Loss of appetite: తరచుగా కడుపులో నొప్పిగా అనిపించడం, లేదా ఆకలి మందగించడం వంటివి జరిగితే చాలా మంది పెద్దగా పట్టించుకోరు. ఆకలి లేకపోవడం కూడా మంచిదే కదా అనుకొని లైట్ తీసుకుంటారు. కానీ, ఇది ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. లివర్ సిరోసిస్‌తో ఇబ్బండి పడుతున్న వారిలో ఎక్కువగా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని అంటున్నారు.
లివర్ సిరోసిస్ అనేది లివర్దెబ్బతినడం వల్ల వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధి వస్తే పనితీరు కోల్పోయే అవకాశం ఉందట. ఈ వ్యాధి వల్ల కాలేయ కణాలు దెబ్బతిని, వాటి స్థానంలో గాయపడిన కణజాలం స్కార్ టిష్యూ ఏర్పడుతుంది. ఈ స్థితి కాలేయం పనితీరును దెబ్బతీస్తుందట. అంతేకాకుండా శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, దీన్ని నివారించడానికి ఏం చేయాలో
ఇప్పుడు తెలుసుకుందాం.
కారణాలు
లివర్ సిరోసిస్‌కు అనేక కారణాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ కాలం మద్యం తాగడం వల్ల లివర్ దెబ్బతింటుందని అంటున్నారు. ఇది సిరోసిస్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి. హెపటైటిస్ B, C వైరస్‌ల వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది కూడా లివర్ సిరోసిస్‌కు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఫ్యాటీ లివర్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కూడా లివర్ సిరోసిస్ బారిన పడే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఊబకాయం, డయాబెటిస్ లేదా అధిక కొవ్వు ఆహారం తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది సిరోసిస్‌కు కారణమవుతుంది.
శరీరంలో ఐరన్ అధికంగా పేరుకుపోవడం వల్ల కూడా కాలేయంపై చెడు ప్రభావం పడుతుందట. దీని వల్ల కూడా లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో శరీర రోగనిరోధక వ్యవస్థ కాలేయంపై దాడి చేసినప్పుడు కూడా సిరోసిస్ వస్తుందట.
లక్షణాలు
సిరోసిస్ ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, వ్యాధి తీవ్రమవుతున్నప్పుడు అలసట, కామెర్లు, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, కాళ్లలో వాపు , రక్తస్రావం వంటి లక్షణాలు కనిపించే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
తగ్గించడం సాధ్యమేనా?
లివర్ సిరోసిస్‌ను పూర్తిగా నయం చేయడం కష్టం అని డాక్టర్లు చెబుతున్నారు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దాని ప్రభావాన్ని తగ్గించవచ్చని అంటున్నారు. మద్యం పూర్తిగా మానేయడం వల్ల కాలేయంపై ఒత్తిడి తగ్గుతుందట.
అలాగే తక్కువ కొవ్వు, ఎక్కువ పీచు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి కొంత వరకైనా తప్పించుకునే ఛాన్స్ ఉంటుది. ఊబకాయం ఫ్యాటీ లివర్‌కు కారణమవుతుంది. కాబట్టి బరువు తగ్గేందుకు వ్యాయామం అలవాటు చేసుకోవాలి. హెపటైటిస్ B టీకా వేయించుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: ఒత్తిడి కూడా అవసరమే..
లివర్ సిరోసిస్ ప్రమాదకరమైనదే అయినప్పటికీ సరైన జీవనశైలి, నివారణ చర్యలతో దీనిని నియంత్రించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మద్యం మానేయడం, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, రెగ్యులర్ వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.