AP Govt: ఏపీ రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఇదొక సూపర్ ఛాన్స్ అని చెప్పవచ్చు. వెంటనే రైతన్నా.. మీ అకౌంట్ చెక్ చేసుకోండి. మిమ్మల్ని ఆదుకొనేందుకు యుద్ధ ప్రాతిపదికన కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకు ఆ గుడ్ న్యూస్ ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథనం తప్పక చదవండి.
ఏపీలో వర్షం ఎఫెక్ట్..
ఏపీలో గత రెండు రోజులుగా వర్షం వదలడం లేదు. శుభమా అంటూ పంట చేతికి వచ్చిన సమయంలో వర్షం కురవగా, రైతన్నలకు కన్నీరే దిక్కయింది. ప్రధానంగా అనంతపురం, విజయవాడ, ప్రకాశం, ఏలూరు, మంగళగిరి, పలు ప్రాంతాలలో వరుణుడు పగబట్టినట్లే వర్షం కురిపించాడు. దీనితో సామాన్య ప్రజానీకంతో పాటు చిన్నపాటి వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు ఉరుములు మెరుపులతో కురిసిన వర్షం కాబట్టి పలు జిల్లాలలో పిడుగులు పడి 10 మంది మృతి చెందారు.
2,224 హెక్టార్లలో వరిపంట నష్టం
అకాల వర్షాలతో రాష్ట్రంలో 2,224 హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాల నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ప్రధానంగా పశ్చిమ గోదావరి, నంద్యాల, కాకినాడ, సత్యసాయి జిల్లాల్లో ఈ పంటలకు నష్టం వాటిల్లిందని ఆ నివేదిక సారాంశం. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 మండలాల్లో 1,033 హెక్టార్లలో వరిపంట దెబ్బతిందని వివరించారు. నంద్యాల జిల్లాలో 641 హెక్టార్లలో, కాకినాడ జిల్లాలో 530 హెక్టార్లలో, సత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో వరిపంట దెబ్బతిందని అధికారులు వివరించారు.
138 హెక్టార్లలలో ఉద్యాన పంటలకు నష్టం
అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో దెబ్బతిన్న హార్టికల్చర్ పంటల వివరాలను అధికారులు ప్రకటించారు. అరటి, బొప్పాయి, మామిడి, తదితర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ఎక్కువగా అరటి, మామిడి పంటలకు నష్ట వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 138 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉద్యానవన పంటలకు నష్టం కలిగిందని అధికారులు వివరించారు.
సీఎం చంద్రబాబు సమీక్ష..
ఏపీ వరదలపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరద ఉధృతి వల్ల పంట నష్టపోయిన రైతుల వివరాలను సీఎం ఆరా తీశారు. విపత్తుల సమయంలో ప్రభుత్వ అధికారులు యంత్రాంగం మాణవీయ కోణంలో పనిచేయాలన్నారు. విపత్తులు వచ్చినప్పుడు కేవలం సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందుస్తుగా యంత్రాంగం సన్నద్దమవ్వాలన్నారు.
గతంలో హుద్ హుద్ తుఫాను సమయంలో ప్రాణనష్టం కలగకుండా సమర్థవంతంగా పనిచేసిన తీరును ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విపత్తుల సమయంలో ఇలాంటి ముందస్తు సన్నద్ధత ఎంతో అవసరమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగం నుంచి విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఎప్పటికప్పుడు వాతావరణం గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంటామన్నారు. జిల్లా కలెక్టర్లందరూ దీనికనుగుణంగా ఆయా జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లో మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రైతులకు పరిహారం..
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంటనష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా పిడుగుపాటుకు గురై చనిపోయిన 8 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం కూడా తక్షణమే అందించాలని ఆదేశించారు. అయితే నష్టపోయిన రైతుల జాబితాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేయగా, ఆ జాబితాలో మీరున్నారో లేదో ఒకసారి వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని అడిగి రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read: Divvala Madhuri: దివ్వెల మాధురి ఆస్తులు కోట్లల్లోనే.. పాపం దువ్వాడ మాత్రం?
ధాన్యం కొనుగోలుపై సీఎం మాట
రబీలో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని పౌరసరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సౌరబ్ గౌర్ సీఎంకు వివరించారు. ఇప్పటికే 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. వర్షాలకు రంగు మారిన ధాన్యం కూడా కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతుల వద్దనున్న ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రావాల్సిన పంటకంటే అదనంగా వస్తే అవసరమైతే కేంద్రంతో మాట్లాడి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏ ఒక్క రైతు నుంచి కూడా తమవద్ద ధాన్యం కొనలేదనే మాట ఉత్పన్నం కాకూడదని అన్నారు.