పనసకాయను అల్లంత దూరంలో కోస్తుంటేనే రుచికి, ముక్కుకి దాని వాసన అమోఘంగా తాకుతుంది. తినేయాలన్న కోరిక పుడుతుంది. ఇక ఆ తీయని పనస తొనలతో పాయసం చేస్తే ఎంత రుచిగా ఉంటుందో ఊహించుకోండి. కేరళలో ఎక్కువగా పనసకాయలతో పాయసం చేస్తారు. కేవలం కేరళలోనే కాదు మనం కూడా టేస్టీ పాయసం చేసుకోవచ్చు. పనస తొనలతో పాయసం ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. ఈ రెసిపీ ఫాలో అయిపోండి. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇలా వండి పెడితే మిమ్మల్ని కచ్చితంగా మెచ్చుకుంటారు. ముఖ్యంగా ఈ పనస పాయసం కొత్తగా రుచిగా ఉంటుంది.
పనస పాయసం చేయడానికి కావలసిన పదార్థాలు
పనస తొనలు – పన్నెండు
యాలకుల పొడి – చిటికెడు
కొబ్బరి తురుము – ఒక స్పూను
నెయ్యి – మూడు స్పూన్లు
జీడిపప్పులు – గుప్పెడు
కొబ్బరి పాలు – ముప్పావు కప్పు
నీళ్లు – పావు కప్పు
ఫ్రెష్ క్రీమ్ – అరకప్పు
పనస పాయసం రెసిపీ
☀ కుక్కర్లో పనస తొనలను వేసి అవి మునిగేంత వరకు నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి.
☀ పనస తొనలు మెత్తగా ఉడికేస్తాయి. తర్వాత కుక్కర్ మూత తీసి ఆ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి ఒక నిమిషం పాటు రుబ్బుకోండి.
☀ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయండి.
☀ ఆ నెయ్యిలోనే జీడిపప్పులను, కొబ్బరి తురుమును వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
☀ అందులోనే నీళ్లు పోసి మరిగించండి.
☀ నీళ్లలో ముందుగా గ్రైండ్ చేసుకున్న పనసకాయ పేస్ట్ ను వేసి బాగా కలపండి.
☀ ఇది చిక్కబడే వరకు అలా కలుపుతూ ఉండండి.
☀ తర్వాత ఒక స్పూను నెయ్యి, కొబ్బరిపాలు వేసి బాగా కలపండి.9. ఇది దగ్గరగా కాస్త చిక్కబడ్డాక జీడిపప్పులు, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోండి.
☀ అంతే కేరళ స్టైల్లో పనస పాయసం రెడీ అయినట్టే.
☀ దీనికి ప్రత్యేకంగా బెల్లాన్ని, పంచదారను జోడించాల్సిన అవసరం లేదు.
☀ ఎందుకంటే పనస తొనలు సాధారణంగానే చాలా తీపిగా ఉంటాయి.
☀ ఇందులోనే బెల్లం, పంచదార వంటివి వేస్తే ఆ తీపిదనం తట్టుకోలేకపోవచ్చు.
Also Read: ఇంట్లో రస్కులు మిగిలిపోయాయా? వాటితో ఇలా టేస్టీ పాయసం చేసేయండి
ఇందులో మనం పంచదారని వెయ్యలేదు. కాబట్టి అందరూ తినవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు కూడా దీన్ని కొద్దిగా టేస్ట్ చూడవచ్చు. పంచదార, బెల్లం వేస్తే మాత్రం వాటిని తినకపోవడమే ఉత్తమం. ఈ పనస పాయసం చేయడం చాలా సులువు. పనసకాయలు ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఒకసారి దీన్ని ప్రయత్నించి చూడండి. దీనిలో పాల మీగడ లేదా కోవా, ఫ్రెష్ క్రీము వంటివి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. వేడుకలప్పుడు, పండగలప్పుడు నైవేద్యంగా కూడా దీన్ని వండవచ్చు. కేరళలో ఎక్కువగా ఉండే పాయసాలలో ఈ పనస తొనల పాయసం కూడా ఒకటి.