No British Rule Indian State| ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. 1947లో బ్రిటిష్ పాలన నుంచి భారత్ స్వేచ్ఛ పొందిన రోజును ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటాం. అయితే దేశంలోని ఒక రాష్ట్రం మాత్రం ఎప్పుడూ బ్రిటీష్ పాలన లేదు.
ఆ ప్రత్యేక రాష్ట్రమే గోవా. గోవా స్వాతంత్ర్య ప్రయాణం మాత్రం చాలా భిన్నంగా సాగింది. 1947లో భారత్ స్వతంత్రం అయినప్పటికీ గోవా అప్పటికీ పోర్చుగీసుల పాలనలోనే ఉంది. చివరకు 1961లో జరిగిన సైనిక చర్య తర్వాత గోవా భారత్‌లో భాగమైంది.
పోర్చుగీసులు 1510లో గోవాపై తమ ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పోర్చుగీస్ నావికాదళ అధికారి అఫోన్సో డి అల్బుకర్క్.. ఆ సమయంలో గోవాను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు గోవా బీజాపూర్ సుల్తాన్ యూసుఫ్ ఆదిల్ షా ఆధీనంలో ఉండేది. పోర్చుగీసులు సుల్తాన్‌ని ఓడించి గోవాని ఆక్రమించుకున్నారు. తర్వాత గోవా పోర్చుగీస్ తూర్పు సామ్రాజ్యానికి ముఖ్యమైన కేంద్రంగా మారింది.
ఇదే సమయంలో బ్రిటిషర్లు భారతదేశంలోని చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే గోవాలో మాత్రం పోర్చుగీసుల పాలన కొనసాగింది. నెపోలియన్ యుద్ధాల సమయంలో బ్రిటిష్ సైన్యం గోవాను కొంతకాలం ఆక్రమించింది. కానీ పోర్చుగీసులు తిరిగి గోవాని బ్రిటీష్ పాలకుల చేతి నుంచి తిరిగి పొందారు.
1947 ఆగస్టు 15న భారత్ బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్ర దేశంగా మారింది. అయితే గోవా మరో 14 సంవత్సరాలు పోర్చుగీసుల ఆధీనంలోనే కొనసాగింది. పోర్చుగీస్ ప్రభుత్వం గోవాను భారత్‌కు అప్పగించడానికి అంగీకరించలేదు. ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మొదట శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించారు. అయితే పోర్చుగీస్ ప్రభుత్వం గోవా విలీనంపై చర్చించడానికి నిరాకరించింది. దీంతో గోవాలో స్వాతంత్ర్య ఉద్యమం మరింత బలపడింది.
గోవా జాతీయవాద ఉద్యమంలో ‘ట్రిస్టావో డి బ్రగాంజా కున్హా’ కీలక పాత్ర పోషించారు. ఆయన 1928లో గోవా నేషనల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. 1946లో సామాజికవాద నాయకుడు రామ్ మనోహర్ లోహియా గోవాలో కీలక ఉద్యమాన్ని నడిపారు. ఈ ఉద్యమం పౌర హక్కులు, స్వేచ్ఛ కోసం ప్రజల్లో చైతన్యం పెంచింది. తర్వాత శాంతియుత నిరసనలతో పాటు కొన్ని సాయుధ ఉద్యమాలు కూడా జరిగాయి. ఆజాద్ గోమంతక్ దళ్ వంటి సంస్థలు పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాయి.
1961లో భారత్, పోర్చుగల్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. నవంబర్ 24న పోర్చుగీస్ దళాలు భారత ప్రయాణికుల నౌకపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. దీంతో భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకపోవడంతో భారత్ సైనిక చర్యకు సిద్ధమైంది.
1961 డిసెంబర్ 17-18 తేదీల్లో భారత సాయుధ దళాలు ఆపరేషన్ విజయ్ ప్రారంభించాయి. ఈ చర్యలో సుమారు 30,000 మంది భారత సైనికులు పాల్గొన్నారు. భారత నౌకాదళం సముద్ర మార్గాలను నియంత్రించింది. వాయుసేన కూడా కీలకమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది.
భారత సైన్యం, నౌకాదళం, వాయుసేన సమన్వయంతో పోర్చుగీస్ ప్రతిఘటనను త్వరగా అధిగమించాయి.
సుమారు 36 గంటల్లో ఈ సైనిక చర్య ముగిసింది. డిసెంబర్ 19న పోర్చుగీస్ గవర్నర్ జనరల్ లొంగుబాటు పత్రంపై సంతకం చేశారు. దీంతో గోవాలో సుమారు 450 సంవత్సరాల పోర్చుగీస్ పాలన ముగిసింది.
Also Read: చాణక్య నీతి.. మీ ఇంటి ప్రశాంతత చెడగొట్టే 5 రకాలు అతిథులు వీరే..
డిసెంబర్ 19ను గోవా విమోచన దినోత్సవంగా ప్రతి సంవత్సరం గుర్తుచేసుకుంటారు. గోవా తొలుత దమన్, డయ్యూతో కలిసి కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది. 1987 మే 30న గోవా పూర్తిస్థాయి రాష్ట్రంగా అవతరించింది.
గోవా చరిత్ర.. భారత స్వాతంత్ర్య పోరాటంలో కేవలం ఒక్క సంఘటన కాదని గుర్తుచేస్తుంది. వివిధ ప్రాంతాలు వేర్వేరు వలస పాలకుల నుంచి వేర్వేరు సమయాల్లో స్వేచ్ఛ పొందాయి. అందుకే భారత చరిత్రలో గోవా ఇండిపెండెన్స్ ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచింది.
Also Read: ఫైవ్ స్టార్ హోటల్ కంటే స్ట్రీట్ ఫుడ్ బెటర్.. ఫుడ్ ఇంజినీర్ చెప్పిన కారణాలివే