సొంత ఇంటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. తాము నివసించే చోట ఒక అందమైన ఇంటిని కొనుక్కోవాలని భావిస్తారు. కానీ అది అందరివల్లా కాదు. భారతదేశంలోని కొన్ని నగరాల్లో ఇల్లు కొనాలంటే ఒక సాధారణ వ్యక్తి తన జీవితాంతం కష్టపడినా కూడా కొనలేని పరిస్థితి.
నెలకు ఎంత సంపాదించాలి?
ఒక కొత్త నివేదిక ప్రకారం మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఇల్లు కొనాలంటే సంవత్సరానికి 10 లక్షలకు పైగా సంపాదించే ఒక వ్యక్తి 109 సంవత్సరాల పాటు ఆదా చేయాల్సి వస్తుంది. అలా కూడా ఒక మంచి ఇంటిని మాత్రం కొనుక్కోలేడు. ఒక సాధారణ చిన్న ఇంటిని మాత్రమే కొనగలడు.
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై. ఇక్కడ ఉన్నవారు అందరికీ ఇల్లు ఉండాలని లేదు. కొంతమంది ఉద్యోగాల రీత్యా ముంబైకి వస్తూ ఉంటారు. అలాంటి వారికి ముంబైలో ఇల్లు కొనడం అంటే సాధారణ విషయం కాదు. మహారాష్ట్రలో జీవిస్తున్న ధనిక కుటుంబాల వారు కూడా ముంబైలో ఇల్లు కొనాలంటే భయపడతారు. దానికి కారణం అక్కడ పెరుగుతున్న ఇంటి ధరలు, కాస్ట్ ఆఫ్ లివింగ్.
భారతదేశంలోని రాష్ట్రాల రాజధానులలో ముంబై అత్యంత ఖరీదైన గృహ మార్కెల్ ను కలిగి ఉంది. ఇక్కడ సాధారణ వ్యక్తులు ఇల్లు కొనలేరు. కేవలం అద్దెకు మాత్రమే ఉండగలరు. అది కూడా ఒక సాధారణ ఫ్లాట్లో మాత్రమే.
గణాంకాల ప్రకారం
తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఒక నివేదికను ప్రచురించారు. దీనిలో నేషనల్ హౌసింగ్ బోర్డ్, పట్టణ ఆదాయ అంచనా సంస్థలు ఒక గణాంకాలను విడుదల చేశాయి. దాని ప్రకారం మహారాష్ట్రలో జీవిస్తున్న చాలామంది వార్షిక ఆదాయం 10.7 లక్షలు రూపాయలుగా ఉంది. అంటే సంవత్సరానికి వారు సంపాదిస్తున్నది 10 లక్షల 70 వేల రూపాయలు. అంటే నెలకి 89 వేల రూపాయలు దాకా సంపాదిస్తారు. కానీ వారు ముంబైలో ఇల్లు కొనలేని పరిస్థితి.
ఏడాదికి వచ్చే జీతంలో వారు ఏడాదికి 30 శాతం మాత్రమే పొదుపు చేయగలరు. అంటే ఏడాదికి మూడు లక్షల 20వేల వరకు ఆదా చేయవచ్చు. ఇక ముంబైలో 1100 చదరపు అడుగుల ఫ్లాట్ కొనాలంటే మూడున్నర కోట్ల రూపాయలు అవసరం. ఎందుకంటే ముంబైలో చదరపు అడుగు 29,990 రూపాయలు ఎప్పుడో దాటేసింది. ఇలా ఒక వ్యక్తి సంవత్సరానికి 3,20,000 రూపాయలు ఆదా చేస్తూ పోతే మూడున్నర కోట్ల సంపాదించడానికి అతనికి కనీసం 109 సంవత్సరాలు పడుతుంది. అంటే అతని జీవితం కూడా సరిపోదు.
పైన చెప్పిన లెక్కల ప్రకారం ముంబైలో ఇల్లు కొనడం అనేది సాధారణ విషయం కాదు. సాధారణ ఉద్యోగం చేసేవారు ముంబై వైపు చూడలేని పరిస్థితి. ఇల్లు కొనడం కష్టంగా మారినా నగరాల్లో ముంబై ఒక్కేటే కాదు.. గురుగ్రామ్, బెంగళూరు, ఢిల్లీ వంటివి కూడా చేరిపోయాయి. ఇక్కడ కూడా ధనవంతులు ఇల్లు కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. గురుగ్రామ్ లో ఇల్లు కొనాలంటే ఒక వ్యక్తి 64 సంవత్సరాల పాటు ఆదా చేయాలి. అదే బెంగళూరులో అయితే 36 ఏళ్లు పాటు, ఢిల్లీలో అయితే 35 ఏళ్ల పాటు ఆదా చేసుకోవాలి. ఇక మన దేశంలో అత్యంత చవకైన నగరంగా చండీగఢ్ నిలిచింది. చండీగఢ్లో మీరు ఇల్లు కొనాలంటే 15 సంవత్సరాల పాటు పొదుపు చేస్తే సరిపోతుంది… ఇల్లు కొనుక్కోవచ్చు.
తాజాగా వచ్చిన ఈ గణాంకాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు ఇల్లు కొనేందుకు పెద్దపెద్ద నగరాల వైపు కాకుండా చిన్న పట్టణాల కొనుక్కోవడం ఉత్తమం అని భావిస్తున్నారు. భారతదేశంలోని ఎన్నో నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని మరొక నివేదిక చెబుతోంది. బెంగళూరులో 44 శాతం ఇళ్ల ధరలు పెరిగితే, హైదరాబాదులో 37 శాతం ఇళ్ల ధరలు పెరిగినట్టు గుర్తించారు.
విదేశాల్లో ఎంతోమంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు వారు తమ డబ్బును భారతదేశంలో రియల్ ఎస్టేట్ మీద పెట్టేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. దానివల్లే ఇలా ఇళ్లు ధరలు పెరిగిపోతున్నాయని కొంతమంది నిపుణులు కూడా చెబుతున్నారు. ఇళ్ల ధరలు, వ్యక్తుల ఆదాయం కంటే వేగంగా పెరిగిపోవడం వల్ల ఇల్లు కొనడం సామాన్యులకు, అలాగే ధనవంతులకు కూడా కష్టంగా మారుతోందని అంచనాలు వివరిస్తున్నాయి.