Tattoo Ink Dangerous : సరైన ప్రమాణాలు పాటించకుండా, నాసిరకం టాటూలతో చర్మవ్యాధులతో పాటు ప్రమాదకర ఎయిడ్స్, హైపటైటిస్ వంటి వ్యాధులకు కారణం అవుతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం గుర్తించింది. రోడ్డు పక్కన, గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించే జాతరలలో వేసే పచ్చబొట్లు, అందులో వినియోగించే ఇంకు నాణ్యతపై అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి, సేకరించిన ఇంకు నమూనాలకు పరిశోధనాశాలలో పరిశీలించారు. అందులో ఆయా ఇంకులు ఎంతటి ప్రమాదాన్ని కలిగిస్తాయో స్పష్టమైందని కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూ వెల్లడించారు. టాటూ ఇంక్ నమూనాలలో 22 భారీ లోహాలు కనుగొన్నట్లు తెలిపిన ఆయన.. వీటి వినియోగాన్ని అత్యవసరంగా నిలిపివేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇటీవల కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలన విభాగం రాష్ట్రవ్యాప్తంగా టాటూ ఇంకు నమూనాలను సేకరించింది. వీటిని ల్యాబోరేటరీల్లో పరీక్షించగా.. అందులో సెలీనియం, క్రోమియం, ప్లాటినం, ఆర్సెనిక్ వంటి భారీ లోహాలు ఉన్నాయని వెల్లడైంది. ఇవి బాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో సహా అనేక రకాల చర్మ వ్యాధులకు కారణమవుతాయని తేలింది. చర్మం పొరల్లో, కొన్నిసార్లు నరాల మీద వేస్తున్న పచ్చబొట్టు కారణంగా ఈ ప్రమాదక లోహాలు రక్తంలో కలుస్తున్నాయని.. ఫలితంగా దీర్ఘకాలంలో ఎయిడ్స్, హైపటైటిస్ వంటి వ్యాధుల బారిన పడుతున్నట్లుగా గుర్తించారు.
ప్రస్తుతం దేశంలో పట్టబొట్ల కోసం వినియోగిస్తున్న ఇంకుపై ఎలాంటి నియంత్రణలు లేవు. వాటిని సరైన ప్రమాణాలు లేవని గుర్తించారు. పైగా.. టాటూ ఇంక్ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చట్టంలోకి కానీ, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం పరిధిలోకి రాదు. అలాగే.. ఇంక్, అందులో వినియోగించే రసాయనాల పరిమాణాలపై స్పష్టం లేదని మంత్రి దినేష్ గుండూ వెల్లడించారు. దీనికి సరైన ప్రోటోకాల్ ఉండాలని.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం టాటూలను నియంత్రించాలని, మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనియన్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.
ఎవరూ పెద్దగా గుర్తించకపోయినా, ఇది చాలా తీవ్రమైన సమస్య అని మంత్రి వెల్లడించారు. కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలన విభాగం ఇటీవల నిర్వహించిన డ్రైవ్ లో సేకరించి విశ్లేషించిన 1,133 ఔషధ నమూనాలలో 106 నమూనాలను వినియోగించేందుకు అస్సలు పనికిరానిగా గుర్తించగా, మిగిలిన వాటిలో ప్రమాదకర లోహాలు, రసాయనాలు లేవని గుర్తించినట్లు తెలిపారు. కాగా.. ఇలాంటి ఇంకులు వినియోగిస్తూ.. ప్రజలకు టాటూలు వేస్తున్న వారిపై ఇప్పటి వరకు.. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940 కింద 75 కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు.
2024 డిసెంబర్ లో విశ్లేషించిన 262 కాస్మెటిక్ నమూనాలలో 120 నమూనాలు ప్రామాణిక నాణ్యత కలిగి ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన నమూనాలను ఇంకా విశ్లేషణిస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక ఔషధ నియంత్రణ విభాగం ఔషధాలు, సౌందర్య సాధనాల వ్యాపారంలోని అన్ని వాటాదారులను, సరఫరాదారులు, టోకు వ్యాపారులు, పంపిణీదారులు, మెడికల్ షాపులు, ఫార్మసిస్ట్‌లతో పాటుగా రసాయన శాస్త్రవేత్తలను ఒకే వేదికపై చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అందరి మధ్య సమాచారం మార్పిడి కోసం కంప్యూటరీకరించిన వ్యవస్థ, వెబ్ అప్లికేషన్‌ను రూపొందించేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు.