Heart Attack: ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా హార్ట్ ఎటాక్స్ కారణంగా మరణిస్తున్నారు. గుండె జబ్బలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఎనిమిది రకాల తప్పులు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. గుండెపోటు వచ్చే ప్రమాదం ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. గుండెపోటు ఎప్పుడైనా, ఏ వయస్సు వారికైనా రావచ్చు. ఇదిలా ఉంటే మనం చేసే కొన్ని రకాల పనులు గుండెపోటును ప్రేరేపిస్తాయి. మరి ఆ పొరపాట్లేవో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండెపోటు రావడానికి కారణాలు :
అధిక శ్రమ:
గుండె ఆరోగ్యం కోసం శారీరక శ్రమ మంచిదే అయినప్పటికీ, అతిగా శ్రమించడం కొన్నిసార్లు గుండె వైఫల్యానికి కారణమవుతుంది. ఒకేసారి ఎక్కువగా పని చేయడం వల్ల శారీరకంగా హాని జరగడమే కాకుండా గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోతే, ఆకస్మిక శారీరక శ్రమ గుండెపోటుకు కారణం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
తక్కువ ఉష్ణోగ్రతలు:
చల్లని ఉష్ణోగ్రతలకు గురికావడం లేదా అకస్మాత్తుగా మీ తలపై చాలా చల్లటి నీటిని పోయడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. చలి వల్ల ధమనుల సంకోచం ఏర్పడుతుంది. ఇది రక్తపోటులో ఆకస్మిక పెరుగుదలకు దారితీస్తుంది. ఈ పరిస్థితి గుండెపోటును ప్రేరేపిస్తుంది.
లైంగిక సంపర్కం :
తీవ్రమైన లైంగిక సెషన్ కూడా గుండెపోటును ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నవారిలో. 50 ఏళ్లు పైబడిన వారికి, లైంగిక సంపర్కం సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం 2.7% పెరుగుతుంది.
డ్రగ్స్ లేదా ఆల్కహాల్:
ఆల్కహాల్, డ్రగ్స్ వల్ల కూడా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. మీరు ఆల్కహాల్‌ను ఇతర పదార్థాలతో కలిపి లేదా రెండు మందులు కలిపి తీసుకుంటే, మీ గుండెపోటు ప్రమాదం రెట్టింపు అవుతుంది.
నిద్ర లేకపోవడం:
నిద్ర లేకపోవడం వల్ల ఊబకాయం, రక్తపోటు, డిప్రెషన్ , గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఎనిమిది గంటలు నిద్రపోయే వారి కంటే రోజుకు ఆరు గంటలకు తక్కువ నిద్రపోయే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
భోజనం:
చాలా ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం క్రమం తప్పకుండా తినడం వల్ల నోర్‌పైన్‌ఫ్రైన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది హృదయ స్పందన రేటు , రక్తపోటును పెరిగేలా చేస్తుంది.
మైగ్రేన్‌లను విస్మరించడం:
మైగ్రేన్ వల్ల చిన్న వయసులోనే గుండెపోటు కూడా వస్తుంది. మైగ్రేన్ తలనొప్పి సమయంలో గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, మైగ్రేన్‌లను ఎప్పుడూ తేలికగా తీసుకోకండి . ఇందుకు సరైన చికిత్స తీసుకోండి. మైగ్రేన్‌లను నిర్లక్ష్యం చేయడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.
Also Read: షుగర్ పేషెంట్లు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు !
కాలుష్యం:
వాహనాల నుంచి వెలువడే సూక్ష్మ ధూళి కణాలు , పొగలు గుండెను గణనీయంగా దెబ్బతీస్తాయి. ఈ కణాలు రక్తం గడ్డకట్టడానికి కారణమవుతాయి. ఇది చివరికి గుండెపోటుకు దారితీస్తుంది. కాబట్టి, కొన్ని అనారోగ్యపు ఆహారపు అలవాట్లు ,పరిస్థితుల గురించి తెలుసుకోవడం ద్వారా మీరు గుండెపోటుకు దూరంగా ఉండవచ్చని గుర్తుంచుకోండి.