Ponnaganti Leaves: ఆకుకూరలన్నీ ఆరోగ్యానికి మంచివే అయినా.. కొన్ని రకాల ఆకుకూరలు అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలో ఒకటి పొన్నగంటి ఆకు (Alternanthera sessilis). ఇది ఏడాది పొడవునా లభిస్తుంది. దీనిని చెన్నగంటి కూర అని కూడా పిలుస్తారు. పొన్నగంటి ఆకులో విటమిన్లు (A, B6, C), ఫోలేట్, రిబోఫ్లేవిన్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. అంతే కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా కాపాడతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న పొన్నగంటి కూర తినడం వల్ల కలిగే లాభాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొన్నగంటి ఆకు (Ponnaganti kura) అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:
కంటి చూపు మెరుగుపరుస్తుంది:
పొన్నగంటి ఆకు (Ponnaganti leaves) అత్యంత ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటి కంటి చూపును మెరుగుపరచడం. ఇందులో విటమిన్ ‘ఎ’ (బీటా కెరోటిన్ రూపంలో) అధికంగా ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరచడంలో, రేచీకటిని నివారించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. 48 రోజుల పాటు పొన్నగంటి కూరను నిరంతరంగా తీసుకుంటే కంటి సమస్యలు తగ్గుతాయని చెబుతారు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల పొన్నగంటి ఆకు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, వైరస్‌లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతే కాకుండా తరచుగా వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది.
బరువు నియంత్రణ:
పొన్నగంటి ఆకులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కూడా ఉంటాయి. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి.. అనవసరమైన ఆహారం తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి ఆహారం. ఆయుర్వేదం ప్రకారం.. దీనిని నేరుగా తింటే బరువు తగ్గుతారని, కందిపప్పు, నెయ్యితో కలిపి తింటే సన్నగా ఉన్నవారు బరువు పెరుగుతారని చెబుతారు.
గుండె ఆరోగ్యానికి రక్షణ:
పొన్నగంటి ఆకుల్లో లభించే కొన్ని నూనె పదార్థాలు, ఇతర పోషకాలు అధిక రక్తపోటును తగ్గించి, గుండె సమస్యలను అదుపులో ఉంచుతాయి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) చేరడాన్ని నివారిస్తుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
పొన్నగంటి ఆకులో ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. పేగు కదలికలను కూడా క్రమబద్ధీకరిస్తుంది. దీనిని జీర్ణక్రియను మెరుగుపరచడానికి సాంప్రదాయ ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.
శరీరానికి చలువ చేస్తుంది:
ఈ ఆకుకూర శరీరానికి చలువ చేస్తుందని, జ్వరం, అతిదాహం వంటి వాటిని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. శరీరంలోని వేడిని తగ్గించి.. తాజాదనాన్ని కూడా ఇది అందిస్తుంది.
ఎముకల ఆరోగ్యం:
పొన్నగంటి ఆకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల పెరుగుదలకు, వాటిని బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల వ్యాధులను నివారించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
చర్మానికి, జుట్టుకు ఉపయోగం:
పొన్నగంటి ఆకులోని పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా చర్మానికి సహజమైన కాంతిని ఇస్తాయి. ఇందులో ఉండే బయోటిన్ జుట్టుకు పోషణనిచ్చి.. ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
Also Read: సొరకాయ తినడం వల్ల.. ఎన్ని లాభాలుంటాయో తెలుసా ?
శ్వాసకోశ సమస్యలు:
ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు పొన్నగంటి ఆకు రసంలో తేనె కలిపి తీసుకుంటే ఉపశమనం పొందవచ్చని చెబుతారు. ఇది ఊపిరితిత్తుల్లోని కఫాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
పొన్నగంటి ఆకును కూరగా.. పప్పులో కలిపి, లేదా జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు. అయితే.. ఏదైనా కొత్త ఆహారాన్ని మీ లైఫ్ స్టైల్‌లో చేర్చుకునే ముందు.. ముఖ్యంగా మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.