిపోతుంది. దాంతో బ్రెయిన్, హార్ట్ వైపు రక్త ప్రవాహం కొద్దిగా తగ్గుతుంది. ఈ కారణంగానే భోజనం చేసిన వెంటనే మనకు నిద్ర మత్తు వస్తుందని డాక్టర్ ముఖర్జీ తెలిపారు. మన శరీరంలో ఏ భాగం ఎక్కువగా పనిచేస్తే దానికి ఎక్కువ రక్తం వెళ్తుంది. ఉదాహరణకు మనం నడుస్తున్నా, పరిగెడుతున్నా కండరాలకు ఎక్కువ రక్త ప్రసరణ ఉంటుంది. అదేవిధంగా ఆహారం అరిగించేటప్పుడు కడుపుకు ఎక్కువ రక్త సరఫరా అవుతుంది. దాంతో హార్ట్, బ్రెయిన్ కు రక్తం తక్కువగా చేరుతుంది. అందుకే తిన్న వెంటనే నిద్ర మత్తు వస్తుంది.
Also Read: Amruta Fadnavis: బీచ్‌ను శుభ్రం చేసిన సీఎం భార్య.. ఆమె డ్రెస్ చూసి నోరెళ్లబెట్టిన జనం
గుండె బజ్జు ఉన్నవారికి సమస్యలు తప్పవు
గుండె సమస్యలున్నవారు భోజనం చేసిన వెంటనే నడవకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి వారిలో రక్త ప్రసరణ ముందే పరిమితంగా ఉంటుంది. అలాంటి సమయంలో వేగంగా నడిస్తే గుండెపై ఒత్తిడి పెరిగి ఇబ్బందులు తలెత్తుతాయి. నడుస్తున్నప్పుడు గుండెలో గ్యాస్ లాగా, బరువుగా అనిపిస్తే అది సాధారణ సమస్య కాదు, హార్ట్ అలర్ట్‌గా గుర్తించాల్సిందే. తిన్న వెంటనే పడుకోవడం కూడా మంచిది కాదు. కొద్దిసేపు ఆగి తరువాత విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం. ఇక మధ్యాహ్నం 10–20 నిమిషాల చిన్న కునుకు మాత్రం శాస్త్రవేత్తలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. అలాంటి చిన్న విశ్రాంతి గుండెను రక్షించడమే కాకుండా శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
సమయం దాటి నిద్రపోతే ప్రమాదమే
భోజనం చేసిన వెంటనే లేదా అరగంట దాటిన తరువాత ఎక్కువసేపు నిద్రపోవడం శరీరానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం రెండు గంటలు నిద్రపోతే, అది ఆరోగ్యానికి మేలు చేయకపోవచ్చు. కానీ 10 నుంచి 20 నిమిషాల వరకు ఒక చిన్న కునుకు మాత్రం గుండెకు, శరీరానికి ఉపయోగకరమే. ఎక్కువసేపు నిద్రపోతే అలసట, జీర్ణ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే తిన్న వెంటనే నడవడం గానీ, పడుకోవడం గానీ కాకుండా, కనీసం అరగంట నుండి గంట వరకు ఆగి తర్వాత నడవడం, లేదా చిన్న నిద్ర తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ ముఖర్జీ సూచిస్తున్నారు.
మరింత సమాచారం కోసం కింద ఉన్న వీడియోను క్లిక్ చేసి చివరి వరకు చూడండి