Summer Heart Patients Tips: వేసవి కాలంలో గుండే జబ్బులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన వేడి ఉక్కపోతల మూలంగా ఒంట్లోంచి నీరు సోడియం వంటి లవణాల ధారాపాతంగా బయటకి వెళ్లిపోతుంటాయి. దీంతో తరచూ డీహైడ్రేషన్, వడదెబ్బకు గురవుతూ ఉంటారు. దీనికి తోడు ఒంట్లో నీరు లవణాల మధ్య సమతుల్యత లోపించడం వల్ల రక్తం చిక్కగా మారే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఈ పరిస్థితి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
చల్లగా ఉండడానికి ప్రయత్నించండి:
గుండె జబ్బులు ఉన్నవారు వేసవిలో కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్నవారు వేసవిలో తమ గుండె ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి గుండె ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. గుండె అధికంగా పనిచేయడం వల్ల మీరు మళ్లి ఆసుపత్రి పాలవుతారు. అందువల్ల, వేసవిలో మిమ్మల్ని మీరు చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.. మీ గుండె అదనపు భారం వేయకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి.
హైడ్రేటెడ్‌గా ఉండండి:
వేసవిలో మిమ్మల్ని మీరు చల్లగా ఉంచుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందుకోసం ఎండలో బయటికి వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ సమయం బయట ఉండటం వల్ల గుండె జబ్బు ఉన్నవారికి నష్టం కలిగిస్తుంది. అందుకే మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. అలాగే చల్లని ప్రదేశంలో ఉండాలి. ఫ్యాన్లు, కూలర్లు ఉపయోగిచండి. ముఖ్యంగా బయటికి వెళ్లే ముందు, వెళ్లేటప్పుడు, వెళ్లాక కూడా తగినంత నీరు, ఇతర ద్రవాలు త్రాగండి. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు.
వేడిని తగ్గించే ఆహారాలు:
సూర్యకాంతికి ఎక్కువ సమయం గురికావడం గుండె జబ్బు ఉన్నవారికి హానికరం కావచ్చు, కాబట్టి సూర్యకాంతికి గురి కాకుండా ఉండటానికి ప్రయత్నించండి. అలాగే వేడిని తగ్గించడానికి పండ్లు, కూరగాయలు, జ్యూస్‌లు , మజ్జిగ వంటి ఆహారాలను తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. మద్యం, ధూమపానం, కాఫీ వల్ల శరీరం నుంచి నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి ఇలాంటి ద్రవాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా వేడి వాతావరణంలో వ్యాయామం చేయకూడదు. ఉదయం లేదా సాయంత్రం చల్లగా ఉండే సమయాల్లో వ్యాయామం చేయాలి. మీరు సూర్యకాంతికి గురి కాకుండా ఉండేలా చూసుకోవాలి.
Also Read: మహిళలు మట్టి గాజులు వేసుకోవడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా?
తగినంత విశ్రాంతి:
వేడి వాతావరణంలో గుండె జబ్బులు ఉన్నావారు తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. వేడి వాతావరణంలో గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. కావున గుండె జబ్బులు ఉన్నవారికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే వీరు శీతల పానీయాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి జీర్ణకోశ వ్యవస్థ నుంచి రక్తంలోకి ద్రవాలు త్వరగా వెళ్లకుండా అడ్డుకుంటాయని పేర్కొంటున్నారు. అలాగే వదులైన, నూలు దుస్తులు ధరించడంతో పాటు ఇంట్లో, ఆఫీసుల్లో చల్లగా ఉండేలా చూసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.