ప్రశ్న: మాకు పెళ్లయ్యి ఆరేళ్లు దాటింది. మాది పెద్దల కుదిర్చిన వివాహమే. అతను చూసేందుకు సాఫ్ట్ గానే కనిపిస్తాడు. పెళ్లయిన తర్వాత ఏడాది వరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నుంచి చీటికిమాటికి విసిగిపోవడం వంటివి చేసేవాడు. గొడవపడ్డాక మళ్ళీ తానే వచ్చి బుజ్జగించేవాడు. ప్రతిసారీ తిట్టడం తరువాత వచ్చి బతిమాలడం అనేది అలవాటుగా మారింది. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత కొట్టడం కూడా ప్రారంభించాడు. ఏదైనా సమాధానం ఇస్తే చాలు, ఒక చెంప దెబ్బ కొడుతున్నాడు. గత రెండేళ్లుగా ఇదే వరస. ఏం మాట్లాడాలన్నా ఎక్కడ కొడతాడో అన్న భయం పట్టుకుంది. కొట్టిన తర్వాత కాసేపటికి మళ్ళీ వచ్చి ప్రేమ కురిపిస్తున్నాడు. నేను అతడిని క్షమించలేనంతగా మారిపోయాను. నా మనసు విరిగిపోయింది. అతడి వింత ప్రవర్తన నాకేమీ నచ్చడం లేదు. తానే అరిచి, తానే నన్ను కొట్టి, తానే తెగ బాధపడుతూ ఉంటాడు. భోజనం మానేస్తాడు. నేనే అతడిని బాధ పెడుతున్నానని ఏడుస్తాడు. తిట్టింది కొట్టింది ఆయనే. నేను అతడిని ఏం బాధ పెట్టానో కూడా నాకు అర్థం కాదు. అతనితో ఎలా వేగాలో నాకు తెలియడం లేదు. అతని వింత ప్రవర్తన చికాకును కలిగిస్తుంది. ఇది గృహింస చట్టం కిందకి వస్తుందని నాకు తెలుసు. కానీ చుట్టుపక్కల వారు, ఇంట్లో వారు ఏమనుకుంటారోననే భయం వేస్తోంది. ఏం చేయమంటారు?
జవాబు: ఎంతగా ప్రేమించే భర్త అయినా… తిట్టడం కొట్టడం అనేది రోజువారీ దినచర్యలో భాగంగా మార్చుకుంటే అతడిని భరించవలసిన అవసరం లేదు. మనసు విరిగిపోయేలా తిట్టి, చెంప పగిలేలా కొట్టి… తర్వాత వచ్చి బతిమిలాడితే ఆడవాళ్లు కరిగిపోతారని మగవారికి తెలుసు. అందుకే చివర్లో వచ్చి మిమ్మల్ని బతిమిలాడడం, తిరిగి తానే ఏడవడం, అన్నం మానేయడం వంటివి చేస్తున్నాడు. ఆడవారు భర్త అన్నం తినకపోతే చాలా బాధపడతారన్న విషయాన్ని కూడా అతను గ్రహించాడు. అయితే మీరు గత రెండేళ్లుగా తిట్లు, దెబ్బలు తింటూనే ఉన్నారు. ఇంకా భరించాల్సిన అవసరం మీకు లేదేమో ఆలోచించుకోండి.
గృహ హింస చట్టం కింద కేసు పెడితే అతడిని అరెస్టు చేసి జైల్లో పెట్టరు. ముందుగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ వంటివి ఉంటాయి. మీరు మొదట మీ భర్తతో కూర్చుని మాట్లాడండి. మీ బాధను అతనితో కమ్యూనికేట్ చేయండి. అతను చేస్తున్న పనులు మిమ్మల్ని ఎంతగా బాధిస్తున్నాయో కూడా తెలియజేయండి. మీ భద్రతా, శ్రేయస్సు, వ్యక్తిగత సౌలభ్యం అనేవి ఎంత ముఖ్యమో ఆయనకు చెప్పండి. అలాగే మీ ఇంట్లోని పెద్దవారి సహాయం కోరండి. మీ తల్లిదండ్రులకు, అతని తల్లిదండ్రులకు కూడా చెప్పి అతడి మనసు మార్చేందుకు ప్రయత్నించండి.
మీ పెద్దవారు చెప్పినా కూడా అతని తీరు మారకపోతే మీరు అతడిని ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్లవచ్చు. మానసిక వైద్య నిపుణుల సాయం తీసుకోవచ్చు. కొన్ని థెరపీల ద్వారా అతడి ప్రవర్తనను అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే అంతిమంగా మీ పిల్లలు, మీరు సురక్షితంగా ఉండటం అనేది ముఖ్యం. కాబట్టి చుట్టుపక్కల వారి గురించి, ఇంట్లోని పెద్దల గురించి ఆలోచించి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోకండి. అవసరం అనిపిస్తే చట్టపరమైన చర్యలు కూడా సిద్ధంగా ఉండండి.
Also Read: నా భర్తకు అలా నిద్రపోవడం అంటే ఇష్టం, నాకేమో అది ఏమాత్రం నచ్చడం లేదు
ప్రేమ అంటే జీవిత భాగస్వామికి భద్రతను, ఆనందాన్ని ఇవ్వడం. ఆ రెండూ మీకు ఆయన ఇవ్వడం లేదు. మొదటి ప్రాధాన్యత భద్రతకే ఉంటుంది. కానీ మీకు ఆయన దగ్గర భద్రత లేనట్టే కనిపిస్తోంది. మొదట తిట్లు, తర్వాత దెబ్బలు. ఇక పరిస్థితి ముదిరితే ఏమవుతుందో చెప్పడం కష్టం. కాబట్టి మీరు అంత సమయాన్ని ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మొక్కగా ఉన్నప్పుడే సమస్యను తొలగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ పెద్దల సహాయాన్ని, థెరపిస్టుల సహాయాన్ని తీసుకోండి. అతడు మరీ మొండికేస్తే చట్టపరమైన చర్యలు కూడా చేపట్టండి. ముందుగా మీరు ధైర్యంగా ఉండడం నేర్చుకోండి. అతనిదే కాదు… మీది కూడా జీవితమే. మీకంటూ గుర్తింపు, ఆనందం, సౌలభ్యం వంటివి ఉండాలి.