Moong Dal Halwa: పెసరపప్పు హల్వా అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? ముఖ్యంగా చలికాలంలో, పండుగలు లేదా పెళ్లిళ్ల సీజన్‌లో వేడివేడిగా ఈ హల్వా తింటుంటే ఆ మజానే వేరు. చాలామంది ఇది చేయడం కష్టమని బయట స్వీట్ షాపుల్లో కొంటుంటారు. కానీ కాస్త ఓపిక, చిన్నపాటి చిట్కాలు తెలిస్తే ఇంట్లోనే అద్భుతమైన రుచితో, నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఈ హల్వాను తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు.. ఆ సింపుల్ రెసిపీ ఏంటో చూసేద్దామా.
ఈ హల్వా తయారీకి పొట్టు లేని పచ్చ పెసరపప్పు, స్వచ్ఛమైన నెయ్యి, చక్కెర, పాలు ప్రధానంగా కావాలి. వీటితో పాటు రుచి మరింత పెరగడానికి కొద్దిగా కోవా (మావా), కొంచెం శనగపిండి, బొంబాయి రవ్వ తీసుకోవాలి. మంచి సువాసన కోసం యాలకుల పొడి, కుంకుమపువ్వు పాలు, గార్నిషింగ్ కోసం సన్నగా తరిగిన బాదం, పిస్తా, జీడిపప్పులు సిద్ధం చేసుకోవాలి.
Also Read: ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించే వెజిటబుల్ దలియా.. రుచి అద్భుతం!
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి కనీసం 4 నుండి 5 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి. తర్వాత నీరంతా వంపేసి, మిక్సీలో చాలా తక్కువ నీళ్లు పోసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ పల్చగా ఉండకూడదు.
ఇప్పుడు అడుగు మందంగా ఉన్న వెడల్పాటి కడాయి పెట్టి సగం నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక అందులో రవ్వ, శనగపిండి వేసి వేయించాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ వేసి సన్నని మంటపై కలుపుతూ వేయించాలి. పప్పు అడుగు అంటకుండా సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు ఓపికగా వేయిస్తే.. పప్పు లేత గోధుమ రంగులోకి మారి కమ్మటి వాసన వస్తుంది.
ఆ తర్వాత ఇందులో పాలు పోసి, పాలు పూర్తిగా ఇంకిపోయే వరకు కలుపుతూ ఉడికించాలి. అనంతరం మిగిలిన నెయ్యి వేసి మరో 5 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు కోవా వేసి బాగా కలపాలి. కోవా లేకపోతే మిల్క్ పౌడర్ అయినా వాడుకోవచ్చు. మరో పక్కన ఒక గిన్నెలో చక్కెర, నీళ్లు పోసి చక్కెర కరిగే వరకు వేడి చేయాలి. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు.
పప్పు పూర్తిగా ఉడికిన తర్వాతే ఈ చక్కెర నీళ్లను హల్వాలో పోసి కలపాలి. కడాయి అంచుల నుండి నెయ్యి పైకి తేలే వరకు ఉడికించి, చివరగా కుంకుమపువ్వు పాలు, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆపేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన పెసరపప్పు హల్వా రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే రుచి అద్భుతం ఉంటుంది.
Also Read: ఎప్పుడూ పకోడీలు, బజ్జీలేనా? ఈసారి ఇలా అటుకుల బొండాలు చేసుకుని తిని చూడండి!