ఒకప్పుడు యాభై సంవత్సరాలు దాటిన తర్వాతే తెల్ల జుట్టు కనిపించేది. ఇప్పుడు చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతోంది. దీనికి విటమిన్ల లోపం కూడా కారణమేనని చెప్పుకుంటారు. కొన్నిసార్లు వారసత్వంగా కూడా జుట్టు రంగు తెల్లబడిపోతుందని అంటారు. తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఎంతోమంది రసాయనాలు కలిపిన రంగులు వాడతారు. ఖరీదైన చికిత్సలు చేయించుకుంటారు. పెద్దగా ఖర్చు లేకుండా ఇంట్లోనే సహజంగా నల్ల జుట్టును పొందవచ్చు.
హానికరమైన రసాయనాలు కలిగిన పదార్థాలను వాడడం జుట్టుకు మంచిది కాదు. అందుకే ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేని చిట్కాను ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ చెప్పిన పద్ధతిలో ప్రయత్నిస్తే జుట్టు సులువుగా నల్లగా మారిపోతుంది.
జుట్టును నల్లగా మార్చే చిట్కా
కలోంజి అని పిలిచే నల్ల గింజలు మార్కెట్లో దొరుకుతాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. తెల్ల జుట్టును నల్లబడేలా చేస్తాయి. కలోంజి గింజలు రెండు స్పూన్లు తీసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఈ కలోంజి లేదా నిగెల్లా గింజలను వేయించాలి. అవి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసినా కూడా కళాయి ఇంకా వేడి గానే ఉంటుంది. ఆ సమయంలోనే అందులో హెన్నా పొడిని వేసుకోవాలి. హెన్నా కొద్దిగా రంగు మారి నలుపుగా మారుతుంది.
ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసి పొడిగా మార్చుకోవాలి. ఈ పొడి ఒకసారి చేసుకుంటే నెల రోజులు పాటు నిల్వ ఉంటుంది. మీరు జుట్టుకు నలుపు రంగు వేసుకోవాలనుకున్నప్పుడు ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల పౌడర్ ను తీసుకోవాలి. అందులో కలబంద జెల్, తేలికపాటి షాంపూను వేసి పేస్టులాగా చేయాలి.
ఈ మొత్తం మిశ్రమాన్ని జుట్టుకు హెయిర్ ప్యాక్ లాగా వేసుకోవాలి. హెన్నా కలోంజి విత్తనాల పొడి జుట్టును నలుపుగా మారుస్తుంది. కలబంద జుట్టును మృదువుగా చేస్తుంది. ఇక షాంపూ జుట్టును శుభ్రపరుస్తుంది. ఈ పేస్టును జుట్టు మీద అప్లై చేశాక పావుగంట పాటు అలా వదిలేయాలి. తరువాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. తలకు స్నానం చేసి తేలికపాటి షాంపూ అప్లై చేయాలి. ఆ తర్వాత పావుగంట సేపు జుట్టును ఆరనివ్వాలి.
ఈ చిట్కా పాటించడం ద్వారా తెల్ల జుట్టు నల్లగా మారి కనిపిస్తుంది. ఇది జుట్టుకు ఎలాంటి హాని చేయని చిట్కా. పిల్లలకు కూడా దీన్ని వాడవచ్చు. ఇందులో మనం వాడినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇందులో మనం ఎలాంటి రసాయనాలు కలపలేదు. కాబట్టి జుట్టుకు, చర్మానికి ఎలాంటి హాని జరగదు.
Also Read: బీట్ రూట్ ఫేస్ జెల్‌తో.. కొరియన్ గ్లాసీ స్కిన్ గ్యారంటీ !