ఎవరితోనైనా కలిసి జీవించాలంటే నిజాయితీ చాలా ముఖ్యం. దీని అర్థం ఎప్పుడూ నిజమే మాట్లాడాలని మాత్రం కాదు. కొన్నిసార్లు ఆ బంధాన్ని కాపాడుకోవడం కోసం చిన్నచిన్న అబద్ధాలు కూడా చెప్పవచ్చని అంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. అబద్ధాలు ఆ బంధాన్ని నిలబెట్టడానికి ఎంతో దోహదపడతాయి. అలాగే జీవిత భాగస్వామి ప్రేమను కూడా తెలియజేస్తాయి.
ఎలాంటి అబద్ధాలు
మీరు చెప్పే అబద్ధాలు పెద్ద తప్పులను దాచి పెట్టేవిలా ఉండకూడదు. ప్రేమను ఆనందాన్ని పంచే విధంగా ఉండాలి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైకాలజిస్ట్ రాబిన్ డన్‌బోర్ కూడా ఒక రిలేషన్ షిప్ లో అనుబంధాలను కాపాడుకోవడానికి చెప్పే చిన్న చిన్న అబద్ధాలు… ఆ బంధాలను మరింత దృఢంగా మారుస్తాయని కనుగొన్నారు. కాబట్టి మీ సంబంధానికి ఆరోగ్యకరమైన కొన్ని అబద్ధాలను చెప్పడం మంచిదే.
నువ్వెంతో అందంగా ఉన్నావో
ప్రతి ఒక్కరూ తమ భాగస్వామికి తాము అందంగా కనిపించాలని కోరుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో మీ జీవిత భాగస్వామి అందంగా ఉన్నా లేకపోయినా ఆమెను సంతోషపెట్టడానికి నువ్వు చాలా అందగత్తెవని పదేపదే చెబుతూ ఉండాలి. నీ కళ్ళు బాగుంటాయని, నీ నవ్వు బావుంటుందని ఇలా చెబుతూ ఉంటే ఆమె ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆనందంలోనే మీ అనుబంధాన్ని మరింత బలంగా మార్చుకోవచ్చు.
మీకు సరైనది కాదు అనిపించినా..
ఒక్కసారి మీ భాగస్వామి చెప్పిన అభిప్రాయాలతో మీరు ఏకీభవించలేకపోవచ్చు. అది సరైనదని మీకు అనిపించకపోవచ్చు. కానీ కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా మీ భాగస్వామితో ఏకీభవించాల్సి వస్తుంది. అతను చెప్పిందే కరెక్ట్ అని ఒప్పుకోవాల్సి వస్తుంది. దానికి అబద్ధం ఆడాల్సి వస్తుంది. అప్పుడు కూడా మీ అనుబంధం బలపడుతుంది తప్ప వీగిపోదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కూడా అబద్ధం చెప్పవచ్చు.
మీ ప్రేమను రెట్టింపు చేసి చెప్పండి.. అబద్దమైన పర్వాలేదు
జీవిత భాగస్వామి ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పడానికి ఇప్పుడు సంకోచించకండి. మీరు చెప్పే మాటలు మీ భాగస్వామిని మీకు మరింత దగ్గరగా చేస్తాయి. మీ అనుబంధాన్ని మరింత దృఢపరుచుకోవడం కోసం అప్పుడప్పుడు ఆ వారి మీద ఉన్న ప్రేమను రెట్టింపు చేసి చెబుతూ ఉండండి. ఇలా చెప్పడం వల్ల మీ బంధం బలంగా మారుతుంది. ఇలాంటి సందర్భంలో అబద్ధం చెప్పడం కూడా మంచిదే. జీవిత భాగస్వామి మీపై మరింత ప్రేమను గౌరవాన్ని పెంచుకుంటుంది.
ప్రేమ, ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి మాత్రమే..
ఒక అనుబంధంలో అబద్ధాలు ఎప్పుడు చెప్పవచ్చో మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రేమను, ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి మాత్రమే అబద్దాలను ఉపయోగించాలి. కానీ మోసం చేయడానికి ఎదుటివారిని ఎలా మార్చడానికి మాత్రం అబద్ధాలు చెప్పకూడదు. తప్పు చేసినప్పుడు నిజాయితీగా క్షమాపణ చెప్పాలి. ఏదైనా కూడా బహిరంగంగా మాట్లాడుకోవాలి. అప్పుడే అబద్ధం నిలబడుతుంది. నిజమైన సంబంధానికి పునాది వేయాలంటే జీవిత భాగస్వామిలు ఇద్దరూ ఎంత నిజాయితీగా ఉంటే అంత మంచిది.
Also Read: మీ భర్త ఎక్కువగా అబద్దాలు చెబుతున్నాడా? అతడి బుద్ధిని మార్చాలంటే ఇలా చేయండి