Healthy Fruits for Hair: హెయిర్ ఫాల్ అనేది ప్రస్తుతం చాలా సాధారణ సమస్య అయిపోయింది. పొల్యూషన్, పోషకాహార లోపం, విటమిన్ల లోపం, నిద్రలేమి, ఒత్తిడి వల్ల కొందరికి వివరీతంగా జుట్టు రాలిపోతుంది. అయితే ఈ సమస్యను కొంతమేరకైనా తగ్గించాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజూ తినే ఆహారంలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయట.
బెర్రీస్:
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్‌బెర్రీ వంటి పండ్లను తినడం వల్ల జుట్టు బలంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని అంటున్నారు. జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి కూడా ఈ పండ్లు హెల్ప్ చేస్తాయట. బెర్రీలలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి.
అరటిపండ్లు:
జుట్టును సంరక్షించడంలో అరటి పండ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయట. ఇందులోని బయోటిన్, పొటాషియం, మెగ్నీషియం స్ప్లిట్ ఎండ్స్ రాకుండా చేసేందుకు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుందట.
సిట్రస్ పండ్లు:
సిట్రస్ పండ్లను తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా జుట్టు రాలడాన్ని నివారించే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు, ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్లలోని విటమిన్-సి ఐరన్‌ని గ్రహించడంలో సహాయపడుతుందట. దీంతో జుట్టు త్వరగా పెరుగుతుందట.
యాపిల్స్:
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే యాపిల్ పండ్లను ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. జుట్టు పెరగడానికి కావాల్సిన పోషణను అందించడంలో ఇవి సహాయపడతాయట.
అవకాడో:
జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవకాడోలు ఎంతో సహాయపడతాయి. ఇందులో ఉండే బయోటిన్, విటమిన్-ఇ, ఫ్యాట్ కంటెంట్స్ మాడును తేమగా మారుస్తాయట. జుట్టును ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాకుండా పెరిగేలా చేసేందుకు కూడా ఇవి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మ:
మాడు భాగంలో రక్త ప్రసరణను మెరుగుపరిచేందుకు దానిమ్మపండ్లు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జుట్టును కుదుళ్ల నుంచి చేయడంతో పాటు హెయిర్ ఫాల్‌ని తగ్గించడానికి సహాయపడుతుందని అంటున్నారు. తరచుగా దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుందట.
ALSO READ: ఆలుగడ్డ వల్ల అనారోగ్యం..?
బొప్పడి:
బొప్పడి పండ్లను అధికంగా తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో ఉండే విటమిన్-ఎ మాడును తేమగా ఉంచే సెబమ్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుందట. దీని వల్ల చుండ్రు తొలగిపోయి, జుట్టు రాలడం ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
కివీ:
స్ప్లిట్ ఎండ్స్ సమస్య నుంచి జుట్టును రక్షించడంలో కివీ పండ్లు హెల్ప్ చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో ఉండే విటమిన్-ఇ, సి జుట్టు పెరగడానికి సహాయపడతాయని అంటున్నారు.
జామ:
జామకాయలు తరచుగా తీసుకోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్-సి వల్ల కురులు బలంగా మారుతాయట. అంతేకాకుండా హెయిర్ ఫాల్ సమస్యను కూడా దూరం చేస్తుంది.
ఈ పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బలమైన, మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టును పొందే ఛాన్స్ ఉందట.