Pre monsoon beauty tips: ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కలిగిస్తూ.. వచ్చే వర్షాకాలం మనసుకు ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో.. చర్మానికి, జుట్టుకు అన్ని సమస్యలను మోసుకొస్తుంది. వాతావరణంలో.. ఒక్కసారిగా పెరిగే తేమ వల్ల స్కాల్ప్‌పై చుండ్రు, ముఖంపై జిడ్డు పెరిగి మొటిమలు రావడం సర్వసాధారణం. అయితే.. వర్షాలు పూర్తిగా పడకముందే.. మనం కొన్ని ముందస్తు సన్నాహాలు , జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను రాకుండా అడ్డుకోవచ్చు. ఈ వర్షాకాలంలో మీ అందాన్ని రెట్టింపు చేసే ఆ సింపుల్ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వానాకాలం ముందే.. బ్యూటీ కేర్:
వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు మన శరీరం దానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. వర్షాకాలంలో.. గాలిలో ఉండే తేమ బ్యాక్టీరియా, ఫంగస్ పెరగడానికి అనుకూలంగా మారుతుంది. అందుకే.. ఈ సీజన్ ప్రారంభంలోనే చర్మం, జుట్టు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.
1. సెలసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ :
వర్షాకాలంలో చర్మంపై సెబమ్ (సహజ నూనెలు) ఉత్పత్తి పెరుగుతుంది. ఇది రంధ్రాలను మూసివేసి మొటిమలకు దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడే మీ సాధారణ ఫేస్ వాష్ స్థానంలో సెలసిలిక్ యాసిడ్ లేదా టీ ట్రీ ఆయిల్ ఉన్న క్లెన్సర్‌ను వాడటం ప్రారంభించండి. ఇది చర్మంపై జిడ్డును నియంత్రిస్తుంది.
2. క్లే ఫేస్ ప్యాక్స్ :
వారానికి రెండు సార్లు ముల్తానీ మిట్టి లేదా చందనం ప్యాక్ వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇవి చర్మంలోని అదనపు తేమను, మురికిని లాగేసి ముఖాన్ని తాజాగా ఉంచుతాయి. కేవలం 15 నిమిషాలు ప్యాక్ వేసుకుని చల్లటి నీటితో కడిగేస్తే సరి పోతుంది.
3. లైట్ వెయిట్ మాయిశ్చరైజర్:
చాలామంది వానాకాలంలో జిడ్డుగా ఉంటుందని మాయిశ్చరైజర్ రాయడం మానేస్తారు. కానీ అది తప్పు. చర్మానికి తేమ అందకపోతే అది మరింత జిడ్డును ఉత్పత్తి చేస్తుంది. అందుకే జెల్-బేస్డ్ లేదా వాటర్-బేస్డ్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్‌ను ఎంచుకోండి.
చుండ్రు సమస్యకు చెక్:
4. యాంటీ-ఫంగల్ హెయిర్ ఆయిల్స్:
వర్షాకాలపు తేమ వల్ల తలలో ‘మలాసెసియా’ అనే ఫంగస్ పెరిగి చుండ్రు తీవ్రమవుతుంది. దీనికి ముందే చెక్ పెట్టడానికి కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ లేదా నిమ్మరసం కలిపి వారానికి రెండు సార్లు తలకు పట్టించి మసాజ్ చేయండి. ఇది స్కాల్ప్‌ను ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
5. వేప నీటితో తలస్నానం:
వేపలో అద్భుతమైన యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్ గుణాలు ఉన్నాయి. గుప్పెడు వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటిని చల్లార్చండి. వారానికి ఒకసారి షాంపూ చేసిన తర్వాత ఈ వేప నీటితో జుట్టును చివరగా కడగడం వల్ల చుండ్రు, తలలో దురద వంటి సమస్యలు అస్సలు రావు.
Also Read: టాబ్లెట్లతో పనిలేకుండా షుగర్ కంట్రోల్.. రోజును ఈ డ్రింక్స్‌తో స్టార్ట్ చేస్తే చాలు!
ఈ తప్పులు అస్సలు చేయకండి:
తడి జుట్టుతో ఉండటం: వర్షంలో తడిచినా లేదా తలస్నానం చేసినా జుట్టును వెంటనే పూర్తిగా ఆరబెట్టుకోవాలి. తలలో తేమ ఎక్కువ సేపు ఉంటే చుండ్రు వేగంగా పెరుగుతుంది.
హెవీ మేకప్ వద్దు: ఈ సీజన్‌లో హెవీ ఫౌండేషన్స్, క్రీమ్స్ వాడటం వల్ల చర్మ రంధ్రాలు పూడుకుపోయి పింపుల్స్ వస్తాయి. నో-మేకప్ లేదా మినిమల్ లుక్‌ను ప్రిఫర్ చేయండి.
నీళ్లు తక్కువగా తాగడం: వాతావరణం చల్లగా ఉండటం వల్ల నీళ్లు తాగడం తగ్గిస్తారు. కానీ లోపలి నుంచి చర్మం హైడ్రేటెడ్‌గా ఉండాలంటే రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి.
వర్షాకాలం తెచ్చే చర్మ, జుట్టు సమస్యలను చూసి కంగారు పడాల్సిన పనిలేదు. వానలు పడటానికి ముందే ఈ చిన్న చిన్న హోమ్ రెమెడీస్, బ్యూటీ రొటీన్‌ను అలవాటు చేసుకుంటే.. మీరు ఈ వర్షాకాలన్ని కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మీ చర్మాన్ని ప్రకాశవంతంగా.. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోండి.