Marriage Advice: అందరు పెళ్లి అంటే అమ్మాయి, అబ్బాయి అంతే అనుకుంటారు. అయితే పెళ్లంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు, రెండు కుటుంబాల, రెండు మనసుల మధురమైన బంధం. కానీ ఈ బంధం అద్భుతంగా, శాశ్వతంగా నిలబడాలంటే కేవలం ప్రేమ లేదా పెద్దల ఆశీస్సులు మాత్రమే సరిపోవు. ఇద్దరు భాగస్వాముల మధ్య నిజాయితీ, అవగాహన, స్పష్టమైన సంభాషణ చాలా అవసరం. ఇలా ఉండాలి అంటే లవ్ మ్యారేజ్ అయినా లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా పెళ్లికి ముందు భాగస్వామిని కొన్ని కీలక ప్రశ్నలను అడగడం తప్పనిసరి.
అలా అడగకపోతే మీ వివాహ జీవితం ఊహించని మలుపులు తిరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. పెళ్లి అనేది క్లైమాక్స్‌లో మాత్రమే నిజం బయటపడే సినిమా కాదు. సినిమాకి ముందు స్క్రీన్ ప్లే, డైలాగులు రాసుకున్నట్లే వివాహానికి ముందు మీ భాగస్వామితో కొన్ని విషయాలపై స్పష్టత తెచ్చుకోవడం తెలివైన పని. తద్వారా భవిష్యత్తులో వచ్చే చిక్కులు, తగాదాలను నివారించవచ్చు. పెళ్లయిన రోజుల వ్యవధిలో కొందరు భార్యలు భర్తలను, భర్తలు భార్యాలను చంపుతున్న రోజులివి. కాబట్టి పెళ్లికి ముందే చేసుకోబోయేవాళ్లని కొన్ని ప్రశ్నలు అడగం వల్ల బెటర్ అని రిలేషన్ షిప్ నిపుణులు, మ్యారేజ్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
నిజంగా పెళ్లికి రెడీగా ఉన్నారా?
వాస్తవానికి ఈ ప్రశ్న వినటానికి చాలా ఈజీగా లేదా సిల్లీగా అనిపించినా ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలాసందర్భాల్లో అమ్మాయిలు లేదా అబ్బాయిలు కుటుంబ ఒత్తిడికి లోనై లేదా సామాజిక కారణాల వల్ల పెళ్లికి ఒప్పుకుంటుంటారు. అయితే మనస్ఫూర్తిగా మాత్రం పెళ్లికి సిద్ధంగా ఉండరు. ఈ మానసిక సంసిద్ధత లోపం వివాహం తర్వాత సంబంధాన్ని తీవ్రంగా బలహీన పరుస్తుంది. భాగస్వాములిద్దరూ శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా సిద్ధంగా ఉంటేనే వివాహం విజయవంతమవుతుంది. మీ కాబోయే భాగస్వామిని ఈ ప్రశ్న అడగడం ద్వారా వారి నిజమైన అభిప్రాయాన్ని, పెళ్లి పట్ల వారి నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు.
గతంలో మీరు ఏదైనా రిలేషన్ లో ఉన్నారా?
ఈ ప్రశ్న కొంచెం వ్యక్తిగతమైనది కావచ్చు కానీ ఇది నమ్మకాన్ని పెంపొందించడంలో చాలా సహాయపడుతుంది. మీ కాబోయే భాగస్వామి గతంలో ఏదైనా సంబంధంలో ఉంటే వారి అనుభవాలు, ఆలోచనలు, అంచనాలు, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మీకు చాలా ముఖ్యం. ఇది వారి వ్యక్తిత్వాన్ని, సంబంధాలపై వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. భవిష్యత్తులో ఏదైనా ఊహించని విషయం బయటపడి షాక్ అవ్వకుండా ఉండటానికి ఇది ఒక మంచి మార్గం. నిజాయితీగా ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం వల్ల మీ బంధంలో మరింత పారదర్శకత పెరుగుతుంది.
శారీరక సంబంధంపై మీ అభిప్రాయం ఏమిటి?
పెళ్లయ్యాక శారీరక సాన్నిహిత్యం అనేది బంధంలో చాలా ముఖ్యమైన భాగం. మీ కాబోయే భాగస్వామి ఈ విషయం గురించి ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకోవడం ముఖ్యం. వారు ఎంత ఓపెన్‌గా ఉంటారు? శారీరక బంధం వారికి ఎంత ముఖ్యం? ఈ విషయంలో వారి అంచనాలు ఏమిటి? ఈ విషయాలపై ముందుగానే చర్చించుకోవడం ద్వారా భవిష్యత్తులో అపార్ధాలకు లేదా నిరాశలకు తావుండదు. ఇద్దరి మధ్య సామరస్యం, అవగాహన పెరిగి బంధం మరింత బలపడుతుంది.
ఆర్థిక స్వాతంత్ర్యం ఖర్చుల, ప్రణాళికలు ఏమిటి?
ఈ రోజుల్లో ఏ సంబంధమైనా డబ్బులే ముఖ్యం అన్నట్లుగా అయిపోయింది. సంబంధాలలో ఆర్థిక అంశాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి పెళ్లికి ముందు మీ భాగస్వామి ఉద్యోగం చేయాలనుకుంటున్నారా లేదా ఇంటి బాధ్యతలు చూసుకోవాలనుకుంటున్నారా అనేది తెలుసుకోవాలి. ఇంటి ఖర్చులకు వారు ఎలా తోడ్పడాలనుకుంటున్నారు? ఆర్థిక స్వాతంత్ర్యం పట్ల వారి దృక్పథం ఏమిటి? ఈ విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండటం వల్ల భవిష్యత్తులో ఆర్థిక పరమైన సంఘర్షణలను నివారించవచ్చు. ఇద్దరూ ఆర్థికంగా ఎలా వ్యవహరించాలనుకుంటున్నారు అనే దానిపై ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి.
కెరీర్ పట్ల మీ దృక్పథం ఏమిటి?
మీ భాగస్వామి కెరీర్ ఆధారిత వ్యక్తి అయితే పెళ్లి తర్వాత కూడా వారు తమ వృత్తిని కొనసాగించాలని కోరుకుంటారు. పెళ్లి తర్వాత భాగస్వామి తన కోరికలపై రాజీ పడకుండా ఉండటానికి ఈ విషయంలో స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం. ఇద్దరి మానసిక శాంతికి, అవగాహనకు ఇది చాలా ముఖ్యం. ఇద్దరి కెరీర్ ఆశయాలకు ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవడం, అవసరమైతే రాజీపడటం గురించి చర్చించుకోవడం భవిష్యత్తు సంబంధానికి పునాది వేస్తుంది.
కుటుంబం, లైఫ్ స్టైయిల్ పై మీ ఒపినీయన్?
మీ కాబోయే భాగస్వామి ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా వారు చిన్న కుటుంబంలో జీవించాలనుకుంటున్నారా? ఇంటి పెద్దల గురించి మీ కుటుంబ సంప్రదాయాల గురించి వారి అభిప్రాయం ఏమిటి? ఈ విషయాలను ముందుగానే స్పష్టం చేసుకుంటే తర్వాత ఇంట్లో విభేదాలను నివారించవచ్చు. జీవనశైలి, అలవాట్లు, అభిరుచులు వంటి వాటిపై కూడా చర్చించుకోవడం ద్వారా ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది.
Also Read: హాస్పిటల్స్‌లో లక్షలు పెట్టే కన్నా.. పొద్దున్నే ఈ ఆకులు తింటే రోగాలన్నీ మాయం
పిల్లలు కావాలా? ఎంత సమయం తర్వాత?
చాలా మంది ఈ ప్రశ్నకు దూరంగా ఉంటారు. కానీ ఇది అత్యంత ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటి. కొంతమంది పెళ్లయిన వెంటనే పిల్లలను కోరుకుంటారు, మరికొందరు 2-3 సంవత్సరాల తర్వాత లేదా ఇంకా ఆలస్యంగా కావాలని కోరుకుంటారు. ఈ విషయంలో మీ ఆలోచనలు భిన్నంగా ఉంటే భవిష్యత్తులో ఇది పెద్ద సమస్యగా మారవచ్చు. కాబట్టి పెళ్లికి ముందు దీనిపై ఒకరి అభిప్రాయాన్ని ఒకరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చర్చించుకోవడం, ఇద్దరి అంచనాలను పంచుకోవడం ఆరోగ్యకరమైన వైవాహిక జీవితానికి దారి తీస్తుంది.