కొన్ని రకాల ఆహారాలు కలిపి తింటే పోషకాలు రెట్టింపు అవుతాయి. శరీరానికి కూడా రెట్టింపు ఆరోగ్యం దక్కుతుంది. అలాగే కొన్ని రకాల ఆహారాలను కలిపి తినకూడదు. అలాంటి వాటిలో చేపలు, పాలు కూడా ఒకటి. చేపలు పెరుగు లేదా పాలు కలిపి లేదా ఒక దాని తర్వాత ఒకటి తినడం వల్ల సమస్యలు వస్తాయని చెబుతారు. ముఖ్యంగా చర్మంపై తెల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉందని అంటారు. అలాగే బొల్లి వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతారు. ఇవన్నీ అపోహలేనా? లేక నిజాలున్నాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పాలు, చేపలు కలిపి తింటే..
ప్రముఖ న్యూట్రిషన్లు, డైటీషియన్లు చెబుతున్న ప్రకారం పాలు, చేపలు ఒకేసారి తినడం వల్ల చర్మంపై ఎలాంటి తెల్లటి మచ్చలు రావు. ఇది కేవలం ఒక అపోహ. చేపలు, పాలు రెండిట్లో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. చేపలలో ప్రోటీన్ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి వంటివి అధికంగా ఉంటాయి.
ఇక పాలలో క్యాల్షియం, ప్రోటీన్ ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల చర్మంపై ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే కొన్నిసార్లు మాత్రం పాలు, చేపలు ఒకేసారి తినడం లేదా ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అలాంటివారికి ఏ సమస్య ఉండదు
జీర్ణ సమస్యలు లేనివారు చేపల కూర తిన్నాక పాలు తాగిన ఎలాంటి సమస్య ఉండదు. వారికి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువగానే ఉంటుంది. కానీ మీ జీర్ణ వ్యవస్థ సున్నితమైనదైతే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అది చేపలు, పాలను అరిగించుకోలేకపోవచ్చు. చేపల కూర తిన్నాక పాలు తాగినా, పెరుగు తినాలన్నా రెండు నుంచి మూడు గంటల గ్యాప్ వండేలా చూసుకోండి. ఈ గ్యాప్ వల్ల జీర్ణ క్రియకు సంబంధించిన ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
ఆయుర్వేదం కూడా చేపలు, పాలు పెరుగు వంటివి ఒకేసారి ఒకే భోజనంలో తినడం మంచిది కాదు అని చెబుతోంది. చాలామంది చేపలతో అన్నం తిన్నాక చివరలో పెరుగుతో భోజనాన్ని ముగిస్తారు. అలా కూడా తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే చేపలు పెరుగు అనేది రెండు విభిన్న లక్షణాలను చూపిస్తాయి. ఇది జీర్ణ సమస్యలకు కారణం అవ్వచ్చు.
పొట్ట ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్టిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ రెండింటినీ ఒకే భోజనంలో తినకుండా మూడు నాలుగు గంటల గ్యాప్ ఇచ్చాక తింటే ఎలాంటి సమస్య ఉండదు. కొంతమందికి జీర్ణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. అలాంటివారు ఇలా చేపలు, పెరుగు పాలు వంటివి ఒకే భోజనంలో తిన్నా కూడా ఇలాంటి సమస్యలు రావు. కాబట్టి మీ పొట్ట పరిస్థితిని బట్టి మీరు తినే ఆహారం ఆధారపడి ఉంటుంది.
Also Read: జుట్టు రాలడం, అలసటతో పాటు మీలో ఈ లక్షణాలు ఉన్నాయా ? జాగ్రత్త