Tamil Nadu Crime: మద్యానికి బానిసలుగా మారిన యువకులను చూసి ఉంటారు. మద్యం మత్తులో హత్యలు చేసిన వారిని కూడా చూసే ఉండవచ్చు. ఈ యువకులు మాత్రం మద్యం అమ్మకాలను అడ్డుకున్నారు.. చివరకు ప్రాణాలు వదిలారు. కల్తీ సారా విక్రయిస్తున్నందుకు ప్రశ్నించిన ఇద్దరు యువకులను హత్య చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం తమిళనాట సంచలనంగా మారింది. అయితే ఘటనకు భాద్యులైన వారి ఇళ్లకు గ్రామస్తులు నిప్పు పెట్టడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి.
స్థానికుల వివరాల మేరకు..
తమిళనాడు పెరంబూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తం గ్రామంలో కొందరు కల్తీ సారాను విక్రయిస్తున్నారు. కల్తీ సారాతో జరిగే అనర్థాలపై అవగాహన ఉన్న ఇద్దరు యువకులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అందులో ఒకరు న్యాయవాది విద్యను అభ్యసిస్తున్నారు. సారా వల్ల తమ గ్రామ ప్రజలకు చెడు జరిగే అవకాశం ఉందని, ఏకంగా సారా వ్యాపారస్తుల వద్దకు ఇద్దరు యువకులు వెళ్లి ప్రశ్నించారు. అంతేకాకుండా రాత్రి పగలు తేడా లేకుండా మద్యం విక్రయాలు సాగుతున్న నేపథ్యంలో గ్రామ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు నిలదీశారు.
ఈ సంధర్భంగా సారా వ్యాపారులకు, యువకులకు వాగ్వివాదం సాగింది. తమను ప్రశ్నించేందుకు మీరెవరని వారు ఎదురు ప్రశ్నలు వేసి యువకులపై దాడికి దిగారు. ఆ తర్వాత గొడవ సద్దుమనిగింది. అయితే ఫిబ్రవరి 14న రాత్రి తమ వ్యాపారానికి అడ్డు వస్తున్న ఇద్దరు యువకులను హత్య చేయాలని వ్యాపారస్థులు భావించారు. అనుకున్నదే తడవుగా ఇద్దరు విద్యార్థులు వస్తున్న క్రమంలో యువకులపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో యువకులు తీవ్ర గాయాల పాలై మరణించారు.
సారా అమ్మకాన్ని ప్రశ్నించినందుకు ఇద్దరు యువకులను హత్య చేశారన్న విషయం కొద్ది క్షణాల్లో గ్రామానికి చేరింది. గ్రామంలో జరిగిన జంట హత్యలపై ఆగ్రహించిన గ్రామస్తులు.. ఏకంగా నిందితుల గృహాలను కోపంలో తగలబెట్టేశారు. ఈ పరిస్థితులతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడగా, పోలీసులు రంగప్రవేశం చేశారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే యువకుల హత్యకు పాల్పడ్డ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే హత్యకు కారకులుగా భావిస్తున్న మరో ఇద్దరు మహిళలు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: నేనే దేవుడన్నాడు.. కటకటాల పాలయ్యాడు.. వీర రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్ట్ సంచలన విషయాలు
గ్రామం కోసం కల్తీసారాను అడ్డుకొనేందుకు యువకులు ప్రశ్నిస్తే, నేరుగా హత్య చేస్తారా అంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటి సమాజంలో మద్యం మత్తులో దారుణాలకు పాల్పడే ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, సారా వ్యాపారాన్ని ఎదిరించిన యువకులను హత్య చేసినట్లు తెలుసుకున్న స్థానిక గ్రామాల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు కారకులైన వారిని చట్టరీత్యా శిక్షించాలని ముత్తం గ్రామస్థులు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి యువకుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచిచూడాలి.