Congress Counter to KCR : చాన్నాళ్ల తర్వాత బయటకు కనిపించిన మాజీ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలపై హస్తం పార్టీ నేతలు స్పందించారు. కేసీఆర్ ఫాం హౌస్‌లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ అభ్యర్థుల కోసం ఇటువంటి ఆర్భాటపు మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఫాం హౌస్ పాలన.. గడీల పాలన కోరుకోవడం లేదని, ప్రజా పాలన – ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించలేని ప్రగతిని, కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించిందన్న మహేష్ కుమార్ గౌడ్.. కేసీఆర్ కి దిక్కుతోచకనే అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికే దిల్లీ లిక్కర్ స్కాంలో కూరుకుపోయిన కేసీఆర్ కుమార్తె కవితపై, ఇప్పుడు మరో లిక్కర్ స్కాం ఆరోపణలు రావడంతో ఆయన ఆ అంశాన్ని పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గద్దెదింపినా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కకపోయినా గుణపాఠం నేర్వని కేసీఆర్ ఫాం హౌస్‌లో పగటి కలలు కంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా విఫలమైన కేసీఆర్, కాంగ్రెస్ విఫలమైందని వ్యాఖ్యానించడం హాస్వాస్పదమన్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్.. కేసీఆర్ మాటలపై వ్యంగ్యంగా స్పందించారు. ఇకపై బయటకు వచ్చి పోరాడతా అని ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ.. ఓడిపోయిన తర్వాత ఫార్మ్ హౌస్ నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుందో చూసేందుకు మేము కూడా ఎదురుచూస్తున్నాం అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తానని చెబుతున్నారని, కానీ.. ప్రజలు బయటకు వస్తేనే కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారని గుర్తు చేశారు. కేసీఆర్ సమయంలో రాష్ట్రాన్ని దివాళా తీయించారన్న దయాకర్.. కేసీఆర్ విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని సరి చేసేందుకే సమయం సరిపోతుందని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ పాలనలోనే రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని ఊడ్చేశారని మండిపడిన అద్దంకి దయాకర్.. కేసీఆర్ చేసిన అప్పులు కట్టేందుకే బడ్జెట్ సరిపోతుందని అన్నారు. అయినా సరే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. పదేళ్ల ప్రజలు ఇచ్చిన అధికారం అనుభవించి.. పదవి పోగానే ప్రజలకు మొకం చూపించుకోలేక దాక్కున్నారంటూ వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యలపై స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్… కుంభకర్ణుడు సుదీర్ఘ కాలం తర్వాత నిద్రలేచినట్లుగా ఉందంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఆయన కొడితే మాములుగా ఉండదని కేసీఆర్ చెబుతున్నారు కానీ, రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీకి రాకుండా.. ప్రజలను కలవకుండా కేసీఆర్ ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో వస్తున్న ఎన్నికల కోసమే ఇప్పుడు హడావిడి చేస్తున్నారని అన్నారు. ఆయనకు ప్రతిదీ రాజకీయమే అని విమర్శించిన ఆది శ్రీనివాస్.. మాజీ సీఎం కు ఎన్నికలు తప్ప ప్రజల సంక్షేమం పట్టడని ఆరోపించారు. ఆయన మాట్లాడిన మాటలపై ఘాటుగా స్పందించారు. వీరితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన విమర్శలను.. ఆ పార్టీకి చెందిన ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా ఇతర నాయకుు స్పందించారు.