Bandi Sanjay: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం, ప్రతిపక్ష విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరిస్తూనే.. రాష్ట్రంలోని కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీల తీరును ఆయన తప్పుబట్టారు. తెలంగాణ ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
యువతకు ప్రాధాన్యం.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు
ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను బండి సంజయ్ హర్షించారు. దేశంలో కోటి మంది యువతకు ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ అందించడం, పోటీ పరీక్షల కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ సౌకర్యం కల్పించడం గొప్ప పరిణామమన్నారు. తెలంగాణ యువత పక్షాన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రోజ్ గార్ మేళా ద్వారా ఇప్పటివరకు 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు.
వందేమాతరం గౌరవం.. ఎంఐఎంకు సవాల్
అసెంబ్లీలో గతంలో వందేమాతర గీతాలాపనను ఎంఐఎం బహిష్కరించడాన్ని, దానికి కాంగ్రెస్ మద్దతు తెలపడాన్ని సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఇకపై వందేమాతరాన్ని అవమానించే వారిని దేశద్రోహులుగా పరిగణిస్తామని, నిబంధనల ప్రకారం 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా తప్పదని హెచ్చరించారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద లక్షలాది మందితో వందేమాతరం గీతాలాపన చేయిస్తామని, ధైర్యం ఉంటే ఎంఐఎం నేతలు అడ్డుకోవాలని సవాల్ విసిరారు.
ఉచిత రేషన్ బియ్యం.. కాంగ్రెస్ తీరుపై విమర్శలు
రేషన్ కార్డులపై కేంద్రం ఇస్తున్న సహకారాన్ని దాచిపెడుతూ సీఎం, మంత్రుల ఫోటోలు వేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణలోని 57 లక్షల కార్డుదారులకు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ‘సొమ్ము ఒకడిది.. సోకు ఇంకొకరిదా?’ అని ప్రశ్నిస్తూ.. ధైర్యం ఉంటే మోదీ బియ్యం వద్దని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక తరహాలోనే ఇక్కడ కూడా స్మార్ట్ కార్డుల పేరిట ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర నిధులు.. రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాలు
గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్ర నిధులను తమ ఖాతాలో వేసుకుంటోందని సంజయ్ విమర్శించారు. పంచాయతీల అభివృద్ధికి, పీఎంఏవై ఇళ్లకు కేంద్రం నిధులిస్తే.. తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో జనాభాతో సంబంధం లేకుండా అక్రమంగా కార్డులు ఇస్తున్నారని, ఆదాయ పన్ను చెల్లించే వారికి కూడా రేషన్ బియ్యం ఇస్తున్నారా అని ప్రశ్నించారు.
Also Read: తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు.. స్మార్ట్ రేషన్ కార్డులు, EV ఆటో సబ్సిడీ పూర్తి వివరాలు!