Atukula Bonda Recipe: ఇంట్లో అటుకులు ఉన్నాయా? అయితే వాటితో అదిరిపోయే స్నాక్ తయారుచేసుకోవచ్చు. ఎప్పుడూ పకోడీలు, బజ్జీలేనా అనుకోకుండా ఈసారి కాస్త కొత్తగా, ఎంతో రుచిగా ఉండే అటుకుల బొండాలు ట్రై చేయండి. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ బొండాలను ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది. పైగా వీటిని తయారుచేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.. ఇంట్లో ఉండే అటుకులు, బంగాళదుంపతో చాలా ఈజీగా చేసేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ టేస్టీ అటుకుల బొండాలను ఎలా తయారుచేయాలో చూద్దాం రండి..
మందంగా ఉండే అటుకులు – ఒక కప్పు
ఉల్లిపాయ – ఒకటి
ఉడికించిన బంగాళదుంప – ఒకటి
అల్లం పేస్టు – అర చెంచా
పచ్చిమిర్చి తరుగు – ఒక చెంచా
కొత్తిమీర తరుగు – రెండు పెద్ద చెంచాలు
కరివేపాకు – రెండు రెబ్బలు
కారం – అర చెంచా
వాము – అర చెంచా
ఉప్పు – తగినంత
బరకగా చేసుకున్న పల్లీల పొడి – రెండు టేబుల్ స్పూన్లు
సెనగపిండి – మూడు టేబుల్ స్పూన్లు
నూనె – వేయించడానికి సరిపడా
ముందుగా అటుకులను నీటితో శుభ్రంగా కడిగి, నీటిని పూర్తిగా వడకట్టి పది నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకును సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉడికించిన బంగాళదుంపను మెత్తగా చిదిమి సిద్ధం చేసుకోవాలి.
నానబెట్టిన అటుకుల్లోకి తరిగిన ఉల్లిపాయ, మెత్తగా చేసుకున్న బంగాళదుంప, అల్లం పేస్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి.
ఇందులో కారం, వాము, ఉప్పు, పల్లీల పొడి, సెనగపిండి వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. మిశ్రమం మరీ గట్టిగా ఉంటే కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ బొండాలు చేసుకోవడానికి అనువుగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని జాగ్రత్తగా నూనెలో వేయాలి.
మీడియం మంటపై బొండాలను మధ్యమధ్యలో తిప్పుతూ అన్ని వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అవి చక్కగా ఎర్రగా, కరకరలాడేలా వేగిన తర్వాత జల్లెడతో తీసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి.