మలబద్ధకం సమస్య చెప్పుకోడానికి చిన్నదే కావచ్చు. కానీ రెండు రోజులు మలబద్ధకంతో ఇబ్బంది పడి చూడండి. అప్పుడు తెలుస్తుంది అది ఎంతగా బాధిస్తుందో. కాబట్టి మలబద్ధకం సమస్య బారిన పడకుండా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఇది సాధారణ సమస్య కానీ తీవ్రంగా మారడానికి ఎక్కువ కాలం పట్టదు.
మలబద్ధకం సమస్య రావడానికి మొదటి కారణం మనం తినే ఆహారంలో డైటరీ ఫైబర్ తక్కువగా ఉండడం. ఇది తక్కువగా ఉండడం వల్ల అసౌకర్యం, నొప్పి వంటివి కలుగుతాయి. ఉబ్బరం, గ్యాస్ వంటి లక్షణాలను చూపిస్తాయి. ఒక వ్యక్తి వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే మలవిసర్జనకు వెళితే వారు మలబద్దకం సమస్య బారిన పడినట్టే లెక్క. మలబద్ధకం బారిన పడకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలను దూరంగా ఉంచాలి. ఇది మీలో తీవ్రమైన మలబద్ధకానికి కారణమవుతాయి.
ప్రాసెస్ చేసిన ధాన్యాలు
బయట ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఎన్నో దొరుకుతున్నాయి. వైట్ రైస్, వైట్ పాస్తా వంటివి కూడా ప్రాసెస్ చేసినవే. మనం ఇంట్లో ఉండే తెల్ల బియ్యం ఎంత తెల్లగా ఉంటే దాన్ని అంతగా ప్రాసెస్ చేశారని అర్థం. అందుకే మరీ తెల్లగా ఉన్న బియ్యాన్ని తినకపోవడమే మంచిది. బ్రౌన్ రైస్ వంటివి తినడం ద్వారా మలబద్ధకం రాకుండా జాగ్రత్త పడొచ్చు. వైట్ పాస్తాను కూడా అధికంగానే తింటూ ఉంటారు. అలాగే నూడుల్స్ వంటివి కూడా తింటారు. ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసిన ఆహారాలతో తయారైనవే. వీటిలో డైటరీ ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే విలువైన పోషకాలు ఆ ప్రాసెసింగ్ పద్ధతిలో బయటికి పోతాయి. ఇలాంటి ఆహారాలు తినడం వల్ల మలవిసర్జన కష్టంగా మారిపోతుంది. మలం గట్టిగా మారి విసర్జన అయ్యేందుకు సహకరించదు. కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎంత తగ్గిస్తే అంత మంచిది.
పాల ఉత్పత్తులు
పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పాలు, పెరుగు, నెయ్యి, చీజ్… వంటివి కూడా ఎంతో ఆరోగ్యకరమే. అలా అని వాటిని అధికంగా తీసుకుంటే మాత్రం మలబద్ధకం సమస్య మొదలైపోతుంది. వీటిని మితంగానే తీసుకోవాలి. రోజుకు ఒకసారి మాత్రమే పాలు తాగాలి. పెరుగన్నం కూడా ఒకసారి తింటేనే మంచిది. మీకు మలబద్ధకం సమస్య మొదలైనట్టు అనిపిస్తే వీటి వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది.
డీప్ ఫ్రై ఆహారాలు
డీప్ ఫ్రై చేసిన ఆహారాలు అంటే ఇప్పుడు పిల్లలకు, యువతకు ఎంతో ఇష్టం. ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్, పిజ్జాలు, చిప్స్ వంటివన్నీ కూడా వారికి ఇష్టమైన ఆహారాలే. వాటిని డీప్ ఫ్రై చేసి అధికంగా ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. అందుకే వీటిని తినడం వల్ల లాభం సమస్య పెరిగిపోతుంది. వీటిలో కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి జీర్ణ క్రియను ఇది ఆలస్యం అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ ఆహారాలలో ఉప్పు అధికంగా ఉంటుంది. శరీరంలో చేరాక ఈ ఉప్పు డిహైడ్రేషన్‌కు గురయ్యేలా చేస్తుంది. పేగుల నుండి నీటిని పీల్చేసుకొని మలబద్ధకం సమస్య బారిన పడేలా చేస్తుంది. కాబట్టి వీలైనంతగా డీప్ ఫ్రై చేసిన ఆహారాలను తినకపోవడం మంచిది.
మైదాతో చేసిన పదార్థాలు
మైదాతో చేసిన పేస్ట్రీలు, కుకీలు, బ్రెడ్లు, స్వీట్లు మార్కెట్లో ఎన్నో ఉన్నాయి. వీటిని తినేందుకు ఎంతో మంది ఇష్టత చూపిస్తారు. ఈ ఆహారాలలో ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు అవసరమైన ఫైబర్ ఉండదు. వీటిలో తక్కువ ఫైబర్ ఉంటుంది. కాబట్టి పేగుల్లో మనం ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. దీని వల్ల మలబద్ధకం సమస్య మొదలైపోతుంది. మీకు బ్రెడ్ తినాలనిపిస్తే హోల్ వీట్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్, మిల్లెట్ బ్రెడ్ వంటివి తినండి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
మాంసం
చికెన్, మటన్ వంటివి ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. అలాగే రెడ్ మీట్ తినే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం. మాంసాహారాన్ని అధికంగా తిన్న వారిలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇందులో ఉండే కఠినమైన ప్రోటీన్లు జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది. అలాగే వీటిలో ఇనుము కూడా అత్యధికంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మలబద్ధకానికి కారణం అవుతాయి. రెడ్ మీట్‌ను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. చికెన్‌ను మితంగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Also Read: ఇండియన్స్‌లో ఆ విటమిన్ లోపం.. ఈ తప్పులు చేస్తే ఆరోగ్యం షెడ్డుకే!
చక్కెర నిండిన పదార్థాలు
రసగుల్లాలు, గులాబ్ జామూన్‌లు, చాక్లెట్లు ఇలా చెప్పుకుంటూ పోతే పంచదారతో చేసిన పదార్థాలు ఎన్నో ఉంటాయి. ఇవి తినేటప్పుడు టేస్టీగానే ఉంటాయి. కానీ శరీరంలో చేరాక మాత్రం అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. ఈ ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. అలాగే మన జీర్ణక్రియకు అవసరమైన డైటరీ ఫైబర్ ఉండదు. కాబట్టి ఐస్ క్రీమ్‌లు, జామ్‌లు, స్వీట్లు ఎంత తక్కువగా తింటే అంత మంచిది.