Food : వేడి వేడి సమోసాలు. లొట్టలేసుకుంటూ తింటారు. హాట్ హాట్ జిలేబీలు పాకం కారుతున్నా లాగించేస్తుంటారు. ఆనియన్ సమోసా, ఆలూ సమోసా, కార్న్ సమోసా, పన్నీర్ సమోసా.. లోపలేమున్నా సరే సమోసా అనగానే తినేయడమే. జిలేబీలు సైతం అంతే క్రేజీగా ఎగబడి తింటుంటారు. ఫంక్షన్లలో స్పెషల్ ఐటమ్‌గా వడ్డిస్తుంటారు. అయితే, సమోసాలు, జిలేబీలు లాంటి డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినడం ఆరోగ్యానికి చాలా చాలా హానికరం అట. తెలిసో తెలియకో.. బాగుంటాయి కదాని లొట్టలేసుకుంటూ తింటే.. ఆ తర్వాత రోగాలతో అవస్థలు పడాల్సిందే అని హెచ్చరిస్తున్నారు. జస్ట్ వార్నింగ్ మాత్రమే కాదు.. సిగరెట్లు గురించి ప్రచారం చేసినట్టే సమోసా, జిలేబీలపైనా హెల్త్ వార్నింగ్ రాసిపెట్టాల్సిందే. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
సిగరెట్స్ తరహాలో హెచ్చరిక
సిగరెట్ తాగడం ప్రాణాలకు హానికరం. పొగ పీల్చితే పోతారు. భయపెట్టే బొమ్మలతో, పెద్ద పెద్ద అక్షరాలతో ప్యాకెట్లపై రాసుంటుంది. సినిమాకు ముందు, మధ్యలో బీభత్సమైన యాడ్స్‌తో హడలగొడుతుంటారు. వాటిని చూస్తూనే, చదువుతూనే డబ్బాలకు డబ్బాలు సిగరెట్లు కాల్చేస్తుంటారు. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, ఎంతగా ప్రచారం చేసినా.. డోంట్ కేర్ అంటుంటారు పొగరాయుళ్లు. అయితే, ఇదే కోవలో మరిన్ని హానికర పదార్థాలకూ ఇలాంటి ప్రచారమే చేయనుంది కేంద్ర ఆరోగ్య శాఖ. అందుకు నాగ్‌పూర్ ఎయిమ్స్‌ను మోడల్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. AIIMSలోని క్యాంటీన్లలో సమోసా, జిలేబీ, పకోడీ, వడా పావ్, బిస్కెట్స్ లాంటి స్నాక్స్‌పై.. హెచ్చరిక ప్రకటనలు ఏర్పాటు చేశారు. అంటే విషయం ఎంత సీరియస్‌గా నడుస్తోందో తెలుస్తోంది.
అవి తింటే ఎంత హాని అంటే..
సమోసాలు మైదా పిండితో చేస్తారు. సలసల కాగే నూనెలో మలమల మాడుస్తారు. జిలేబీల్లోనూ మైదానే ఉంటుంది. పాకంలో చక్కెర భారీగా కుమ్మరిస్తారు. నూనెలో గోలిస్తారు. బోండాలు, పకోడీలూ లాంటివి కూడా అంతే. వీటిలో ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవు. వట్టి కేలరీలు మాత్రమే ఉంటాయి. అధిక కార్పొహైడ్రేట్స్, అధిక కొవ్వు, హానికర ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక చక్కెర.. మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే అవి తింటే చాలా చాలా అనారోగ్యం అంటున్నారు. సిగరెట్ తరహాలో ఆరోగ్య హెచ్చరికలను ఇలాంటి స్నాక్స్‌పైనా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. నాగ్‌పూర్ ఎయిమ్స్‌లో పైలట్ ప్రాజెక్ట్ కూడా అమలు చేస్తోంది. ముందుముందు దేశమంతా ఇదే విధానం తీసుకొస్తామని చెబుతోంది. జీవనశైలి వ్యాధులు రాకుండా, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకునేలా ప్రజల్లో అవేర్‌నెస్ క్రియేట్ చేస్తామని చెబుతోంది.
Also Read : స్వీట్స్ తిన్న వెంటనే వాటర్ తాగితే అంత డేంజరా?
భారతీయుల్లో బిగ్ ప్రాబ్లమ్
భారతదేశం తీవ్ర ఆరోగ్య సంక్షోభాన్ని ఫేస్ చేస్తోంది. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు తదితర సమస్యలకు పోషక విలువలు లేని డీప్-ఫ్రైడ్, చక్కెర స్నాక్స్ తరచుగా తీసుకోవడమే కారణమని గుర్తించింది. 2050 నాటికి 440 మిలియన్ల మంది భారతీయులు అధిక బరువు, ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని ‘ది లాన్సెట్ జర్నల్’లో ప్రచురితమైన రీసెర్చ్ పేపర్ చెబుతోంది. అందుకే కేంద్రం అలర్ట్ అయింది. అయితే, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్‌పై సర్కారు నిషేధం విధించలేదు. అందుకే అవగాహన కలిపించే ప్రయత్నం చేస్తోంది. తింటే ఎలాంటి నష్టమో ప్రభుత్వం హెచ్చరిస్తుంది అంతే. అవి తానాలా వద్దా? అనేది వినియోగదారుల ఇష్టమే. ఇప్పటికే సంప్రదాయక ఆహారమైన మిల్లెట్స్‌ను ప్రోత్సహిస్తోంది కేంద్రం. నూనె వినియోగం తగ్గించాలని ప్రధాని మోదీ సైతం పిలుపుఇచ్చారు. ఇప్పుడిలా జంక్ ఫుడ్‌పై హెచ్చరిక జారీ చేస్తూ మరింత విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మార్పు మంచికే.. మారితే మంచిదే.