Lunch Box Deaths: మనం రోజూ ఉపయోగించే ప్లాస్టిక్ కంటైనర్లు, స్నాక్స్ చుట్టూ ఉండే మెరిసే ర్యాపర్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ, ఇవి మన గుండె ఆరోగ్యానికి పెను ప్రమాదం అని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. లాన్సెట్ ఈ బయోమెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, ప్లాస్టిక్‌లలో ఉండే తాలేట్స్ అనే కెమికల్స్ కారణంగా గుండె జబ్బులు పెరిగిపోతున్నాయట. వీటి వల్ల మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇండియాలోనే ఈ సమస్య తీవ్రంగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎందుకు ప్రమాదకరం?
ప్లాస్టిక్‌లను బలంగా, సాగేలా చేసే తాలేట్స్ కెమికల్స్ ఆహార కంటైనర్లు, ర్యాపర్లు, సబ్బులు, షాంపూలు, మేకప్, పెర్ఫ్యూమ్‌లు, వైద్య పరికరాల్లో ఉంటాయి. ఇవి ఆహారం, దుమ్ము ద్వారా మన శరీరంలోకి చేరతాయి. శరీరంలోకి చేరిన ఈ కెమికల్స్ హార్మోన్‌లను అస్తవ్యస్తం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాల్లో మంటను కలిగిస్తాయట. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఇండియాలోనే ఎందుకు?
ప్రపంచవ్యాప్తంగా ఇండియాలోనే తాలేట్స్ సంబంధిత గుండె జబ్బు మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 2018లో 55-64 సంవత్సరాల వయస్సు గల వారిలో డై తాలేట్స్ అనే రసాయనం వల్ల 1,03,587 మరణాలు సంభవించాయట. ఇది చైనా (60,937 మరణాలు), ఇండోనేషియా (19,761 మరణాలు) కంటే చాలా ఎక్కువ.
కారణాలు ఏమిటి?
సిటీల్లో ప్యాక్ చేసిన ఆహారాలు, ప్లాస్టిక్ కంటైనర్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. మహిళలు మేకప్, లోషన్. పర్ఫ్యూమ్ వంటి తాలేట్స్ ఉన్న ఉత్పత్తులను ఎక్కువగా వాడుతారు. వీటి వల్లే ఈ మరణాల సంఖ్య పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి.
అంతేకాకుండా ప్లాస్టిక్ వస్తువులపై కఠిన నియంత్రణ లేకపోవడం, ప్లాస్టిక్ వ్యర్థాలు, DEHP ఉన్న ఉత్పత్తుల వినియోగం అధికంగా ఉండడం కూడా దీనికి కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రజల్లో, ఆరోగ్య వ్యవస్థల్లో ఈ రసాయనాల గురించి అవగాహన లేకపోవడం కూడా దీనికి కారణం కావచ్చట.
ఆర్థిక నష్టం ఎంత?
ఈ మరణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 510 బిలియన్ నుంచి 3.74 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారం ఏర్పడిందని అధ్యయనం అంచనా వేసింది.
ఏం చేయాలి?
ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే ప్లాస్టిక్ కంటైనర్లకు బదులు గాజు, స్టీల్ కంటైనర్లు వాడాలని నిపుణులు చెబుతున్నారు. ప్యాక్ చేసిన ఆహారాల వినియోగాన్ని తగ్గించడం మంచిది. తాలేట్ లేని సౌందర్య సాధనాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.