Tomato Face Pack For Tan Removal: అందంగా, తెల్లగా మెరుస్తూ ఉండాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఇవి తాత్కాలిక మెరుపును అందిస్తాయి. కానీ ఇలాంటివి జరగకుండా హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే టమాటోలు చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటితో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడితే.. అద్బుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
ఇందులోని లక్షణాలు ముఖం కోల్పోయిన మెరుపును తిరిగి తీసుకురావడంలో సహాయపడతాయి. సూర్యకాంతి, కాలుష్యం, ఒత్తిడి కారణంగా, చర్మంపై టానింగ్, మచ్చల వంటివి ప్రారంభం అవుతాయి. ఇలాంటి పరిస్థితిలో టమాటో ఫేస్ ప్యాక్ వాడటం వల్ల చర్మం లోపలి నుండి శుభ్రపడుతుంది. అంతే కాకుండా తాజాగా మారుతుంది. ఇందులో లభించే లైకోపీన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని కూడా రక్షిస్తుంది.
టమాటో ఫేస్ ప్యాక్ :
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి మీకు పెద్దగా పదార్థాలు అవసరం లేదు. మీరు దీనిని ఇంట్లోనే కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీని కోసం కావాల్సినవి:
పండిన టమాటో- 1
శనగపిండి- 1 స్పూన్
పెరుగు- 1 స్పూన్
నిమ్మరసం-1/2 టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా టమాటోనే మిక్సీ పట్టాలి. లేదా చేతితో గుజ్జుగా చేయాలి. దీనికి పైన తెలిపిన మోతాదులో శనగపిండి, పెరుగు, నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ చాలా మందంగా ఉంటే.. కొద్దిగా రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు.
ఎలా ఉపయోగించాలి ?
మీ ముఖాన్ని సాధారణ నీటితో కడిగి, శుభ్రం చేసి కాసేపు ఆరనివ్వండి. ఇప్పుడు తయారుచేసిన టమాటో ఫేస్ ప్యాక్‌ను ముఖం, మెడ అంతటా సమానంగా అప్లై చేయండి. తర్వాత 10 నుంచి 15 నిమిషాలు ఆరనివ్వండి. దీని తర్వాత.. చేతులతో మసాజ్ చేస్తూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
ప్రయోజనాలు ఏమిటి ?
టమాటో చర్మం నుండి అదనపు నూనెను తొలగించి తాజాగా చేస్తుంది.
నిమ్మకాయ, పెరుగు కలిపి వాడటం వల్ల చర్మం రంగు మెరుగుపడుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న టానింగ్ తగ్గుతుంది.
శనగపిండి చర్మాన్ని మృత చర్మ కణాలను తొలగించడం ద్వారా మృదువుగా చేస్తుంది.
వారానికి రెండు మూడు సార్లు దీన్ని ఉపయోగించడం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.
Also Read: హోం మేడ్ హెయిర్ కలర్.. ఇది వాడితే జీవితంలో తెల్ల జుట్టు రాదు
గుర్తుంచుకోవాల్సినవి:
మీ చర్మం సున్నితంగా ఉంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి.
నిమ్మకాయను తక్కువ మోతాదులో ఉపయోగించండి.
ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ ఉపయోగించండి.
మీరు రసాయనాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయి, ఇంట్లోనే మీ ముఖం యొక్క మెరుపును పెంచుకోవాలనుకుంటే.. టమాటో ఫేస్ ప్యాక్ ఒక ప్రభావవంతమైన, సహజమైన పరిష్కారం. నిమిషాల్లో తయారు చేయగల ఈ ప్యాక్, మీ చర్మానికి తాజాదనం, మెరుపును అందిస్తుంది. అది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే.