ఆర్ హోమ్స్ భాస్కర్ అరెస్ట్
⦿ ప్రీలాంచ్ పేరుతో దోచేసిన ఆర్‌జే హోమ్స్
⦿ 600 మంది నుంచి రూ.150 కోట్ల వసూలు
⦿ సినీ, క్రీడా ప్రముఖులతో యాడ్స్
⦿ మూడేళ్లలో ఫ్లాట్స్ ఇస్తామని బురిడీ
⦿ చైర్మన్, ఎండీని అరెస్ట్ చేసిన పోలీసులు
స్వేచ్ఛ క్రైంబ్యూరో: Hyderabad Crime: ప్రీలాంచ్ అంటూ ఆర్‌జే గ్రూప్ నడిపిన వ్యవహారం ఈ మధ్య వెలుగుచూసింది. 600 మందిని నిండా ముంచేసి ముఖం చాటేశారు సంస్థ చైర్మన్ భాస్కర్, ఎండీ సుధారాణి. ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. దీంతో వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పక్కా స్కెచ్‌తోనే వసూళ్లు
నగర శివారులోని పలు ఏరియాల్లో అపార్ట్మెంట్స్, ఫామ్ ల్యాండ్స్ అంటూ ఆర్‌జే వెంచర్స్ ప్రకటనలు ఇచ్చింది. సినీ, క్రీడా ప్రముఖుల చేత యాడ్స్ చేయించి సామాన్యులకు వల వేసింది. 2020 – 21 మధ్య వివిధ ప్రాజెక్టుల పేరుతో దాదాపు 600 మంది చేత 150 కోట్ల రూపాయల దాకా వసూలు చేసింది. మూడేళ్లలో ఫ్లాట్స్ ఇస్తామని చెప్పింది. కానీ, అలా జరగలేదు.
బాధితులు ఏమంటున్నారంటే?
2020 నవంబర్‌లో ఆర్ హోమ్స్ చదరపు గజం రూ.2,199కి ప్రీ లాంచ్ ఆఫర్‌తో ప్రకటించింది. కొనుగోలుదారులను ఆకర్షించడానికి మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, ఎంఎస్‌కే ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి వంటి ప్రముఖులతో ప్రకటనలు చేసి ప్రమోట్ చేసింది. చాలా మంది తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనే ఆశతో ఫ్లాట్లను రిజర్వ్ చేసుకున్నారు. ఆర్ హోమ్స్ ఛైర్మన్ భాస్కర్ గుప్తా, అతని భార్య సుధా రాణి కొనుగోలుదారులకు రెండు మూడు నెలల్లో అవసరమైన అన్ని అనుమతులను పొందుతారని, ప్రాజెక్ట్ 2023 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. డబ్బులు వసూలు చేశారు. కానీ, అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి కాలేదు.
ధరణి, హెచ్ఎండీఏ, ఎన్నికలు ఇలా సాకులు చెబుతూ వచ్చారు. అయితే, సిద్దిపేట, కర్ధనూర్ సహా పలు ప్రాంతాల్లో ఇదే విధంగా ఫామ్ ల్యాండ్ పేరుతో డబ్బులు వసులు చేసింది ఆర్‌జే గ్రూప్. దీనిపై నిలదీసేందుకు కూకట్‌పల్లి కార్యాలయానికి వెళ్లారు బాధితులు. చైర్మన్ ముఖం చాటేశాడు. దీంతో ఆర్‌జే గ్రూప్‌పై సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ క్రమంలోనే భాస్కర్, సుధారాణిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.