Acidity: వర్షాకాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో తేమ, ఉష్ణోగ్రత మార్పుల కారణంగా.. జీర్ణశక్తి బలహీనపడుతుంది. ఫలితంగా గ్యాస్, అజీర్ణం, బరువు పెరగడం వంటి సమస్యలు సర్వసాధారణం అవుతాయి. ముఖ్యంగా వేయించిన లేదా బయటి ఆహారం తీసుకోవడం వల్ల పొట్ట ఎక్కువగా ఇబ్బంది పడుతుంది.
ఇలాంటి పరిస్థితిలో.. పదే పదే మందులను వాడే బదులు.. కొన్ని హోం రెమెడీస్ వాడటం చాలా మంచిది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా తక్షణ ఉపశమనాన్ని కూడా అందిస్తాయి. వర్షాకాలంలో జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడే హోం రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అసిడిటీని తగ్గించే హోం రెమెడీస్:
సోంపు, చక్కెర మిశ్రమం:
భోజనం తర్వాత.. ఒక టీస్పూన్ సోంపును కొద్దిగా చక్కెరతో కలిపి నమలండి. సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి గ్యాస్ ను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇది కడుపు చికాకును కూడా తగ్గిస్తుంది.
అల్లం, తేనె మిశ్రమం:
ఒక టీస్పూన్ అల్లం రసాన్ని అర టీస్పూన్ తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోండి. అల్లంలో ఉండే జింజెరాల్ సమ్మేళనం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తేనె ఈ మిశ్రమానికి రుచిని అందిస్తుంది. అంతే కాకుండా ఇది శోథ నిరోధక ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది.
చల్లని పాలు తాగడం:
అసిడిటీ సమస్య పెరుగుతుంటే.. చక్కెర లేకుండా ఒక గ్లాసు చల్లని పాలు తాగండి. పాలలో ఉండే కాల్షియం ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది. అంతే కాకుండా గుండెల్లో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు తాగే పాలు చాలా చల్లగా లేదా వేడిగా ఉండకూడదని గుర్తుంచుకోండి.
పుదీనా, తులసి టీ:
పుదీనా, తులసి ఆకులను నీటిలో మరిగించి టీ తయారు చేసుకుని రోజుకు 1-2 సార్లు తాగాలి. ఈ రెండు ఆకులు కడుపును చల్లబరుస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా ఆమ్లత్వాన్ని తొలగిస్తాయి.
జీలకర్ర, నల్ల ఉప్పు:
చిటికెడు జీలకర్ర కొద్దిగా నల్ల ఉప్పుతో కలిపి గోరు వెచ్చని నీటితో తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఎక్కువ ఆహారం తిన్న తర్వాత హోం రెమెడీస్ ప్రభావవంతంగా ఉంటాయి.
అసిడిటీ, ఛాతీలో లేదా కడుపులో మంటగా అనిపించడం, ఒక సాధారణ జీర్ణ సమస్య. దీర్ఘకాలిక లేదా తీవ్రమైన సమస్యలకు డాక్టర్‌ని సంప్రదించడం అవసరం అయినప్పటికీ.. కొన్ని హోం రెమెడీస్ ఇంట్లోనే తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి.
Also Read: జుట్టు రోజు రోజుకూ పలచబడుతోందా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే
అసిడిటీకి కారణాలు:
ఆహారం:
మసాలాలు, కొవ్వు లేదా వేయించిన ఆహారాలు, సిట్రస్ పండ్లు, టమాటాలు, ఉల్లిపాయలు, చాక్లెట్ వంటివి అసిడిటీకి కారణం అవుతాయి. అందుకే వీటికి దూరంగా ఉండటం మంచిది.
జీవనశైలి:
ధూమపానం, అధికంగా మద్యం సేవించడం, ఒత్తిడి, సక్రమంగా భోజనం చేయకపోవడం కూడా సాధారణ కారణాలు.
ఆరోగ్య సమస్యలు:
హియాటస్ హెర్నియా, GERD (గ్యాస్ట్రోఎసోఫేగల్ రిఫ్లక్స్ వ్యాధి) వంటి పరిస్థితులు, కొన్ని రకాల మందులు కూడా అసిడిటీని కలిగిస్తాయి.
గర్భం:
గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు, కడుపుపై పెరిగిన ఒత్తిడి అడిటీకి దారితీస్తుంది.