Special Prasadam Recipes: కార్తీక మాసం అంటే శివకేశవుల ఆరాధనకు, ఉపవాస దీక్షలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన పవిత్ర మాసం. ఈ నెల రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, స్వామివారికి నివేదించే ప్రసాదాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రసాదాలు కేవలం రుచికరంగా ఉండటమే కాక.. ఆరోగ్యాన్ని, సాత్వికతను పెంపొందించేలా తయారుచేయడం సంప్రదాయం. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి వినియోగించకుండా వీటిని తయారుచేయాలి. కార్తీక మాసంలో తక్కువ టైంలో తయారు చేసుకోగలిగే ప్రసాదాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. గోధుమ రవ్వ కేసరి/పరమాన్నం: కార్తీక సోమవారాల్లో.. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో సత్యనారాయణ వ్రతాలు ఎక్కువగా జరుగుతాయి. అప్పుడు గోధుమ రవ్వతో చేసిన కేసరి లేదా పరమాన్నం ముఖ్యమైన నైవేద్యం.
ప్రత్యేకత: గోధుమ రవ్వను నెయ్యిలో వేయించి.. పాలు లేదా నీటిలో ఉడికించి.. బెల్లం లేదా చక్కెరతో తయారుచేస్తారు. ఇది త్వరగా జీర్ణమవుతుంది. అంతే కాకుండా ఉపవాసం అనంతరం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
2. పెసర పప్పు పాయసం: కార్తీక మాసం లో విష్ణుమూర్తి ఆరాధనలో భాగంగా పెసరపప్పుతో చేసిన పాయసానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.
తయారీ: పెసరపప్పును మెత్తగా ఉడికించి.. బెల్లం పాకం, పాలు, కొబ్బరి పాలు ఐచ్ఛికం, యాలకుల పొడితో కలిపి తయారుచేస్తారు.
ఆరోగ్యం: పెసరపప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి చలవ చేస్తుంది. ఉపవాసం తర్వాత తీసుకునేందుకు చాలా అనుకూలమైనది.
3. కట్టె పొంగలి (ఖారా పొంగలి) & దద్దోజనం: ఉదయం దీపారాధన తర్వాత నివేదించేందుకు ఈ రెండు ప్రసాదాలు చాలా శ్రేష్టమైనవి.
కట్టె పొంగలి: బియ్యం, పెసరపప్పును కలిపి ఉడికించి.. నెయ్యి, మిరియాలు, జీలకర్ర, అల్లం, కరివేపాకుతో తాళింపు పెడతారు. జీర్ణ వ్యవస్థకు మేలు చేసే తేలికపాటి ఆహారం ఇది.
దద్దోజనం (పెరుగన్నం): వండిన అన్నాన్ని పాలు, పెరుగు కలిపి, మిరియాలు, అల్లం, ఆవాలు, జీల కర్రతో తాళింపు పెడతారు. శరీరాన్ని చల్లబరిచి, జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
Also Read: కార్తీక మాసం స్పెషల్ రెసిపీలు.. ఇవి లేకపోతే పండగే పూర్తవ్వదు !
కార్తీక మాసపు ప్రత్యేక ప్రసాదాలు:
4. ఉసిరి అన్నం (ఆమ్లా రైస్): కార్తీక మాసంలో ఉసిరి కాయకు అత్యంత పవిత్ర స్థానం ఉంది. ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేసేటప్పుడు ఉసిరి అన్నం తప్పనిసరి.
తయారీ: ఉసిరికాయ తురుమును పచ్చిమిర్చి, అల్లం, పల్లీలు, శనగ పప్పుతో నూనెలో వేయించి.. అన్నంలో కలుపుతారు. ఉసిరిలో ఉండే విటమిన్ ‘సి’ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
5. పూర్ణాలు/బూరెలు: కార్తీక పూర్ణిమ వంటి పండగ రోజుల్లో ఈ తీపి వంటకాన్ని నివేదిస్తారు.
తయారీ: శనగపప్పు, బెల్లం కలిపి చేసే పూర్ణం, దాన్ని బియ్యం పిండి తో చేసిన ముద్దలో లేదా మినప్పిండితో చేసిన దోసెల పిండిలో ముంచి నూనెలో వేయించి చేస్తారు.
ఈ కార్తీక మాసంలో పైన తెలిపిన ప్రసాదాలను ఉల్లి, వెల్లుల్లి లేకుండా తయారు చేసి శివ కేశవులకు నివేదించడం ద్వారా విశేష ఫలితాలు, ఆరోగ్యం కలుగుతాయి.