Kanda Bachali Kura: కార్తీక మాసం అంటే ఆంధ్ర సంప్రదాయ వంటకాలకు.. ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రత్యేక వంటకాలకు నెలవు. ఈ పవిత్ర మాసంలో ఉల్లి, వెల్లుల్లి లేకుండా చేసే కూరల్లో కంద బచ్చలి కూర చాలా ముఖ్యమైంది. రుచిలో అద్భుతంగా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కంద బచ్చలి కూరను ‘ఆవ పెట్టిన కూర’ అనని కూడా అంటారు. కార్తీక మాసం సందర్భంగా ఈ సాంప్రదాయ వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కంద బచ్చలి కూర స్పెషాలిటీ:
కంద, బచ్చలి రెండూ అపారమైన పోషక విలువలు కలిగి ఉంటాయి.
కంద: జీర్ణక్రియకు సహాయపడే పీచు పదార్థాన్ని అధికంగా కలిగి ఉంటుంది.
బచ్చలి: విటమిన్ ‘ఎ’, ‘సి’ , ఐరన్ వంటి వాటిని పుష్కలంగా అందిస్తుంది.
చింతపండు, ఆవ: కంద వల్ల వచ్చే దురదను తగ్గించడానికి.. రుచిని పెంచడానికి చింతపండు, ఆవాలు వాడతారు. ఈ కూర కార్తీక వనభోజనాల్లో తప్పకుండా ఉంటుంది.
తయారీకి కావలసిన పదార్థాలు:
కంద ముక్కలు – 250 గ్రాములు
బచ్చలి ఆకు, కాడల తరుగు – 1 కప్పు
చింతపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – 1/2 టీస్పూన్
బెల్లం తురుము – 1 టీస్పూన్
పచ్చిమిర్చి చీలికలు – 4
ఆవ పేస్ట్ కోసం:
ఆవాలు – 1.5 టీస్పూన్లు
అల్లం ముక్క – 1 అంగుళం
ఎండుమిర్చి – 2
ఉప్పు, పసుపు – చిటికెడు
నీరు – కొద్దిగా
తాళింపు కోసం:
నూనె/నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు, జీలకర్ర – 1/2 టీస్పూన్
ఎండుమిర్చి – 2
కరివేపాకు – కొద్దిగా
ఇంగువ – చిటికెడు
కంద బచ్చలి ఆవ కూర తయారీ విధానం:
కంద ఉడికించడం: కంద ముక్కలను శుభ్రం చేసి.. కుక్కర్‌లో కొద్దిగా ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు (కొద్దిగా) వేసి.. మెత్తగా కాకుండా, ముక్క కాస్త గట్టిగా ఉండేలా ఉడికించాలి (సుమారు 2-3 విజిల్స్). తర్వాత ముక్కలను బయటకు తీసి.. కాస్త మెత్తగా చిదమాలి . తర్వాత బచ్చలి ఆకు, కాడలను సన్నగా తరిగి.. కొద్దిగా నీరు, పసుపు వేసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టాలి.
Also Read: కార్తీక మాసం స్పెషల్ రెసిపీలు.. ఇవి లేకపోతే పండగే పూర్తవ్వదు !
అనంతరం ఆవాలు, అల్లం, ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు, నీరు కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. వెంటనే.. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె/నెయ్యి వేసి వేడి చేయాలి. వీటిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి తాళింపు వేయాలి. తాళింపులో చింతపండు గుజ్జు, ఉప్పు, పచ్చిమిర్చి చీలికలు, బెల్లం వేసి బాగా కలపాలి. చింతపండు పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి.
ఇదిలా ఉంటే.. ఉడికించిన కంద ముద్ద, బచ్చలి తరుగును ఇందులో వేసి బాగా కలిపి.. కొద్దిగా నీరు అవసరమైతే వేసి ఐదు నిమిషాలు మగ్గించాలి. చివరగా.. ముందుగా సిద్ధం చేసుకున్న ఆవ పేస్ట్‌ను వేసి.. వెంటనే స్టవ్ ఆపివేయాలి. ఆవ పేస్ట్ వేసాక ఎక్కువగా ఉడికించకూడదు. దీని వల్ల ఆవ రుచి పోతుంది. ఈ సాంప్రదాయం కంద బచ్చలి కూర అన్నంతో కలిపి తింటే అద్భుతమైన రుచిని ఇస్తుంది. కార్తీక మాసం రోజుల్లో ఈ ఆరోగ్యకరమైన, సంప్రదాయ వంటకాన్ని తప్పక రుచి చూడండి.