Youth Marriage : ఆడ, మగ.. ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా, నీడలా జీవితాంత కలిసి ఉండాలనే ఉద్దేశ్యం నుంచి పుట్టుకొచ్చిందే పెళ్లి. కానీ.. కాలక్రమంలో ఈ తంతులో ఎన్నో మార్పు చేర్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఏదైతే ఏం.. భార్యాభర్తలుగా జీవితాల్ని గడిపేందుకు నిశ్చయించుకుంటున్నారు. కానీ.. మారిపోతున్న ప్రపంచీకరణ పరిస్థితుల్లో పెళ్లి అంటే చాలు చాలా దేశాల్లో యువత భయపడిపోతున్నారంటున్నాయి అనేక నివేదికలు. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేందుకు యువతీ, యువకులకు అనేక అంశాల్ని పరిగణలోకి తీసుకుంటున్నారని చెబుతున్నాయి. గతంలోలా.. వయస్సు ఒక్కదాన్నే దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం లేదని.. అమ్మాయిలు, అబ్బాయిల.. ఆలోచనలు, అభిప్రాయాలు వేగంగా మారిపోతున్నాయని చెబుతున్నారు. ఇది ఏ ఒక్క దేశానికో పరిమితం అయిన విషయం కాదు.. అంతర్జాతీయంగా అనేక దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని చెబుతున్నారు. మరి.. పెళ్లంటే భయపడిపోతున్న యువత ఎక్కువగా ఎక్కడ ఉన్నారు, వారు.. పెళ్లికి ప్రత్యమ్నాయంగా ఎలాంటి మార్గాల్ని ఎంచుకుంటున్నారో తెలుసుకుందాం..
1. స్వీడన్, నార్వే
స్వీడన్, నార్వే వంటి స్కాండినేవియన్ దేశాల్లో పెళ్లిపై అభిప్రాయం పూర్తిగా మారిపోయింది అంటున్నారు. ఇక్కడి యువత నియమబద్ధమైన సంబంధానికి పెళ్లి అవసరం అనే అభిప్రాయం నుంచి దూరంగా వెళుతోందంట. అధికారికంగా పెళ్లి చేసుకోవడం కంటే సహజీవనం చేసేందుకే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. గతంలోనూ ఇలాంటి ధోరణి ఇక్కడ ఉంది.. కానీ ఈ మధ్య కాలంలోనే ఇలాంటి ఆలోచనలు బాగా పెరిగిపోతున్నాయంటున్నారు. ఈ కారణంగానే.. స్వీడన్ లో వివాహేతర జంటలకు పుట్టే పిల్లల సంఖ్య అక్కడి జనాభాలో సగం వరకు ఉంటుందని అంటున్నారు. ఇది ప్రధానంగా సహజీవనం చేసే భాగస్వాములకు సమానమైన హక్కులను అందించే ప్రగతిశీల సామాజిక విధానాల వల్ల సాధ్యమైందని అంటున్నారు.
2. ఫ్రాన్స్
ఫ్రాన్స్ లో సంప్రదాయబద్ధమైన పెళ్లిళ్లు భారీగా తగ్గుతున్నాయి. వాటి స్థానంలో “పాక్ట్ సివిల్ డే సోలిడారిటీ” (PACS) అని పిలిచే సివిల్ యూనియన్లు పెరుగుతున్నాయి. ఇది ఫ్రాన్స్‌లోని ఓ చట్టబద్ధమైన వ్యవస్థ. ఇది పెళ్లికి ప్రత్యామ్నాయంగా 1999లో ప్రవేశపెట్టారు. PACS కింద ఉండే జంటలు కొన్ని చట్టపరమైన హక్కులు, రక్షణలు, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతారు. కానీ, ఇది సంప్రదాయ వివాహంతో పోలిస్తే అనేక పరిమితులతో ఉంటుంది. ఈ బంధంలో ఉన్న వారికి తేలిగ్గా విడాకులు తీసుకునేందుకు వీలవుతుంది. జీవితాంతం బంధాన్ని కొనసాగించాలనే కట్టుబాటు కన్నా.. ఈ సౌలభ్యాన్ని చాలా మంది జంటలు కోరుకుంటున్నారు.
3. జపాన్
జపాన్ లో పెళ్లిపై యువత ఆలోచనలు వేగంగా మారిపోతున్నాయి. ఇక్కడి యువత పెళ్లికి నిరాకరిస్తున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇదే విషయమై అక్కడి ప్రభుత్వం సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. యువత పెళ్లి చేసుకోవాలని, ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ప్రోత్సహిస్తోంది. అలాంటి వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామంటోంది. కానీ.. అక్కడి యువతలో మాత్రం ఇంకా పెద్దగా మార్పులు లేవంటున్నారు. జపాన్ లోని యువతీ యువకులు ఎక్కువగా తమ వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తున్నారని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడి మహిళలు.. ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగ-వ్యక్తిగత జీవిత సమతుల్యత, సంప్రదాయ లింగ భేదాలపై ఉన్న ఆందోళనల కారణంగా పెళ్లిని ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు. మరికొందరైతే పూర్తిగా పెళ్లిని తిరస్కరిస్తున్నారని చెబుతున్నారు. పెళ్లి రేటు తగ్గడం దేశంలోని జనన రేటు క్షీణతకు కూడా ప్రధాన కారణంగా మారుతోంది.
4. దక్షిణ కొరియా
ఆర్థికంగా బాగానే నిలదొక్కుకున్న దక్షిణ కొరియా జనాభా రేటు విషయంలో మాత్రం అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అత్యల్ప జనన రేటు ఉన్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. ఇలా.. అవ్వడానికి కారణాల్లో ఒకటి పెళ్లి చేసుకునే వారి సంఖ్య తక్కువగా ఉండడమే అంటున్నారు ఆ దేశ ఆధికారులు. అధిక జీవన ఖర్చులు, కఠినమైన ఉద్యోగ నిబంధనలు, ఖరీదైన పెళ్లి సంప్రదాయాలు.. అక్కడి యువతకు పెళ్లి అంటే భయపడేలా చేస్తున్నాయని అంటున్నారు. పెళ్లికి దూరమవుతున్న కొరియన్ యువత.. చట్టబద్ధమైన పెళ్లికి బదులుగా సహజీవనం చేయడాన్ని లేదా ఒంటరిగా ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారంట.
5. చైనా
చైనాలో కూడా పెళ్లి రేటు ఇటీవలి సంవత్సరాల్లో భారీగా తగ్గిపోతోంది. ముఖ్యంగా.. మహిళలు పెళ్లికన్నా స్వతంత్ర జీవితాన్ని ఎంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. చైనాలో ఆర్థికాభివృద్ధి, తలసరి ఆదాయం బాగానే నమోదవుతున్నా యువతులు మాత్రం కుటుంబ ఖర్చుల విషయంలో అనేక ఆందోళనలకు గురవుతున్నారని చెబుతున్నారు. వారిలో ఇంటి ఖర్చుల పెరుగుదల, వృత్తిపరమైన ఆశయాలు, మారుతున్న సామాజిక అంచనాలు.. ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా విశ్లేషిస్తున్నారు. గతంలో పిల్లల్ని కనకుండా తీవ్రంగా ప్రయత్నించిన కమ్యునిష్టు ప్రభుత్వమే.. నేడు పిల్లల్ని కనేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. యువత తగ్గిపోవడం, కార్మిక శక్తి క్షీణిస్తుండడంతో ఇద్దరు పిల్లల నిబంధనను సైతం మార్చుకుంది. పైగా.. ఎక్కువ మంది పిల్లల్ని కంటే ప్రత్యేక పోత్సహకాలు అంటూ ప్రకటిస్తోంది. అయినా.. పిల్లల్ని కనేందుకు మాత్రం యువత పెద్దగా ఆసక్తి చూపిస్తున్న దాఖలాలు లేవు.
పైన చెబుతున్న దేశాలన్నింటిలో ఇన్నాళ్లు పెళ్లి అనే పద్ధతి ఉంది. కానీ.. అంతర్జాతీయంగా కొన్ని ప్రాంతాల్లో పెళ్లి అనే సంప్రదాయం పెద్దగా పట్టింపులకు నోచుకోని పరిస్థితులు కూడా ఉన్నాయి. వారు పెళ్లిని నియమబద్ధమైన కార్యంగా, తప్పనిసరిగా నిర్వహించుకోవాల్సిన తంతుగా ఎప్పటికీ చూడరు. అలాంటి… అనేక జాతులున్నాయి. వాటి గురించి కూడా.. ఓసారి తెలుసుకోండి.
* మోసుయో ప్రజలు (చైనా) – ఈ సమాజంలో పెళ్లి, పిల్లలు అనే విధానం ప్రస్తుతం మనకి తెలిసిన పద్ధతులకు భిన్నంగా ఉంటుంది. ఈ సమాజం మాతృస్వామిక సమాజం. ఇందులో.. “వాకింగ్ మ్యారేజ్” అనే ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. ఇందులో ఎవరూ అధికారికంగా పెళ్లి చేసుకోరు.. వాళ్లు కేవలం సహజీవనం చేస్తారు. అదీ కేవలం రాత్రి పూట మాత్రమే కలుసుకుంటారు. ఈ సమాజం.. నైరుతి చైనాలోని యునాన్, సిచువాన్ ప్రావిన్సులలో ప్రధానంగా నాలుగు సరస్సు చుట్టూ నివసిస్తుంటారు. ఒకవేళ పిల్లలు పూడితే తల్లి వైపు వారే చూసుకుంటారు. మోసువో జనాభా దాదాపు 50,000 వరకు ఉంటుందని అంచనా.
* కొన్ని అమెజాన్ తెగలు – అమెజాన్‌లోని కొన్ని ఆదివాసీ సముదాయాలు సంప్రదాయ పెళ్లిని అనుసరించవు. సంబంధాలు, పిల్లల పెంపకం సమాజంలో పంచుకునే విధంగా ఉంటాయి.
Also Read : Family Budget: మీ ఆదాయం తక్కువే అయినా.. భవిష్యత్తు కోసం చిన్న మొత్తంలో సేవింగ్స్ చేయండిలా !
పెళ్లి ఇప్పటికీ ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యమైన వ్యవస్థగా కొనసాగుతున్నప్పటికీ, దాని ప్రాధాన్యత మారుతోంది. ఆర్థిక ఒత్తిడులు, మారుతున్న సామాజిక ప్రమాణాలు, కొత్త బంధాల వ్యవస్థలు – ఇవన్నీ సంప్రదాయ పెళ్లికి ప్రత్యామ్నాయాలను ప్రజలు ఎంచుకునేలా మారుస్తున్నాయి. సహజీవనం, సివిల్ యూనియన్లు, పూర్తిగా స్వతంత్ర జీవితాన్ని ఎంచుకోవడం వంటి మార్పులు, ఆధునిక సమాజంలోని విభిన్న జీవన శైలులను ప్రతిబింబిస్తున్నాయి.