CEO Sues Ex girlfriend| ప్రేమలో ఉన్నప్పుడు ఒకరికొకరు కానుకలు ఇచ్చుకుంటారు. ఒకరి సంతోషం కోసం మరొకరు ఎంతైనా ఖర్చు చేస్తారు. అదే ఇద్దరి మధ్య ప్రేమ బంధం ముగిసిన తరువాత ఇంతకాలం ఎందుకు అంత శ్రమ పడ్డామని అనిపిస్తుంది. అలాంటి కథ ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది.
ఒక ప్రేమ బంధం ముగిసిన తర్వాత ఇచ్చిన ఖరీదైన బహుమతులను తిరిగి అడగవచ్చా? ఈ ప్రశ్న చుట్టూ ఇటీవల ఒక ఆసక్తికరమైన న్యాయపోరాటం జరిగింది. తన ప్రేయసిపై దాదాపు రూ.3.5 కోట్లు ఖర్చు చేసిన భారత సంతతి CEO, ఆ డబ్బు తాను ఆమెకు రుణ రూపంలో ఇచ్చానని ఇప్పుడు అదంతా తిరిగి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు.
సింగపూర్‌లో నివసించే భారత సంతతికి చెందిన చంద్ర అగర్వాల్.. ఇండియన్ లాజిస్టిక్స్ కంపెనీ అయిన టిసిఐ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ లో సిఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఫెలిషియా లీపై సింగపూర్ హైకోర్టులో కేసు వేశారు. తాను దాదాపు 3.7 లక్షల డాలర్లు ఖర్చు చేశానని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ మొత్తం భారత కరెన్సీలో సుమారు రూ.3.5 కోట్లకు సమానమని పేర్కొన్నారు. ఆ డబ్బును కానుకలుగా కాకుండా వడ్డీ లేని రుణాలుగా ఇచ్చానని అగర్వాల్ వాదించారు. అయితే ఫెలిషియా లీ ఈ వాదనను తిరస్కరించారు. తనకు అందిన డబ్బు, వస్తువులు, ఇతర ఖర్చులు కానుకలేనని ఆమె పేర్కొన్నారు.
చంద్ర అగర్వాల్.. 2019లో ఒక విమాన ప్రయాణంలో తొలిసారి ఫెలిషియా లీని కలిశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమ సంబంధంగా మారింది. వారు సెప్టెంబర్ 2022లో డేటింగ్ చేయడం ప్రారంభించినట్లు స్థానిక మీడియా రిపోర్ట్. అయితే డిసెంబర్ 2023లో వారి మధ్య మనస్ఫర్తల కారణంగా సంబంధం ముగిసింది. సంబంధం ముగిసిన తర్వాత అగర్వాల్ తన ఖర్చులను తిరిగి పొందేందుకు ప్రయత్నించారు. ఈ వివాదం చివరకు సింగపూర్ హైకోర్టుకు చేరుకుంది.
ప్రేమ సంబంధం కొనసాగుతున్న సమయంలో అగర్వాల్ ఫెలిషియా కోసం భారీగా ఖర్చు చేశారు. హెర్మెస్, డియోర్, ప్రాడా వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఖరీదైన వస్తువులు కొనుగోలు చేశారు.
ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణాలు, విదేశీ పర్యటనల ఖర్చులను కూడా భరించారు. ఫెలిషియా.. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, వ్యక్తిగత క్రెడిట్ కార్డ్ ఖర్చులకు కూడా డబ్బు చెల్లించారు. ఆమె స్టాన్‌ఫర్డ్ యునివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేసింది. ఆ కోర్సుకు సంబంధించిన ఖర్చు కూడా చంద్ర భరించారు. ఫెలిషియా ఇంట్లో ఫెంగ్ షుయ్ వాస్తు కోసం సుమారు 17,000 డాలర్లు ఖర్చు చేశారు.
కోర్టులో ఫెంగ్ షుయ్ ప్రస్తావన వచ్చినప్పుడు అగర్వాల్ వాదిస్తూ తనకు అటువంటి నమ్మకాలు లేవని అందుకే ఆ ఖర్చులన్నీ రుణంగా పరిగణించాలని కోరారు. దీంతో ఆయన వాదనను కోర్టు అంగీకరించలేదు.
Also Read: డేటింగ్‌కు వెళ్లినప్పుడు బిల్లు ఎవరు చెల్లించాలి? 2026లో కొత్త ట్రెండ్ గురూ
ఫెలిషియా తనకు డబ్బు రుణంగా ఇవ్వాలని కోరిందని అగర్వాల్ వాదించారు. ఆమె ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు అంగీకరించిందని కూడా చెప్పారు. ఆమె సంతకాలు లేదా మొదటి అక్షరాలు ఉన్నాయని చెప్పిన ఒక చేతిరాత పత్రాన్ని సమర్పించారు. అయితే ఆ పత్రంపై తాను సంతకం చేయలేదని ఫెలిషియా తెలిపారు.
డబ్బు రుణంగా అడిగినట్లు నిరూపించే తగిన ఆధారాలు లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. తిరిగి చెల్లిస్తానని ఫెలిషియా అంగీకరించినట్లు కూడా స్పష్టమైన ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. ఇద్దరి మధ్య అనేక మెసేజ్‌లు ఉన్నప్పటికీ, రుణ ఒప్పందానికి సంబంధించిన వాట్సాప్ సందేశాలు కనిపించలేదు.
Also Read: బ్రేకప్ తర్వాత మళ్లీ డేటింగ్ ఎప్పుడు ప్రారంభించాలి? మళ్లీ ప్రేమలో పడే ముందు ఈ విషయాలు ఆలోచించండి
రిలేషన్‌షిప్ సమయంలో అగర్వాల్ స్వచ్ఛందంగా ఖర్చు చేశారని కోర్టు గుర్తించింది. ఆయన పదేపదే ఫెలిషియా ఖర్చులు భరించేందుకు ముందుకొచ్చారని ఆధారాలు కనిపించాయి. ఖరీదైన వస్తువులు, ప్రయాణాలు, ఇతర ఖర్చులు బహుమతులుగా పరిగణించవచ్చని కోర్టు నిర్ణయించింది. సంబంధం ముగిసిన తర్వాత అగర్వాల్ తన వైఖరిని మార్చుకున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వివాదాస్పద చెల్లింపులు రుణాలు కాదని, అవన్నీ కానుకలేనని కోర్టు తేల్చింది. అందువల్ల ఫెలిషియా ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
సింగపూర్ హైకోర్టు అగర్వాల్ దావాను కొట్టివేసింది. పైగా ఫెలిషియా కోర్టు సంబంధిత ఖర్చులను కూడా అగర్వాల్ చెల్లించాలని ఆదేశించింది.