జుట్టు అధికంగా రాలిపోయి ప్యాచుల్లాగా తలపై కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు బట్టతల వచ్చేస్తుందేమోనన్న భయం ఎక్కువమందిలో ఉంటుంది. అలాంటివారు కొబ్బరి నూనెతో ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నెత్తిమీద రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేసి జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. దక్షిణ భారత వంటకాలలో కొబ్బరి నూనెను అధికంగా వినియోగిస్తారు. అయితే వంటల్లో కన్నా తలకు అప్లై చేసుకునే వారి సంఖ్య ఎక్కువ జుట్టు ప్యాచులుగా ఊడిపోతున్నప్పుడు తిరిగి అక్కడ జుట్టును పెరిగేలా చేసేందుకు కొబ్బరి నూనె ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
కొబ్బరినూనెతో ఉపయోగాలు
కొబ్బరి నూనె జుట్టు రాలడాన్ని సహజంగానే అరికడుతుంది. అలాగే బట్టతల మచ్చలను కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది. జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యం పైన దృష్టి పెట్టి జుట్టును తిరిగి పెంచేందుకు సహాయపడుతుంది. తలకు పోషణాన్ని ఇచ్చి జుట్టు విరిగిపోవడాన్ని తగ్గిస్తుంది. కాబట్టి కొబ్బరినూనె జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మన జుట్టు తంతువులను లోతుగా, తేమవంతంగా చేస్తాయి. మొత్తం మీద జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
కొబ్బరి నూనె తయారీ
ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేసుకుంటే మంచిది. ఇందుకోసం మీరు కొబ్బరికాయల నుండి గుజ్జును బయటకు తీయాలి. దాన్ని సన్నగా తరగాలి. ఒక వస్త్రంలో ఈ కొబ్బరి గుజ్జు తురుమును వేసి పాలను వేరు చేయాలి. ఇప్పుడు ఆ కొబ్బరి పాలను ఒక ఇత్తడి పాత్రలో వేసి స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద వేడి చేయండి. దాదాపు మూడు గంటల పాటు అలా ఉడికించాలి. కొబ్బరి పాలను అలా కలుపుతూ ఉండండి. అలాగని ఎక్కువ మంట కూడా పెట్టకండి. పాలు.. గోధుమ రంగులోకి మారతాయి. ఆ సమయంలో స్టవ్ ఆఫ్ చేయండి.
ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక పలుచటి వస్త్రంలో వేసి వడకట్టండి. గట్టిగా పిండితే నూనె లాంటిది వస్తుంది. ఆ నూనెను ఒక సీసాలో వేసుకోండి. దీన్ని ప్రతిరోజు తలకి కొంత మొత్తంలో అప్లై చేస్తూ ఉండండి. ఈ నూనెను ఎనిమిది నెలల పాటు వాడవచ్చు. అది తాజాగా ఉంటుంది. వారానికి రెండు మూడు సార్లు అప్లై చేస్తే చాలు… అక్కడ జుట్టు పెరగడం మొదలవుతుంది.
ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న కొబ్బరి నూనె ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది. బయటకొనే కొబ్బరి నూనె కన్నా ఇలా తయారు చేసిన కొబ్బరి నూనె జుట్టు తిరిగి త్వరగా పెరిగేలా చేస్తుంది. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో ప్రయత్నించి చూడండి. ఇది మీకు కచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది.