Amruta Fadnavis: ముంబై జూహూ బీచ్‌లో గణేశ్ నిమజ్జనం తర్వాత చెత్తను తొలగించేందుకు అమృత ఫడ్నవీస్ ఆధ్వర్యంలో భారీ క్లీనప్ కార్యక్రమం జరిగింది. జీన్స్, టాప్ వేసుకుని స్వయంగా చెత్త సేకరించడం నెటిజన్ల చర్చగా మారింది.
ముంబై జూహూ బీచ్‌లో ఆదివారం భారీ క్లీనప్ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణేశ్ నిమజ్జనాల తరువాత బీచ్ చెత్తతో నిండిపోవడంతో, దానిని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా ఆమె ఈ క్లీనప్ ను నిర్వహించారు. అమృత ఫడ్నవీస్ స్థాపించిన దివ్యజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, బీఎంసీ కమిషనర్ భూషణ్ గగ్రాణి తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొన్నారు. బీచ్‌లు శుభ్రంగా ఉంచడం కూడా పండుగలు జరుపుకోవడం అంతే ముఖ్యమని అమృత ఫడ్నవీస్ ఈ సందర్భంలో ప్రజలకు సందేశం ఇచ్చారు.
డ్రెస్ పై సోషల్ మీడియాలో చర్చ
ఈ క్లీనప్ లో అమృత ఫడ్నవీస్ వేసుకున్న డ్రెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా యువతిలా జీన్స్, టాప్ ధరించి స్వయంగా చెత్త సేకరించడం ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఇంత సింపుల్‌గా, ఇలాంటి సాధారణ దుస్తుల్లో వచ్చి బీచ్ శుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా గొప్ప విషయం అని కొందరు ప్రశంసిస్తుండగా, సీఎం భార్యగా ఉన్నప్పటికీ స్వయంగా చెత్త సేకరించి పరిశుభ్రతకు సహకరించడం నిజంగా గ్రేట్ ఇది ప్రతి ఒక్కరికి ఉదాహరణ అని మరికొందరు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Also Read: Viral Video: వీడెవడండి బాబు.. చంపిన ప్రతి దోమను దాచిపెట్టి ఏం చేస్తున్నాడంటే?
టైట్ జీన్స్‌తో రావడం అవసరమా?
సీఎం భార్యగా ఉండి ప్రజల్లో మరింత పద్దతిగా రావాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. జీన్స్, టాప్ వేసుకుని బీచ్ శుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం సరైన పద్ధతి కాదని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టైట్ జీన్స్, కేజువల్ షర్ట్ ధరించి ప్రజల ముందు కనిపించడం సీఎం కుటుంబానికి తగిన గౌరవం కాదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. గణేశ్ నిమజ్జనం అనంతరం చెత్త తొలగించేందుకు ఇలాంటి జిమ్ లుక్‌లో రావడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.
జూహూ బీచ్‌లో గణేశ్ నిమజ్జన అనంతరం ఏర్పడిన చెత్త సమస్యను పరిష్కరించడానికి అమృత ఫడ్నవీస్ చేసిన ప్రయత్నం, బీచ్ శుభ్రతను అందరికీ ఒక స్ఫూర్తిగా మార్చింది. ఈ కార్యక్రమం ద్వారా, మనందరం పండుగలు, ఉత్సవాలు జరుపుకోవడంలో మాత్రమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో కూడా ఒక పాత్ర పోషించగలమని చూపిస్తుంది.