అన్ని బంధాల్లోకి భార్యాభర్తల బంధం ప్రత్యేకమైనది. రెండు విభిన్న జీవితాల నుంచి వచ్చినవారు కలిసి జీవించడం అనేది ఎంతో కష్టం. కానీ భార్యాభర్తలు విభిన్న ప్రదేశాలు, పరిస్థితులు, పర్యావరణం నుంచి వచ్చి కూడా కలిసి జీవించేందుకు ప్రయత్నిస్తారు. వారి బంధం పరిపూర్ణంగా ఉండాలంటే, వారి మధ్య ప్రేమ ప్రతిరోజు పెరుగుతూ ఉండాలంటే, ప్రతి రోజు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఉదయం లేవగానే ఇక్కడ మేము చెప్పిన పనులు చేయండి చాలు. మీ జీవిత భాగస్వామి మీకు దాసోహం అయిపోతుంది.
కౌగిలింత
మీ భాగస్వామితో అందంగా ఆ రోజును ప్రారంభించాలంటే మొదటిగా మీరు చేయాల్సింది ఉదయం లేవగానే ఆమెను ఒకసారి కౌగిలించుకోవడం. ఇలా కౌగిలించుకోవడం వల్ల ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. ఆక్సిటోసిన్ అనేది ప్రేమ హార్మోన్. ఇది భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుంది.
కలిసి తినటం
ఉదయాన్నే తినే మొదటి భోజనం అల్పాహారం. బ్రేక్ ఫాస్ట్ ను ఇద్దరూ కలిసి ఇలా ప్లాన్ చేసుకోండి. తినేటప్పుడు నవ్వుతూ మాట్లాడుకోండి. ఇది మీ ఇద్దరి రోజున ప్రారంభించేందుకు ఉత్తమమైన పని.
కలిసి పని చేయండి
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్న కాలం ఇది. ఇంటి పనులు ఏ ఒక్కరికో వదిలేయాల్సిన అవసరం లేదు. ఉదయం నుంచి భార్యాభర్తలిద్దరూ వంటింట్లో పనులను సమానంగా పంచుకొని చేయడం ప్రారంభిస్తే మంచిది. ఇది ఎదుటివారికి శారీరక భారాన్ని తగ్గించడమే కాదు వారికి మీపై ఎంతో సానుకూల అభిప్రాయం ఏర్పడేలా చేస్తుంది. ఒకరు కూరగాయలు కోస్తే మరొకరు వంట చేయండి. అప్పుడు పని త్వరగా అవుతుంది. పైగా మీ మధ్య బంధం పెరుగుతుంది.
వ్యాయామం
జంటలో ఎవరో ఒకరు మాత్రమే వ్యాయామానికి వెళ్తారు. మరొకరు ఇంటి పనులు చేస్తూ ఉంటారు. నిజానికి ఇద్దరూ కలిసి వ్యాయామం చేస్తే వారు గడిపే సమయం కూడా పెరుగుతుంది. మంచి జ్ఞాపకాలను కూడా సృష్టించుకున్న వారు అవుతారు. ఆరోగ్యం ఇద్దరికీ అవసరమే. వ్యాయామం చేస్తున్నప్పుడు ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. కాబట్టి భార్యాభర్తలిద్దరూ ఉదయం పూట వ్యాయామం చేయడం అలవాటుగా చేసుకోండి.
కృతజ్ఞతలు చెప్పండి
మీ భాగస్వామి మీ కోసం టేస్టీగా టీ పెట్టినా, యమ్మీగా బ్రేక్ ఫాస్ట్ వండినా కూడా ఆమెకు థాంక్స్ చెప్పండి. అది కూడా ఎంతో హృదయపూర్వకంగా అలా చెబితే ఆమె ఎంతో సంతోషిస్తుంది. మీపై మరింత ప్రేమను పెంచుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న పనులు భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పటిష్టంగా మారుస్తాయి.
భార్యాభర్తలు ప్రతిరోజూ కనీసం గంటసేపైనా కలిసి మాట్లాడుకునేలా చూసుకోవాలి. వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. జంట మధ్య బంధం బలపడడానికి ఇది చాలా అవసరం. మీ జీవిత భాగస్వామికి ప్రేమ, గౌరవం అందించాలి. సంభషణల్లో కూడా మీ భార్యకు లేదా భర్తకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ జీవితభాగస్వామి పై ఉన్న ప్రేమను మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చూపించాలి.
ముఖ్యమైన సమస్యలు మాట్లాడేముందు భార్యభర్తలు ఇద్దరూ గొడవ పడకూడదని ముందే నిర్ణయించుకోండి. కొన్ని రకాల మాటలు మీ నోట్లోంచి వచ్చే అవి పెద్ద సమస్యకు కారణం అవుతుంది.