ప్రపంచంలో జీవించి ఉన్నవారిలో అత్యంత వృద్ధులు ఎవరో తెలుసా..? ఏప్రిల్ 30వరకు ఈ రికార్డు బ్రెజిలియన్ నన్ సిస్టర్ ఇనా కానబారో పేరిట ఉంది. ఏప్రిల్ 30న మరణించేనాటికి ఆమె వయసు 116 సంవత్సరాలు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ఉన్న ఆమె మరణించడంతో ఆ తర్వాత స్థానంలో ఉన్న ఎథెల్ కాటర్ హామ్ ఇప్పుడు ఆ రికార్డు హోల్డర్ గా మారారు. కాటర్ హామ్ వయసు 115 సంవత్సరాలు. ఆమె బ్రిటిష్ మహిళ. దక్షిణ ఇంగ్లండ్ లోని బెల్లింగర్ గ్రామానికి చెందిన ఆమె.. మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడానికి ఐదేళ్ల ముందు జన్మించారు. ఆమెకు 8 మంది అన్నదమ్ములున్నారు. తల్లిదండ్రులకు రెండో సంతానంగా జన్మించిన కాటర్ హామ్.. చిన్నప్పటి నుంచి ఆటపాటల్లో చురుగ్గా ఉండేవారు. వయసు మళ్లినా కూడా ఆ చురుకుదనం ఆమెలో పోలేదు. 115 ఏళ్ల వయసు వచ్చినా తన పనులు తానే చేసుకుంటూ ఎంతో చలాకీగా ఉంటారు కాటర్ హామ్.
అలా ఎలా..?
కాటర్ హామ్ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే.. ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత వృద్ధ మహిళగా పేరు తెచ్చుకోవడంతోపాటు.. ఆమె తనలా దీర్ఘాయుష్షు కావాలంటే ఏం చేయాలనే విషయంలో పలు సూచనలు చేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో దీర్ఘాయుష్షుకు చేయాల్సినవి, చేయకూడనివి చెప్పారు.
ఏం చేయాలి..?
దీర్ఘాయుష్షు కలగాలంటే ఏం చేయాలి అనే విషయంలో చాలామంది చాలా చాలా సలహాలిస్తుంటారు. ఆరోగ్యం కాపాడుకోవాలని, అనారోగ్యాన్ని కలిగించే ఆహారానికి దూరంగా ఉండాలని, మానసిక ఒత్తిడిని జయించాలని, వ్యాయామం చేయాలని, ఒంటరిగా ఉండకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని చెబుతుంటారు. అయితే కాటర్ హామ్ మాత్రం ఇలాంటివేవీ చెప్పడంలేదు. దీర్ఘాయుష్షుతో ఉండాలంటే ఏం చేయాలి అనేదానికంటే, ఏం చేయకూడదు అనేదాని గురించి ఆమె మనకు ఓ క్లారిటీ ఇచ్చారు.
ఏం చేయకూడదు..?
ఎక్కువ సంవత్సరాలు సంతోషంగా బతకాలంటే, ఆనందమయ జీవితం కావాలంటే మనం వదులుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. అందులో కాటర్ హామ్ చెప్పేది ఒకే ఒక్కటి. అదే ఆర్గ్యూమెంట్. అనవసర చర్చ. ఎదుటివారితో అవసరం ఉన్నా లేకపోయినా వాదించే లక్షణం. ఆ ఒక్క తప్పు చేయకపోతే మనం ఆనందంగా బతికేయొచ్చు అని చెబుతున్నారు కాటర్ హామ్. అవును, ఆమె చెప్పింది నిజమే. మనలో చాలామంది అనవసరంగా ఇతరులతో వాదనకు దిగుతుంటారు. బయట వ్యక్తులే కాదు, కుటుంబ సభ్యులతో కూడా అనవసర చర్చలు మొదలు పెట్టి చివరకు చికాకుతో ముగిస్తుంటారు. ఇలాంటి వాదనలు పెట్టుకుంటే మన ఆయుష్షు తగ్గిపోతుందని కాటర్ హామ్ హెచ్చరిస్తోంది.
” నేను ఎవరితోనూ ఎప్పుడూ వాదించను, వారు చెప్పేది వింటాను, ఆ తర్వాత నాకు నచ్చినది నేను చేస్తాను. అంతే కానీ, అనవసరంగా వారితో గొడవలు పెట్టుకోను, నా మాట వారు వినాలని అనుకోను, వారు చెప్పినది తప్పు అని కూడా చెప్పను.” అని తన దీర్ఘాయుష్షు రహస్యాన్ని చెప్పింది కాటర్ హామ్.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఇప్పటివరకు అత్యంత వృద్ధ మహిళగా ఫ్రాన్స్ కి చెందిన జీన్ కాల్మెంట్ కి అరుదైన గుర్తింపు ఉంది. ఆమె 122 సంవత్సరాల 164 రోజులు జీవించారు. జీన్ కాల్మెంట్ కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మనస్సుని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేవారు.