Chrysanthemum Flowers: శీతాకాలంలో విరివిగా పూసే చామంతి పూలను సాధారణంగా పండగ సందర్భాల్లో, పూజల్లోనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే చాలామంది.. జ్వరం, కీళ్ల నొప్పులు, నిద్రలేమి, ఒత్తిడి వంటివి తగ్గడానికి చామంతి పూల టీ తాగుతుంటారు. కేవలం ఆరోగ్యం, అలంకరణకే కాకుండా.. చామంతి పూలను చర్మ సౌందర్యంలోనూ భాగం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
ఈ పూలను తరతరాలుగా ఆయుర్వేదంలోనూ, సంప్రదాయ వైద్యంలోనూ, చర్మ సమస్యల నివారణకు వినియోగిస్తున్నారు. చామంతి పూలల్లో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని హెల్దీగా ఉంచడానికి, దాని సహజ కాంతిని పునరుద్ధరించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా.. శీతాకాలంలో పొడిబారిన చర్మాన్ని రిపేర్ చేయడంలో చామంతి పూలు కీలకపాత్ర పోషిస్తాయి.
చర్మ సంరక్షణకు చామంతి పూలను ఉపయోగించుకోవాలంటే.. తాజాగా పూసిన చామంతి పూలను సేకరించి, వాటిని శుభ్రంగా కడిగి ఎండలో బాగా ఆరబెట్టాలి. అవి పూర్తిగా ఎండన తర్వాత, వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పొడితో ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవచ్చు. ఈ చామంతి పొడిని వాడటం వల్ల చర్మంపై ఏర్పడే నల్ల మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.
చామంతి పూలతో ఫేస్‌ప్యాక్ వేసుకోవాలంటే.. ఒక గిన్నెలో చామంతి పూల పొడిని తీసుకుని, అందులో ఒక టీస్ఫూన్ ఎర్ర కందిపప్పు పొడి, కొద్దిగా రోజ్‌వాటర్ కలపాలి. కందిపప్పు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. ఈ పేస్ట్‌ను ముఖం, మెడ భాగాల్లో అప్లై చేసుకుని, 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరి. ఈ ఫేస్‌ప్యాక్.. చర్మానికి చల్లదనాన్ని అందించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
చామంతి-కందిపప్పు కాంబినేషన్‌లో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే.. మెరుగైన ఫలితాలను వస్తుంది. వారానికి కనీసం రెండుసార్లు తప్పుకుండా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా ఫేస్‌ప్యాక్ వేసుకుంటే, ముఖంపై నల్లమచ్చలు, మొటిమలు క్రమేణా తగ్గిపోతాయి. అలాగే, చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోయి, చర్మం కాంతిమంతంగా మారుతుంది. ఈ చామంతిలోని సహజ గుణాలు చర్మానికి హానీ చేయకుండా లోపలి నుండి శుభ్రపరుస్తాయి. చర్మ సంరక్షణలో రసాయనాలకు బదులుగా సహజ పద్ధతులను ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.