Tiger Attack: కుమ్రంబీమ్ జిల్లాలో రాకాసి పులి మరోసారి పంజా విసిరింది. పులి దాడిలో తీవ్ర గాయాల పాలయ్యాడు సురేష్ అనే యువకుడు. సిర్పూర్ టీ మండలం దుబ్బగూడలో ఈ దాడి జరిగింది. అదిగో పులి, ఇదిగో పులి. ఇక్కడుందేమో అన్న భయం భయం. అక్కడుందన్న మాటతో క్షణ క్షణం నరాలు తెగే ఉత్కంఠ. ఇదీ ప్రస్తుతం కుమురం భీం జిల్లా, కాగజ్ నగర్ ప్రాంత వాసుల పరిస్థితి.
నిన్న పులిదాడిలో యువతి మృతి చెందడంతో ఇక్కడి ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. పత్తి చేన్లోకి వెళ్లేందుకు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే కాగజ్ నగర్ పరిసర గ్రామాలైన నజ్రుల్ నగర్ అనుగూడ, గన్నారం, కడంబా, అరెగూడా, బాబూనగర్ గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు సెక్షన్ 144 విధించారు. రైతులు, ఇతర స్థానికులెవరూ బయటకు రావద్దని హెచ్చరించారు.
టైగర్ అటాక్ తో బలైన యువతి ఘటనతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులి కదలికలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ పులి మహారాష్ట్ర నుంచి వచ్చినట్టు గుర్తించారు. అంతే కాదు యువతి ప్రాణాలు తీసిన మగ పులికి మూడేళ్ల వయసు ఉంటుందని చెబుతున్నారు. దాడి చేసిన పులి మ్యాన్ ఈటర్ కాదని అంచనా వేశారు. కానీ యువతి మృతితో ఈ అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
నవంబర్, డిసెంబర్ మాసాలు వచ్చాయంటే చాలు.. ఈ ప్రాంతంలో ఒకటి చలిపులి, రెండు పులిగిలితో గజగజలాడాల్సిన పరిస్థితి. గన్నారం గ్రామానికి చెందిన 21 ఏళ్ల లక్ష్మిని పులి నోట కరుచుకుని వెళ్లేసరికి.. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారీ ప్రాంతవాసులు. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అంతే కాదు ఆరో నెంబర్ గ్రామంలో పులి సంచరిస్తోందన్న సమాచారం అందడంతో.. విలేజ్ నెంబర్-1, 3, 5, 8, 9, 10లో కూడా ఆంక్షలు విధించారు పోలీసులు. దయచేసి పత్తి చేలోకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: మహబూబ్‌నగర్‌లో రైతు పండగ సభ.. మరో 3 లక్షల మందికి రుణమాఫీ, ఇదీ ప్రజా ప్రభుత్వం
ఇప్పటి వరకూ మొత్తం ఐదు ఘటనలు. మ్రుతుల సంఖ్య నాలుగు. 2020 నవంబర్ 11న 22 ఏళ్ల యువకుడు పులిదాడిలో చనిపోగా, 2020 నవంబర్ 29న 17 ఏళ్ల యువతి టైగర్ అటాక్ లో ప్రాణాలు కోల్పోయింది. 2020 డిసెంబర్ 5న ఇద్దరు యువకులు పులిని చూసి చెట్టెక్కి ప్రాణాలు అరచేత పట్టారు. ఇక 2022 నవంబర్ 15న 69 ఏళ్ల వ్రుద్ధుడు పులిదాడి కారణంగా చనిపోయారు. తాజాగా నిన్న నవంబర్ 29న 21 ఏళ్ల లక్ష్మి పులి దాడితో చనిపోవడంతో ఠారెత్తిపోతున్నారీ ప్రాంతవాసులు.
అసలీ పులి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నాళ్లుగా తిరుగుతోంది? ఈ మధ్య ఎవరికైనా కనిపించిందా? అనే విషయాలపై అటవీ అధికారులు ప్రాథమికంగా ఓ స్పష్టతకు వచ్చారు. ఈ పులి మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చిందని భావిస్తున్నారు. ఇది మగపులి అని, పాద ముద్రల ఆధారంగా ఈ పులి వయసు మూడేళ్ల వరకూ ఉండొచ్చన్న అంచనాకు వచ్చారు. పులిని బంధించే విషయంపై అటవీ సిబ్బంది తీవ్ర యత్నాలు చేస్తున్నారు.
కొమరంభీం జిల్లా, కాగజ్ నగర్ మండలం అరెగూడలో స్థానికులకు పులి కనిపించిందన్న వార్త గుప్పు మనడంతో.. ఈ ప్రాంత వాసులు భయంతో వణికిపోతున్నారు. డ్రోన్ ల ద్వారా.. పులి కోసం అన్వేషిస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఉదయం నుంచీ సెర్చింగ్ నడుస్తున్నా.. పులి జాడ అంతు చిక్కడం లేదు. పంట పొలాలను పత్తి చేలను జల్లెడ పట్టేస్తున్నా ఎంతకీ పులి కనిపించడం లేదు. స్థానికులకు పులిపై ఒక అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. పులికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. పత్తి చేనులోకి అసలే వెళ్లొద్దనీ.. వార్న్ చేస్తున్నారు.