ఎంతోమంది ప్రేమ వివాహాలు చేసుకుంటారు. ఆ ప్రేమ వివాహాలు సమయంలో పెద్దల్ని కూడా ఎదిరిస్తారు. అలా ఒక అమ్మాయి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇప్పుడు ఆమెకు నరకం చూపిస్తున్నాడు. ఓ యువతి సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె బాధను ఆమె మాటల్లోనే వినండి.
నాది ప్రేమ వివాహం. అతడిని ఐదేళ్లు ప్రేమించాను. తల్లిదండ్రులు వద్దని చెప్పినా కూడా వారితో పోరాడి ప్రేమ వివాహం చేసుకున్నాను. ఆ నిర్ణయం ఎంతో గొప్పదని భావించాను. కానీ ఆ నిర్ణయం తప్పని కేవలం ఆరునెలల్లోనే తేలిపోయింది. అతను చాలా సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడు. దీంతో అతని పద్ధతులు నాకు ఎంతో నచ్చాయి. దానివల్లే తల్లిదండ్రులతో పోరాడి మరి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాక అతని ప్రవర్తనే మారిపోయింది.
అతడు సంప్రదాయ కుటుంబానికి చెందిన వ్యక్తి, కానీ అతనికి తెలిసిందే సంప్రదాయం, అతను పాటించేవే పద్ధతులు అనుకుంటాడు. అతనిలాగే ప్రతి ఒక్కరూ ఉండాలని అనుకుంటాడు. ఎదుటివారి నవ్వును కూడా భరించలేడు. కాస్త గట్టిగా నవ్వినా అది తప్పని చెబుతాడు. ఎవరైనా ఇంటికి వస్తే కనీసం వారి ముందు నన్ను నోరు విప్పి మాట్లాడనివ్వడు. పక్కింటి వారు, ఎదురింటి వారితో మాట్లాడాలన్నా భయంగానే ఉంటుంది. ఆడవాళ్లంటే పద్ధతిగా ఇంట్లోనే ఉండాలని అంటాడు. నన్ను ఉద్యోగం కూడా చేయనివ్వడం లేదు.
అతడు ప్రేమించేటప్పుడు నేను ఉద్యోగం చేశాను. కానీ పెళ్లయ్యాక మాత్రం నా ఉద్యోగం అతనికి నచ్చ లేదు. తన భార్య పదిమంది ముందు తిరగడం తనకు ఇష్టం లేదని చెబుతున్నాడు. ఏమైనా అంటే గట్టిగా అరుస్తూ మీద పడుతున్నాడు .ఆ అరుపులను భరించడం కూడా కష్టంగా ఉంది. ఈ కష్టాల్లోనే నేను ఒక పాపని కూడా కన్నాను. ఇప్పుడు ఆ పాపకి రెండేళ్ల వయసు. నాతోపాటు నా భర్త అరుపులను ఆమె కూడా వింటోంది. కోరి చేసుకున్న పాపానికి నేను అతడిని భరించాలి, కానీ నా పాప ఏం తప్పు చేసిందని అనిపిస్తుంది. ధైర్యంగా బయటికి వెళ్లి బతకాలనిపిస్తోంది. కానీ గత మూడేళ్లుగా నాకు బయట ప్రపంచమే తెలియదు. ఎలా బతకాలో అన్న భయం కూడా పెరిగిపోయింది.
బయటికి వెళ్లి పని చేసే ధైర్యం కూడా నాకు రావడం లేదు. మూడేళ్లుగా కనీసం కిరాణా కొట్టుకు కూడా నన్ను వెళ్ళనివ్వలేదు. దీంతో బయట ప్రపంచం అంటేనే ఏదో తెలియని కలవరం వస్తోంది. నేను నా పాపతో ఎలా బతకాలో అర్థం కావడం లేదు. అతనిది ప్రేమ అనుకోవాలో లేక అజమాయిషీ అనుకోవాలో అర్థం కావడం లేదు.
Also Read: రాత్రిళ్లు ఫోన్ చూస్తున్నారా? ఇక ‘అది’ కష్టమే.. మరిచిపోండి, ఎవరు చెప్పినా వినరు కదా!
ఇంట్లో తల్లిదండ్రుల సాయాన్ని తీసుకోవాలని అనుకుంటున్నాను. కానీ వారు ఏమనుకుంటారో అనే భయం కూడా ఉంది. వారిని కాదని చేసుకున్నందుకు నా జీవితంలో మూడేళ్లు నాశనం అయిపోయాయి. అతడితో మాట్లాడినా ప్రయోజనం ఉండదేమో అనిపిస్తుంది. నాలాగా ఇంకెవరూ చేయకండి. ప్రేమించిన వ్యక్తిని గుడ్డిగా నమ్మి తల్లిదండ్రులను కాదని, బంధువులను వద్దని దూరం రాకండి. ఈ ఒంటరి బతుకు జీవించడం చాలా కష్టం. మరి, ఆమె కష్టానికి మీరు ఇచ్చే సలహా ఏమిటీ? మీరు ఏమనుకుంటున్నారు?