ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా గుండెపోటు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు పెద్ద వయసు వారికి మాత్రమే వచ్చే గుండెపోటు ఇప్పుడు చిన్న వయసులోనూ వస్తోంది. మన దేశంలో 40 ఏళ్ల లోపు వారిలో గుండెపోటు కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గుండెపోటు చాలా కాలంగా కొలెస్ట్రాల్ పెరుగుదల, సరైన ఆహారం లేకపోవడం, ధూమపానం, రక్తపోటుతో ముడిపడి ఉన్నాయని అందరూ భావించారు. కానీ, ప్రాణాంతక గుండెపోటులో నోటి బాక్టీరియా కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తాజాగా అధ్యయనంలో వెల్లడయ్యింది. తాజాగా జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయన నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది.
హాస్పిటల్లో చికిత్స పొందకుండా అకస్మాత్తుగా మరణించిన 121 మంది వ్యక్తుల నుంచి కరోనరీ ప్లేక్లను, 96 వాస్కులర్ సర్జరీ రోగుల నుంచి ధమని నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు. దాదాపు సగం కేసులలో వారు బాక్టీరియల్ DNA ను కనుగొన్నారు. విరిడాన్స్ స్ట్రెప్టోకోకి అత్యంత సాధారణ బ్యాక్టీరియా, ఇది 42% కరోనరీ ప్లేక్లలో, 43% సర్జికల్ నమూనాలలో కనిపించింది. ఈ సాధారణ బ్యాక్టీరియా అథెరోస్క్లెరోటిక్ ప్లేక్‌లలో ఉంటూ బయోఫిల్మ్ లను ఏర్పరుస్తుంది. ధమనుల ప్లేక్ లలో లోతుగా పొందుపరచబడిన రక్షణ కవచాలలో బ్యాక్టీరియా గ్రూపులు ఏర్పడ్డాయి. ఇవి శరీరం రోగనిరోధక వ్యవస్థ ద్వారా గుర్తించబడవు. ప్లేక్‌లు చీలిపోయినప్పుడు, బ్యాక్టీరియా కణాలు విడుదలవుతాయి. ఇది గణనీయమైన రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. ఫలితంగా, ఈ వాపు ధమనుల గోడలను అస్థిరపరుస్తుంది. ఆకస్మిక చీలికకు కారణమవుతుంది. ఇది గుండెపోటులకు దారితీస్తుంది.
ల్యాబోరేటరీ పరీక్షల ప్రకారం, విరిడాన్స్ స్ట్రెప్టోకోకి ధమనుల వాపుకు దోహదపడే బ్యాక్టీరియా సిగ్నలింగ్ మార్గం అయిన టోల్-లైక్ రిసెప్టర్ 2 (TLR2)ను సక్రియం చేస్తుంది. హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో నోటి పరిశుభ్రత, ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ధమనులలో బ్యాక్టీరియా బయోఫిల్మ్‌లు ఏర్పడకుండా నిరోధించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కనీసం రోజుకు రెండుసార్లు రెండు నిమిషాలు దంతాలను బ్రష్ చేయాలి. నాలుకను, దంతాల మధ్య ఫ్లాస్, వాటర్ ఫ్లాసర్లతో శుభ్రం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. చక్కెర పదార్థాలను పరిమితం చేయాలి. ప్రతి 3-4 నెలలకు టూత్ బ్రష్ ను మార్చాలి. చెకప్‌ల కోసం ఏటా దంతవైద్యుడి దగ్గరికి వెళ్లాలి. ఎందుకంటే వారు మీ దంతాల పరిస్థితిని వివరిస్తారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ఇట్టే చెప్పేస్తారు. దంతాలు శుభ్రంగా ఉండేందుకు సిఫార్సులు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, పొగాకు ఉత్పత్తులను నివారించాలి. ఒకవేళ ఏవైనా నోటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే మీ దంతవైద్యుడిని సంప్రదించడ మంచిది. గుండెపోటు మాత్రమే కాదు, పలు ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడంలో ఉపయోగపడుతుంది.
Read Also:ఈ దేశంలో ఇంటర్నెట్ లేదు.. సోషల్ మీడియా లేదు.. ఇంకా పాత విధానాల్లోనే జీవిస్తున్న జనం!