జీవితంలో ఒక్కసారి చేసుకునేది వివాహం. అందుకే దాని విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కానీ అప్పుడప్పుడు తప్పటడుగులు పడుతూనే ఉంటాయి. అయితే నిశ్చితార్థం చేసుకున్న తర్వాత వివాహం చేసుకోవడానికి మధ్య ఎంత సమయం గ్యాప్ ఉంటే మంచిదో.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దీనివల్ల వివాహ ప్రణాళికలు సులభం అవ్వడమే కాదు, ఎంచుకున్న సంబంధంలో ఏవైనా లోపాలు ఉన్నా కూడా బయటపడే అవకాశం ఉంటుంది.
ఎంత గ్యాప్ ఉండాలి?
మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం నిశ్చితార్థం వివాహం మధ్య ఉండాల్సిన గ్యాప్ 6 నెలల నుండి 18 నెలలు అని చెబుతారు. కొంతమంది మాత్రం 6 నుండి 12 నెలల సమయం సరిపోతుందని అంటారు. ఈ సమయం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. వివాహ ప్రణాళిక సులభతరం చేస్తుంది. వివాహానికి కావలసిన పనులన్నీ చేసే సమయాన్ని అందిస్తుంది. అలాగే ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకునే సమయాన్ని కూడా ఇస్తుంది.
నిశ్చితార్థం అయ్యాక గ్యాప్ ఎందుకు అవసరం?
నిశ్చితార్థం అయ్యాక కాబోయే భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకోవడం, బయట కలవడం వంటివి చేస్తారు. ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతారు. కాబట్టి ఒకరి అభిరుచులు మరొకటికి తెలుస్తాయి. ఆ సమయంలో మరింతగా వారి బంధం బలపడుతుంది. అలాగే కొన్నిసార్లు నిశ్చితార్థం అయ్యాకే ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చకపోవడం లేదా వ్యక్తిత్వ లోపాలు వంటివి కూడా బయటపడతాయి. ఆ సమయంలో ఆ జంటలు పెళ్లిని రద్దు చేసుకునే అవకాశం దొరుకుతుంది. దీనివల్ల ఆ ఇద్దరూ కూడా విడివిడిగా తమ జీవితాలలో సంతోషంగా ఉండగలరు.
ఆరు నెలల నుండి 18 నెలల పాటు పెళ్లికి గ్యాప్ తీసుకోవడం వల్ల వివాహానికి కావలసిన వస్తువులు అన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం కొనిపెట్టుకోవచ్చు. అలాగే వివాహానికి ఎవరిని పిలవాలో జాబితాను రెడీ చేసుకోవచ్చు. ఎవరికి ఎలాంటి గిఫ్టులు ఇవ్వాలి? శుభలేఖలు ఎక్కడ చేయాలి? ఇలాంటివన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకోవచ్చు.
అలాగే వివాహానికి అయ్యే ఖర్చులను కూడా తట్టుకునే శక్తి ఆ సమయం ఇస్తుంది. ఆర్థిక ప్రణాళిక వేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తుంది. ఈ 18నెలల్లో లేదా ఏడాది కాలంలోనే వివాహానికి కావలసిన డబ్బులను సమకూర్చుకోవచ్చు. అలాగే ఈ సమయంలోనే రెండు కుటుంబాలు తమ అనుబంధాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. వివాహ జీవితానికి సంబంధించి భార్యాభర్తలిద్దరూ అవగాహన పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది.
నిశ్చితార్థం అయ్యాక ఏం చెయ్యాలి?
నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి వరకు ఉండే సమయం చాలా ముఖ్యమైనది. కాబోయే భార్యాభర్తలిద్దరూ కూడా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ సమయాన్ని ఆస్వాదించడానికి ఇద్దరు సమయాన్ని కేటాయించాలి. ఇద్దరూ కలిసే కొన్ని వివాహ పనులను చేయడం వల్ల ఒకరిపై ఒకరికి అవగాహన పెరుగుతుంది. అలాగే భాగస్వామితో భవిష్యత్తు గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి. అలాగే వివాహ పనుల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఉండాలి. ముఖ్యంగా వారితో నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించాలి. నిశ్చితార్థం అనేది జీవితాంతం కొనసాగే ఒక అనుబంధానికి మొదటి అడుగు అని గుర్తుంచుకోండి. కాబట్టి వారితో ఎక్కువ సమయాన్ని గడిపి వారితో బంధాన్ని బలోపేతం చేసుకోండి.
ఏం చేయకూడదు?
నిశ్చితార్థం జరగగానే కొంతమంది పెళ్లయిపోయినట్టే భావిస్తారు. జీవిత భాగస్వామిపై అజమాయిషీ చేసేందుకు ప్రయత్నిస్తారు. అలా చేస్తే ఆ నిశ్చితార్థం పెళ్లి పీటల వరకు చేరడం కష్టమే. ఎవరైనా ఎదుటివారి ప్రైవసీని దెబ్బ తీసేలా ప్రవర్తించకూడదు. వారి ఫోన్లు చెక్ చేయడం, వారి స్నేహితుల గురించి పదేపదే అడగడం, వారు చేసే పనులను ప్రశ్నించడం వంటివి చేస్తూ ఉంటే మీపై కాబోయే జీవిత భాగస్వామికి నెగిటివ్ అభిప్రాయం వచ్చేస్తుంది. మీరు జీవితంలో ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవించకుండా చేస్తారేమోనని వారు భయపడతారు. దానివల్ల పెళ్లిని ఆపే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీకు ఎంత స్వేచ్ఛ కావాలనుకుంటున్నారో ఎదుటివారికి కూడా అంతే స్వేచ్ఛ ఇచ్చేందుకు ప్రయత్నించండి.
నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు ఉన్న సమయాన్ని ఎదుటివారిని కంట్రోల్ చేయడానికి బదులుగా మీపై వారికి ప్రేమ పెరిగేలా, వారిపై మీకు నమ్మకం పెరిగేలా ప్రవర్తించేందుకు ప్రయత్నించండి. ఎలాంటి ప్రధాన కొనుగోళ్లు అయినా కూడా జీవిత భాగస్వామి సలహా తీసుకోవడానికి ప్రయత్నించండి. కొంతమంది నిశ్చితార్థం అయ్యాక ఇల్లు, ఫ్లాట్ లేదా బంగారం, కారు వంటివి కొనేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి సమయంలో కాబోయే జీవిత భాగస్వామికి చెప్పకుండా ఆ పని చేయవద్దు. ఏదైనా ఇద్దరు కలిసి నిర్ణయించుకునేందుకే ప్రయత్నించండి. లేకుంటే మీరు భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి విలువ ఇవ్వరని, ఆమె నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోరని భావించే అవకాశం ఉంటుంది. దీనివల్ల మొదటే మీ బంధం విచ్ఛిన్నం కావచ్చు.