ఈ మహిళ తను అనుభవిస్తున్న విచిత్రమైన సమస్య గురించి చెబుతోంది. భర్త మంచివాడే కానీ అతనికి ఉన్న ఒక అలవాటే ఈమెకు ఏమాత్రం నచ్చడం లేదు. ఆ సమస్యను వైద్యులతో పంచుకుంది ఆ ఇల్లాలు.
ప్రశ్న: మాది పెద్దలు కుదుర్చిన వివాహం. నిజానికి పెళ్లి సమయంలో నేను ఆయన్ను ప్రేమించలేదు. అలా అని ద్వేషించను. ఒక కొత్త వ్యక్తితో ఎలా ఉంటామో అలాంటి భావనే ఉంది. కానీ ఆ తరువాత అతను చూపించే ప్రేమకి నేను దాసోహం అయిపోయాను. మా ఇద్దరం ఒకరితో ఒకరం ప్రేమలో పడ్డాము. అతని గురించి చెప్పడానికి అంతా మంచే ఉంది. కానీ ఒకే ఒక అలవాటు నాకు చాలా చికాకుగా మారింది. అంతేకాదు చాలా వింతగా కూడా అనిపిస్తోంది. వద్దని ఎంత కాలంగా చెబుతున్నా ఆయన వినడం లేదు. ఆ సమస్య ఏంటంటే నా భర్త రాత్రిపూట పూర్తిగా నగ్నంగా నిద్రించడానికి ఇష్టపడతారు.
కనీసం ఒక షార్ట్ వేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇది నాకు ఏమాత్రం నచ్చడం లేదు. పిల్లలు హఠాత్తుగా గదిలోకి వచ్చి వస్తే ఏమవుతుందో అని భయమేస్తోంది. అలాగే పొద్దున్నే పనిమనిషి వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు లోపలికి వెళ్లడానికి కూడా నిరాకరిస్తుంది. అలాంటి పరిస్థితులు నాకు ఎంతో ఇబ్బందిని కలుగజేస్తున్నాయి. ఈ విషయం గురించి నా భర్తతో ఎన్నోసార్లు చర్చించాను. తాను మాత్రం బట్టలు వేసుకుంటే నిద్రపోలేనని తనకు నిద్ర పట్టదని చెబుతున్నాడు. ఈ అలవాటు తనకు పెళ్లికి ముందు నుంచే ఉన్నట్టు నాకు ఇప్పుడే తెలిసింది. మొదట్లో ఈ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రతి రాత్రి అలాగే పడుకుండడంతో నాకు వింతగా అనిపిస్తోంది. అతనికి ఏదైనా మానసిక సమస్య ఉందేమోనని సందేహంగా ఉంది. ఈ అలవాటుని ఎలా మాన్పించాలో తెలియడం లేదు.
జవాబు: మీ భర్త వైపు నుంచి ఆలోచిస్తే అతను చేస్తున్నది సరైన పని. కానీ మీ వైపు నుంచి ఆలోచిస్తే అది మీకు ఇబ్బందిని కలిగిస్తోంది. ఎన్నో అధ్యయనాలు చెబుతున్న ప్రకారం రాత్రిపూట నగ్నంగా నిద్రించడం అనేది చాలా మంచి ఆలోచన. ఇది శరీరానికి కొత్త శక్తిని అందిస్తుంది. నగ్నంగా నిద్రించే వాళ్ళకి నిద్ర కూడా బాగా పడుతుందని, వారి మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుందని అధ్యయనాలు చెప్పాయి. అందుకనేమో మీ భర్తకు ఆ అలవాటు వచ్చింది. మీరు దీన్ని భూతద్దంలో పెట్టి చూడడం మానేయండి. పనిమనిషి కోసం మీ భర్తను మారమని చెప్పడం మంచి పద్ధతి కాదు.
Also Read: నా భర్త.. నాతో కాకుండా వేరొకరితో ఉంటున్నాడు – అడిగితే.. అలాంటి లాజిక్కు సమాధానం చెబుతున్నాడు
అన్ని విషయాల్లో కరెక్ట్ గా ఉన్న భర్త ఈ విషయంలో మాత్రం ఎందుకు మార్చుకోవాలి. ఇది ఆయన పూర్తిగా వ్యక్తిగత ఛాయిస్. ఎవరో పని మనిషి కోసం మీరు ఇలా అతనికి నచ్చినట్టు కాకుండా వేరేలా జీవించమని చెప్పడం మంచి పద్ధతి కాదు. ఒక్క గది తుడవకపోతే ఏమవుతుంది? ఆ ఒక్క గది మీరు కూడా తుడుచుకోవచ్చు. మీ భర్త స్వేచ్ఛకు భంగం రానివ్వకండి. మీరు అతనికి మద్దతుగా ఉండండి. అతనిది ఆరోగ్యకరమైన ఆలోచన. అందుకే ఆయన అంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. మిమ్మల్ని పిల్లల్ని చక్కగా చూడగలుస్తున్నారు. దానికి మీరు సంతోషించండి. అంతేగాని పనిమనిషి తుడవడానికి వస్తుందని ఆయనికి ఉన్న మంచి అలవాటును మాన్పించకండి. ఆ ఒక్క గది తప్ప మిగతా గదులను పనిమనిషిని శుభ్రం చేయమని చెప్పండి. ఆయన నిద్రలేచాక మీరు ఆ ఒక్క గది తుడుచుకుంటే మీ సంసార జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా గడిచిపోతాయి.