వేసవిలో బ్రేక్ ఫాస్ట్ లో టిఫిన్లను తినడం వల్ల విపరీతమైన దాహం వేసేస్తుంది. పైగా ఏదైనా తినాలన్న కోరిక కూడా పుట్టదు. అదే చద్దన్నం తింటే శరీరంలో డిహైడ్రేషన్ సమస్య కూడా రాదు. దాహం కూడా అధికంగా వేయదు.
ఆహారం వృధా కాకుండా చూసుకోవడానికి కూడా చద్దన్నం తినడం ఎంతో అవసరం. బ్రేక్ ఫాస్ట్‌లో తినడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. చద్దన్నం తిన్నాక చాలాసేపు ఆకలి వేయదు. కాబట్టి మీరు ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు. ఇలా ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.
అన్నం తినడం వల్ల మన శరీరానికి అవసరమైన స్థూల పోషకాలు అందుతాయి. అందులో ముఖ్యమైనది పిండి పదార్ధం. ఈ పిండి పదార్థం శరీరంలో చేరి గ్లూకోజ్ రూపంలోకి మారుతుంది. అదే మనకు శక్తిని అందిస్తుంది. ఈ పిండి పదార్థాలు సరళ రూపంలో, సంక్లిష్ట రూపంలో రెండు రకాలుగా ఉంటాయి. తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ మొత్తం పెరుగుతుంది. అయితే చద్దన్నం తినడం వల్ల ఈ సమస్య రాదు.
చద్దన్నం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి సంక్లిష్ట పిండి పదార్థాలే ఉంటాయి. ఈ సంక్లిష్ట పిండి పదార్థాలు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలో అమాంతం పెరగవు.
చద్దన్నంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సాధారణ పిండి పదార్థాల్లో ఒక గ్రాముకు నాలుగు క్యాలరీలు ఉంటే అదే చద్దన్నంలోని పిండి పదార్ధంలో రెండున్నర క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి తక్కువ తింటే చాలు పొట్ట నిండిన భావన కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గడం కూడా సులువు అవుతుంది.
చద్దన్నం తయారు చేసేందుకు రాత్రిపూట మిగిలిన అన్నంలో నీరు పోయండి. అలాగే పెరుగును కూడా వేసి ఉదయం వరకు ఉంచండి. అది కాస్త పులిసి చద్దన్నంగా మారుతుంది. ఇది ఉదయం పూట పచ్చి ఉల్లిపాయతో లేదో పచ్చిమిర్చితో లేదా ఆవకాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా ఆకలి, దాహం కూడా వేయదు. అలాగే పేగుల్లో మంచి బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందుతుంది. చద్దన్నం తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వేసవిలో వచ్చే చెమట పొక్కుల నుంచి కూడా చద్దన్నం రక్షణ కల్పిస్తుంది. కాబట్టి ఇలాంటి పులిసిన ఆహారం తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
పూర్వం చద్దన్నాన్నే మాత్రమే తినేవారు. అందుకే అప్పట్లో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు లేనిపోని టిఫిన్లు తింటూ ఆరోగ్యానికి కీడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వేసవిలో చద్దన్నం తినడం వల్ల మీరు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.