అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే అరటిపండు తొక్కలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి పండు తొక్కుతో అందాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.
అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందం అనేది కృత్రిమమైన కాస్మోటిక్స్ వల్ల రాదు ప్రకృతి ఇచ్చిన ఆహారం వల్లే వస్తుంది. అలాంటి వాటిలో అరటిపండు కూడా ఒకటి. అరటిపండు తిన్నాక తొక్కను చాలామంది పడేస్తారు. కానీ ఆ తొక్కలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అరటిపండులో ఎన్ని పోషకాలు ఉంటాయో వాటికి రెట్టింపు పోషకాలు అరటి తొక్కలో ఉంటాయి. కాబట్టి అరటిపండు తిన్నాక ఆ తొక్కను అందాన్ని పెంచుకునేందుకు మీరు ఉపయోగించవచ్చు.
అరటిపండు తొక్క ఉపయోగాలు
ముఖాన్ని బాగా శుభ్రపరచుకొని అరటిపండు తొక్క లోపల భాగంతో చర్మంపై మృదువుగా మర్దనా చేయండి. అలా ఒక పది నిమిషాల పాటు మర్దనా చేశాక కొద్దిసేపు వదిలేయండి. తర్వాత చల్లని నీటితో కడిగేయండి. శుభ్రపడిన చర్మానికి మాయిశ్చరైజర్ రాస్తే మంచిది. దీన్ని రాత్రిపూట చేస్తే నైట్ మాస్కులా ఉపయోగపడుతుంది.
అరటి తొక్కలోని చిన్న మొక్కను తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి .ఆ పేస్టులోనే ఫ్రెష్ క్రీమ్, తేనె వేయండి. ఈ క్రీమును ముఖానికి బాగా పట్టించండి. ఒక పది నిమిషాలు అలా ఉంచుకొని తర్వాత క్లీన్ చేసుకోండి. మీ ముఖం కొన్ని రోజులకే మెరవడం మొదలవుతుంది. మీరు ఇలా తరుచూ చేయాలి.
అరటి తొక్కతో స్క్రబ్
స్క్రబ్ బయటకొనే బదులు అరటిపండుతోనే తయారు చేసుకోవచ్చు. అరటిపండు తొక్కపై కాస్త పంచదార, తేనె వేసి ముఖానికి మర్దనా చేయండి. ఐదు నిమిషాలు పాటు అలా మర్దనా చేస్తూ ఉండండి. ముఖంపై ఉన్న మురికి, మృతకణాలు, వైట్ హెడ్స్ అన్ని తొలగిపోతాయి. ఐదు నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కుని మాయిశ్చరైజరై రాసుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడే ఇనిస్టెంట్ గ్లో వస్తుంది.
చుండ్రును తగ్గించే శక్తి కూడా అరటిపండు తొక్కకి ఉంది. అరటిపండు తొక్కను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయండి. ఆ పేస్టులో కొబ్బరిపాలు, పెరుగు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట పాటు వదిలేయండి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేసుకోండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల చుండ్రు చాలా వరకు తగ్గిపోతుంది. జుట్టుకు కూడా మెరుపు వస్తుంది.
Also Read: హోలీ రంగులతో ముఖంపై మొటిమలు.. ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు
అరటిపండు కాదు ఏ పండు తొక్కను కూడా పడేయాల్సిన అవసరం లేదు. వాటిలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. అరటిపండు తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్ b6, విటమిన్ బి12 అరటిపండు తొక్కలో ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను దూరం చేస్తాయి. వృద్ధాప్య ఛాయల నుండి మనల్ని కాపాడతాయి. దీనిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు చాలా ఎక్కువ.