Fatty Liver: ఐటీ రంగం, ప్రస్తుతం దాని ప్యాకేజీలు, ఇతర సౌకర్యాల కారణంగా యువతను ఆకర్షించే రంగంగా మారింది. ప్రతి ఒక్కరూ ఐటీ రంగంలో పనిచేసి విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కానీ, ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే.. ఈ రంగంలో పనిచేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న వారు దాదాపు 80% మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారట.
హైదరాబాద్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఐటీ ఉద్యోగులలో జీవక్రియ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి పెరుగుతోందని రుజువైంది. ఎక్కువ గంటలు కూర్చొని పనిచేయడం, అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి కారణంగా ఈ వ్యాధి పెరుగుతోంది. ఐటీ ఉద్యోగుల్లో 71 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని, 34 శాతం మంది మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది.
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి?
ఫ్యాటీ లివర్ అనేది కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభించే తీవ్రమైన సమస్య. దీనిని సకాలంలో గుర్తించకపోతే ఇది లివర్ సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీస్తుంది. దీనివల్ల డయాబెటిస్, గుండె సమస్యలు కూడా వస్తాయి.
ఐటీ ఉద్యోగులలో ఫ్యాటీ లివర్‌కు కారణాలు:
ఐటీ రంగంలోని వ్యక్తులు ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు కూర్చుంటారు. ఇది వారి శారీరక శ్రమను తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీస్తుంది. కొన్నిసార్లు వీరు తినడానికి కూడా విరామం తీసుకోలేరు. అంతే కాకుండా సమయం కుదిరినప్పుడల్లా జంక్ ఫుడ్ తింటారు. ఇలా అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల కూడా కొవ్వు కాలేయ వ్యాధి వస్తుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
తాజా ఆహారం:
ఫ్యాటీ లివర్‌ను నివారించడానికి తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. అధిక కేలరీల ఆహారాలను ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినండి. చక్కెర , తీపి పదార్థాలను తక్కువ పరిమాణంలో తీసుకోండి. ఇది ఫ్యాటీ లివర్ సమస్య నుండి బయట పడటానికి మీకు ఉపయోగపడుతుంది.
వ్యాయామం:
ఫిట్‌గా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం లేదా యోగా చేయండి. వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
బ్రేక్ తప్పనిసరి:
ఎక్కువసేపు కూర్చోవడం మానుకోండి మరియు మధ్యలో చిన్న విరామాలు తీసుకోండి. ప్రతి గంటకోసారి లేచి కాసేపు నడవండి. దీని కోసం మీరు మీ ఫోన్‌లో రిమైండర్ అలారం కూడా సెట్ చేసుకోవచ్చు.
బరువు అదుపులో ఉంచుకోండి:
ఫ్యాటీ లివర్ సమస్యను నివారించడానికి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే బరువును నియంత్రించడం. పొట్ట, నడుము, ఇతర ప్రదేశాలలో కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్త వహించండి. అంతే కాకుండా బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.
ఒత్తిడి నిర్వహణ:
ఫ్యాటీ లివర్‌ను నివారించడానికి, ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఒత్తిడి కారణంగా కొవ్వు పెరగడం చాలా సాధారణం. పని ఒత్తిడిని తీసుకోకండి. మీ సామర్థ్యానికి అనుగుణంగా పని చేయండి. ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి. కనీసం 7-8 గంటలు సరైన నిద్ర ఉండేలా చూసుకోండి. పడుకునే ముందు స్క్రీన్ సమయాన్ని నివారించండి.
Also Read: లెమన్ వాటర్ తాగితే.. శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే !
స్మోకింగ్:
ఆల్కహాల్, స్మోకింగ్ కూడా కొవ్వు కాలేయ సమస్యలను కలిగిస్తాయి. మీరు వీటికి పూర్తిగా దూరంగా ఉండకపోతే మాత్రం కనీసం వీటి పరిమాణాన్ని పరిమితం చేయండి.
మీరు కూడా ఐటీ రంగంలో ఉంటే.. ఈ విషయాల పట్ల జాగ్రత్తలు వహించండి. తద్వారా మీరు ఫ్యాటీ లివర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి దూరంగా ఉండగలుగుతారు.