Eyebrows: మీరు అందమైన, దట్టమైన కనుబొమ్మలను కోరుకుంటున్నారా ? మంచి ఐబ్రోస్ మీ ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. రసాయనాలతో కూడిన ఉత్పత్తులను ఉపయోగించకుండా.. సహజ పద్ధతులతో మీ ఐబ్రోస్ దట్టంగా, అందంగా మార్చుకోవచ్చు. ఇంతకీ ఐబ్రోస్ మంచిగా పెరగడానికి కొన్ని సహజ పద్ధతులు, చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆముదం నూనె (Castor Oil):
ఆముదం నూనె కనుబొమ్మల పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ E, ప్రోటీన్లు, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వెంట్రుకల కుదుళ్లను బలపరిచి, వాటిని దట్టంగా పెరిగేలా చేస్తాయి.
ఎలా ఉపయోగించాలి: ప్రతి రాత్రి పడుకునే ముందు, ఒక కాటన్ బాల్‌ను ఆముదం నూనెలో ముంచి, కనుబొమ్మలపై సున్నితంగా రాయాలి. ఉదయం లేవగానే చల్లటి నీటితో కడిగేసుకోవాలి. మంచి ఫలితాల కోసం, ఈ పద్ధతిని కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా పాటించాలి.
2. కొబ్బరి నూనె (Coconut Oil):
కొబ్బరి నూనె కూడా కనుబొమ్మల పెరుగుదలకు అద్భుతమైనది. దీనిలో ఉండే లారిక్ యాసిడ్, వెంట్రుకల కుదుళ్లను పోషించి, వాటిని బలంగా చేస్తాయి.
ఎలా ఉపయోగించాలి: కొద్దిగా కొబ్బరి నూనెను వేడి చేసి, గోరు వెచ్చగా ఉన్నప్పుడు కనుబొమ్మలపై రాసి, మసాజ్ చేయాలి. రాత్రంతా ఉంచి, ఉదయం కడిగేసుకోవాలి.
3. బాదం నూనె (Almond Oil):
బాదం నూనెలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను పోషించి, కనుబొమ్మలను ఆరోగ్యంగా, దట్టంగా పెరిగేలా చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి: కొన్ని చుక్కల బాదం నూనెను కనుబొమ్మలపై రాసి, సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రంతా ఉంచి, మరుసటి రోజు ఉదయం కడిగేసుకోవాలి.
4. కలబంద (Aloe Vera):
కలబంద జెల్ చర్మానికి, వెంట్రుకలకు చాలా మంచిది. ఇది కనుబొమ్మల వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహించి, వాటిని మెరిసేలా చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి: తాజా కలబంద ఆకు నుండి జెల్‌ను తీసి, కనుబొమ్మలపై రాసి, సున్నితంగా మసాజ్ చేయాలి. 30 నిమిషాలు ఉంచి, ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
5. ఉల్లిపాయ రసం (Onion Juice):
ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుంది. ఇది వెంట్రుకల పెరుగుదలకు చాలా సహాయపడుతుంది. ఇది వెంట్రుకల కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచుతుంది.
ఎలా ఉపయోగించాలి: ఒక ఉల్లిపాయను తురిమి, రసం తీయాలి. ఈ రసాన్ని కనుబొమ్మలపై రాసి, 20 నిమిషాలు ఉంచి.. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
Also Read: పటికతో.. ఇన్ని ఉపయోగాలా ?
6. సరైన ఆహారం:
మీ కనుబొమ్మల ఆరోగ్యం మీరు తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆహారంలో గుడ్లు, చేపలు, ఆకుకూరలు, నట్స్, పండ్లు చేర్చుకోండి.
చిట్కా: కను బొమ్మలను పదే పదే లాగడం లేదా ట్రిమ్ చేయకుండా ఉండండి. అలా చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు బలహీనపడతాయి.
ఈ సహజ పద్ధతులను క్రమం తప్పకుండా పాటిస్తే.. కొద్ది కాలంలోనే దట్టమైన, అందమైన కను బొమ్మలను పొందవచ్చు.