CM Revanth Reddy: మిస్ వరల్డ్- 2025 పోటీలు సక్సెస్ ఫుల్‌గా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మే 10వ నుంచి 31వ తేదీ వరకు జరిగే ప్రపంచ స్థాయి పోటీల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.
మిస్ వరల్డ్ -2025 ఏర్పాట్లపై సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం ఎ.రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంతో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, డీజీపీ జితేందర్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ పోలీస్ కమిషనర్ జి.సుధీర్బాబు, ఏడీజీపీ స్టీఫెన్ రవీంద్రతో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పోటీల్లో 116 దేశాలకు చెందిన యువతులు
తెలంగాణ ఖ్యాతిని విశ్వమంతటా పరిచయం చేసేందుకు ఉపయోగపడే మిస్ వరల్డ్- 2025 వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా వారికి ఆతిథ్యమివ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతించాలి..
పోటీదారులతో పాటు దేశ విదేశాల నుంచి ఈవెంట్ కవరేజీకి దాదాపు మూడు వేల మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. వివిధ దేశాల నుంచి పోటీలకు వచ్చే వారిని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతించాలని, పోటీలు పూర్తయ్యేంత వరకు ఎక్కగా చిన్న పొరపాటు లేకుండా ఏర్పాట్లు ఉండాలని సీఎం అధికారులను హెచ్చరించారు. పర్యాటక శాఖతో పాటు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, అధికారులందరూ సమర్థంగా తమకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
మే 10 నుంచి 31వ తేదీ వరకు వరుసగా జరిగే కార్యక్రమాల షెడ్యూలుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యక్రమానికి ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించాలని సూచించారు. మే 10వ తేదీన సాయంత్రం హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్డేడియంలో మిస్ వరల్డ్ ప్రారంభోత్సవం నుంచి మే 31వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలే వరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
భద్రత కట్టుదిట్టంగా ఉండాలి..
హైదరాబాద్ లోని చార్మినార్, లాడ్ బజార్తో పాటు తెలంగాణ తల్లి, సెక్రెటేరియట్తో పాటు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్న నేపథ్యంలో, అవసరమైన రవాణా, వసతులు కల్పించాలన్నారు. అక్కడ భద్రత కట్టుదిట్టంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అనుకోని అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా వాటిని అధిగమించే ప్రత్యామ్నాయ ప్రణాళికలను అధికారులు రూపొందించుకోవాలని ఆదేశించారు. మహిళా సాధికారతను చాటిచెప్పేలా రాష్ట్రంలో ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ సందర్శనతో పాటు, ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సెమీఫైనల్స్ తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
Also Read: Indian Military Academy: గుడ్‌న్యూస్.. ఇండియన్ మిలిటరీ అకాడమీలో ప్రవేశాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు..!
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఈదురు గాలులు, వర్షాలు వచ్చినా గ్రేటర్ సిటీ పరిధిలో ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిస్ వరల్డ్ కు వచ్చే విదేశీ అతిథులు బస చేసే హోటళ్లతో పాటు గచ్చిబౌలి స్టేడియం, చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, సెక్రెటేరియట్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులను ప్రభుత్వం తరఫున మిస్ వరల్డ్-2025 ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, బీసీ, ఎస్సీ ఎస్టీ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కస్తూరిబా పాఠశాలలకు చెందిన విద్యార్థులను కూడా ఒకరోజు మిస్ వరల్డ్ వేడుకలు చూపించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వేడుకలు జరిగే రోజుల్లో హైదరాబాద్ అంతటా మిస్ వరల్డ్ సందడి కనిపించేలా తోరణాలు, లైటింగ్, హోర్డింగ్ లతో పాటు సిటీలోని ముఖ్యమైన జంక్షన్లు, చారిత్రక ప్రదేశాలను అందంగా అలంకరించాలని అన్నారు.