జపాన్ లో పుట్టిన దోమల ద్వారా సంక్రమించి ప్రాణాలు తీస్తున్న వ్యాధి జపనీస్ ఎన్సెఫాలిటస్. ఇది ఇప్పుడు ఢిల్లీలో బయటపడింది. మన దేశ రాజధాని వాయు కాలుష్యం పైనే తీవ్రంగా పోరాడుతోంది. ఆ వాయు కాలుష్యం వల్లే అనేక రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు జపనీస్ కు చెందిన వ్యాధి కూడా ఢిల్లీలో బయటపడింది. పశ్చిమ ఢిల్లీకి చెందిన 72 ఏళ్ల వ్యక్తికి జపనీస్ ఎన్సెఫాలిటిస్ అనే మెదడువాపు వ్యాధి వచ్చింది. ఇతడిని ఐసోలేషన్ లో పెట్టారు.
ఏంటీ వ్యాధి?
జపనీస్ ఎన్సేఫాలిటీస్ అనేది జపాన్ కు చెందిన ఎన్సేఫాలిటీస్ అని పిలిచే వైరస్ వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. దీనిని దోమలే మోసుకొని తిరుగుతాయి. ఈ ఇన్ఫెక్షన్ తిరుగుతున్న దోమలు కాటు వేస్తే చాలు… శరీరంలో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. క్యూలక్స్ జాతికి చెందిన దోమ కాటు వల్ల ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇది మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి రాగానే జ్వరం, తలనొప్పి, వాంతులు, గందరగోళంగా ఉండడం, మూర్ఛలు, పక్షవాతం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఒక్కోసారి ఇది ప్రాణాంతకంగా మారి మరణానికి చేరువయ్యేలా చేస్తుంది.
చికిత్స ఉందా?
ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. ఈ రోగ నిర్ధారణకి కొంత సమయం పడుతుంది. రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చి ఈ వ్యాధిని నయం చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని మాత్రం అధికారులు చెబుతున్నారు. దీనికి నిర్దిష్ట చికిత్స లేకపోవడంతో ఢిల్లీ వాసులు భయపడుతున్నారు.
ఈ వ్యాధిని సోకిన తరువాత కోలుకున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. అయితే వారికి జీవితాంతం అప్పుడప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ పోతూ ఉంటుంది. ఈ వ్యాధి సంభవించే ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 31 కోట్ల మంది నివసిస్తున్నారు. సంవత్సరానికి ఈ వ్యాధి కారణంగా 17వేల మంది మరణిస్తున్నట్టు తెలుస్తోంది. మొదటిసారి ఈ వ్యాధిని 1871లో జపాన్లో గుర్తించారు. అందుకే దీనికి జపనీస్ ఎన్సెఫాలిటిస్ అనే పేరు పెట్టారు.
ఇన్ఫెక్షన్ శరీరంలో చేరాకా కనీసం 26 రోజులపాటు ఎలాంటి లక్షణాలు బయటపడవు. ఆ సమయంలో ఇన్ఫెక్షన్ పొదిగే కాలం ఉంటుంది. ఆ తర్వాతే ఈ వ్యాధి తాలూకు లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. దీనికి సరైన చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాంతకం కాకుండా అడ్డుకోవచ్చు. కొన్నిసార్లు ఇది తేలికపాటిగా వస్తుంది. ఆ సమయంలో ఎలాంటి మందులు లేకపోయినా కొన్ని రోజులకు తగ్గిపోతుంది.
జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాధి సోకిన తరువాత అవసరమైన మేరకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. శ్వాస ఆడేలా చూసుకోవాలి. మూర్చ రాకుండా జాగ్రత్త పడాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి.