Plastic Bottle Water: ప్లాస్టిక్ బాటిళ్లలో మినరల్ వాటర్ ప్రతిచోటా సులభంగా లభిస్తోంది. ప్రస్తుత కాలంలో చాలా మంది వీటిని తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆఫీసులో, ఏదైనా ఫంక్షన్‌లో అయినా.. ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు తాగడం ఎక్కువగానే చూస్తుంటాం. కానీ ఈ అలవాటు క్రమంగా మీ శరీరానికి, ముఖ్యంగా కాలేయానికి ప్రమాదకరంగా మారుతుందని మీకు తెలుసా ? ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే బిస్ఫెనాల్ ఎ (BPA), మైక్రోప్లాస్టిక్స్ వంటి విష రసాయనాలు నీటి ద్వారా శరీరానికి చేరుకుని అవయవాలను ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు కాలేయాన్ని మాత్రమే కాకుండా హార్మోన్ల వ్యవస్థ, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, మెదడు అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలు:
కాలేయం దెబ్బతింటుంది:
ఇటీవల జరిగిన పరిశోధనలు.. ప్లాస్టిక్ బాటిళ్లలో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన నీరు కాలేయానికి చాలా హానికరం అని సూచిస్తున్నాయి. ఈ బాటిళ్లలో ఉండే హానికరమైన రసాయనాలయిన బీపీఏ (బిస్ఫినాల్ ఎ థాలేట్స్.. నీటి ద్వారా శరీరంలోకి వెళ్లి నెమ్మదిగా కాలేయ కణాలను ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. ఇది వాపు, ఆక్సీకరణ ఒత్తిడి, కాలేయ పనితీరు క్షీణతకు దారితీస్తుంది.తరచుగా ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు తాగడం వల్ల ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
హార్మోన్ల అసమతుల్యత:
ప్లాస్టిక్ బాటిళ్లలోని BPA శరీర హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తుంది. అంతే కాకుండా ఇది ఎండోక్రైన్ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్, సంతానోత్పత్తి, జీవక్రియకు సంబంధించిన సమస్యలను కూడా పెంచుతుంది. మహిళల్లో పీరియడ్స్ సంబంధిత సమస్యలతో పాటు పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం వంటివి జరుగుతాయి.
మెదడు అభివృద్ధి:
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్లాస్టిక్ నీటిలో ఉండే మైక్రోప్లాస్టిక్ అంశాలు పిల్లల మెదడు అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తాయి. ఇది గర్భిణీ స్త్రీలకు మరింత ప్రమాదకరం కావచ్చు ఎందుకంటే ఇది పిండం యొక్క నాడీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఇది పిల్లలలో ప్రవర్తనా సమస్యలను, అభ్యాస సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.
Also Read: మందార పూలను ఇలా వాడితే.. జుట్టు జెట్ స్పీడ్‌లో పెరుగుతుంది
క్యాన్సర్ ప్రమాదం:
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్లాస్టిక్ నుండి విడుదలయ్యే కొన్ని రసాయనాలు క్యాన్సర్ కారకాలు కావచ్చు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో విషపూరిత అంశాలు పేరుకుపోతాయి. ఫలితంగా రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, ఇతర తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
శరీరానికి పర్యావరణానికి హానికరం:
ప్లాస్టిక్ బాటిళ్లను పదే పదే ఉపయోగించినప్పుడు లేదా వేడి వాతావరణంలో ఉంచినప్పుడు, అవి విచ్ఛిన్నం కావడం ప్రారంభిస్తాయి. తర్వాత మైక్రోప్లాస్టిక్ కణాలు నీటిలో కరగడం ప్రారంభిస్తాయి. ఈ కణాలు జీర్ణవ్యవస్థకు హాని కలిగించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తాయి.